నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్
మొదటి దశ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే
తొలి పోరులో టైటాన్స్‌తో బుల్స్ ‘ఢీ’
రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: పది సీజన్లుగా కబడ్డీ అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడాది వ్యవధిలోపే మళ్లీ ముందుకు వచ్చింది. పీకేఎల్ 11వ సీజన్‌కు నేటితో తెర లేవనుంది. గత సీజన్‌కంటే భిన్నంగా ఈసారి మూడు వేదికలకే టోర్నీ లీగ్ దశను పరిమితం చేస్తున్నారు. సీజన్–10 ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోనే నేడు టోర్నీ ప్రారంభం అవుతుంది. నవంబర్ 9 వరకు ఇక్కడే పోటీలు జరుగుతాయి.
ఆ తర్వాత నోయిడా, పుణే తర్వాతి దశ పోటీలకు ఆతిథ్యం ఇస్తాయి. మరోసారి 12 టీమ్‌లతోనే పీకేఆల్ జరగనుండగా... లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ (ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2, రెండు సెమీఫైనల్స్, ఫైనల్) ఐదు మ్యాచ్‌లతో కలిపి ఓవరాల్‌గా 137 మ్యాచ్‌లు పీకేఎల్‌లో జరుగుతాయి.
టోర్నీ తొలిరోజు జరిగే మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో తలపడనుండగా... మాజీ చాంపియన్స్ దబంగ్ ఢిల్లీ, యు ముంబా మధ్య రెండో మ్యాచ్ మ్యాచ్ (రాత్రి 9 గంటల నుంచి) జరుగుతుంది. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 24న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత నాకౌట్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేస్తారు.
భారీ వేలంతో మొదలు...
సీజన్–11 కోసం నిర్వహించిన వేలంలో ఆటగాళ్లకు భారీ విలువ పలికింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో రూ. 1 కోటికి పైగా విలువతో అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో ఏకంగా 8 మంది ఉండటం విశేషం. అత్యధికంగా తమిళ్ తలైవాస్ సచిన్ తన్వర్‌ను రూ.2 కోట్ల 15 లక్షలకు దక్కించుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు గురువారం హైదరాబాద్‌లో ట్రోఫీ ఆవిష్కరణ సహా లీగ్ ప్రచార కార్యక్రమం జరిగింది.
పీకేఎల్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తదితరులు ఇందులో పాల్గొన్నారు. దశాబ్దకాలంగా తమ లీగ్‌కు మంచి ఆదరణ దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన మున్ముందు టోర్నీని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ప్రకటించారు. పీకేఎల్ రాకతో తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎంతో మార్పు వచ్చి0దని... డబ్బుతో పాటు గుర్తింపూ దక్కిందని అగ్రశ్రేణి ఆటగాళ్లు పవన్ సెహ్రావత్, ప్రదీప్ నర్వాల్ వెల్లడించారు.
టైటాన్స్ రాత మారేనా...
ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమైన నాటినుంచి లీగ్‌లో ఉన్న ఎనిమిది జట్లలో తెలుగు టైటాన్స్ కూడా ఒకటి. కానీ మిగతా ఏడు జట్లతో పోలిస్తే టైటాన్స్‌దే ఇప్పటి వరకు పేలవ ప్రదర్శన. టైటాన్స్ మినహా మిగిలిన ఏడు జట్లు కనీసం ఒక్కసారైనా విజేతగా నిలవడం విశేషం. రెండో సీజన్‌లో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటి వరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత మూడు సీజన్లుగానైతే మరీ చెత్త ప్రదర్శనతో చివరిదైన 12వ స్థానంలో నిలుస్తూ వచ్చి0ది.
ఓవరాల్‌గా 10 సీజన్లలో కలిపి 192 మ్యాచ్‌లు ఆడితే 56 మాత్రమే గెలిచి 116 ఓడిపోయింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, లీగ్‌లో దబంగ్ ఢిల్లీకి టైటిల్ అందించిన కోచ్ కృషన్ కుమార్ హుడా ఈసారి టైటాన్స్ కోచ్‌గా రావడం జట్టుకు సానుకూలాంశం. అతని నేతృత్వంలో టీమ్ రాత మారుతుందా అనేది ఆసక్తికరం.
వేలంలో ఎఫ్‌బీఎం ద్వారా రూ.1.72 కోట్లకు కెపె్టన్ పవన్ సెహ్రావత్‌ను టీమ్ కొనసాగించింది. విజయ్ మలిక్, అమిత్ కుమార్, సంజీవి వంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. అయితే పవన్ మినహా చెప్పుకోదగ్గ అగ్రశ్రేణి రైడర్ లేకపోవడం జట్టులో ఒక లోపం. ప్రఫుల్, ఓంకార్, మన్‌జీత్ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. డిఫెన్స్‌లో కృషన్ ధుల్ రూపంలో కీలక ఆటగాడు ఉండగా... మిలాద్, అజిత్, సాగర్ నుంచి సహకారం అవసరం.
పీకేఎల్–11లో పాల్గొనే జట్లు: తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్, యు ముంబా, యూపీ యోధాస్.
Comments
Please login to add a commentAdd a comment