ప్రొ కబడ్డీ లీగ్‌లో శుభారంభం
తొలి పోరులో బెంగళూరుపై ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. లీగ్‌లో ప్రతీ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన టైటాన్స్ ఈసారి శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.
టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 13 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించగా ... బెంగళూరు కెపె్టన్ ప్రదీప్ నర్వాల్ కేవలం 3 పాయింట్లే నమోదు చేసి విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–11తో 9 పాయింట్ల తేడాతో ముందంజలో నిలిచింది. అయితే ఆ తర్వాత కోలుకున్న బుల్స్ 18–11 పాయింట్లతో రెండో అర్ధభాగంలో ఆధిక్యం ప్రదర్శించింది.
బుల్స్ తమ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయగా... టైటాన్స్ జట్టు బెంగళూరును రెండుసార్లు ఆలౌట్ చేసింది. పవన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో 1200 రైడింగ్ పాయింట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు 36–28 పాయింట్ల తేడాతో యు ముంబా జట్టును ఓడించింది.
ఢిల్లీ తరఫున అశు మలిక్ 10 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment