టైటాన్స్ తొడగొడుతుందా!
బెంగళూరు బుల్స్‌తో సెమీస్ నేడు
ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: తొలి సీజన్‌లో ఒకే ఒక్క పాయింట్‌తో ప్లే ఆఫ్ అవకాశాలను చేజార్చుకున్న తెలుగు టైటాన్స్ రెండో సీజన్‌లో మాత్రం దుమ్మురేపింది. అద్భుతమైన రైడింగ్.. అంతకుమించిన క్యాచింగ్‌తో సీజన్-2లో జైత్రయాత్ర కొనసాగించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు (శుక్రవారం) జరిగే సెమీస్ పోరులో టైటాన్స్.. బెంగళూరు బుల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 8 విజయాలు, మూడు డ్రాలతో 50 పాయింట్లతో జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
రాహుల్ చౌదరి (79 పాయింట్లు) ఈసారి కూడా ఒంటిచేత్తో ఫలితాలను శాసిస్తున్నాడు. అయితే రాహుల్ విఫలమైన ప్రతిసారి సుకేశ్ హెగ్డే, ప్రశాంత్ రాయ్‌లు జట్టుకు అండగా నిలవడం టైటాన్స్‌కు కలిసొచ్చే అంశం. ఓవరాల్‌గా ఈ ముగ్గురి రైడింగ్‌తో ప్రస్తుతం టైటాన్స్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఇక దీపక్ నివాస్ హుడా క్యాచింగ్‌తో పాటు రైడింగ్‌లోనూ ఉపయోగపడుతుండటం టైటాన్స్ జట్టుకు అదనపు బలంగా మారింది. మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తున్న మరో ఆటగాడు మిరాజ్ షేక్ ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకం కానున్నాడు.
మరోవైపు బెంగళూరు బుల్స్ కూడా మంచి ఫామ్‌లో ఉంది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ సీజన్‌లో టైటాన్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు ఓటమిపాలైంది. అజయ్ ఠాకూర్, కెప్టెన్ మంజీత్ చిల్లర్, రాజేశ్ మొండల్, సోమ్‌వీర్ శేఖర్ కీలక ఆటగాళ్లు. ఓవరాల్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్‌కు అడ్డుకట్ట వేయాలని బెంగళూరు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండో సెమీస్‌లో పటిష్టమైన యు ముంబాతో... పట్నా పైరేట్స్ జట్టు తలపడుతుంది.