బెంగళూరుతో టైటాన్స్ మ్యాచ్ టై
నాగ్‌పూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య మంగళవారం ఉత్కంఠ రేపిన మ్యాచ్ చివరకు 21–21తో టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆటగాళ్లు తుదికంటా పోరాడిన తీరు ఆకట్టుకుంది. తొలి అర్ధభాగంలో బెంగళూరు 9–8తో పాయింట్ తేడాతో ఆధిక్యంలో నిలువగా... రెండో అర్ధభాగంలో మ్యాచ్ జరిగేకొద్దీ పుంజుకుంది. ప్రత్యర్థులకు దీటుగా కదిలిన టైటాన్స్ ఆటగాళ్లు చివరి క్షణాల్లో ఒక్కసారిగా రైడింగ్‌లో 5 (3, 2) పాయింట్లు తెచ్చారు. దీంతో స్కోరు 20–20 వద్ద సమమైంది. ఆ తర్వాత ఇరు జట్లు ఆఖరి రైడ్‌కు వెళ్లి ఒక్కోపాయింట్ తెచ్చాయి.
దీంతో మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి రాణించాడు. 29 సార్లు రైడింగ్‌కు వెళ్లి 8 పాయింట్లు సాధించాడు. నీలేశ్ సాలుంకే 4, రాకేశ్, విశాల్ భరద్వాజ్ చెరో 2 పాయింట్లు, టాకిల్‌లో రాకేశ్ కుమార్ 2 పాయింట్లు చేశారు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ 5, ఆశిష్ 3 పాయింట్లు చేయగా... మహేందర్, ప్రీతమ్ చిల్లర్, రవీందర్ పాహల్ తలా రెండు పాయింట్లు సాధిం చారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 32–20తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్... బెంగాల్ వారియర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి ‘స్టార్ స్పోర్ట్స్–2’లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.