జైపూర్: వరుసగా రెండు ఓటముల అనంతరం తెలుగు టైటాన్స్ జట్టు తిరిగి పుంజుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో రాణించిన జట్టు 40-22తో ఘనవిజయాన్ని అందుకుంది. ప్రథమార్ధం ముగిసేలోపే 18-10తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ ఆ తర్వాత మరింత దీటుగా ఆడింది. సుకేశ్ హెగ్డే 8 రైడ్ పాయింట్లు సాధించగా, డిఫెండర్లు రాహుల్, మనోజ్ నాలుగేసి టాకిల్ పాయింట్లతో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు నుంచి సుర్జీత్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించినా లాభం లేకపోయింది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 32-17 తేడాతో జైపూర్ పింక్‌పాంథర్స్‌ను ఓడించింది.