బెంగళూర్ బుల్స్‌కు నాల్గో ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్
హైదరాబాద్, 25 అక్టోబర్ 2024 : మాజీ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగళూర్ బుల్స్‌పై పుణెరి పల్టాన్ 14 పాయింట్ల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. జట్టుగా రాణించటంలో పూర్తిగా విఫలమైన బెంగళూర్ బుల్స్ సీజన్లో వరుసగా నాల్గో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 36-22తో బెంగళూర్ బుల్స్‌పై పుణెరి పల్టాన్ ఏకపక్ష విజయం సాధించింది.
పల్టాన్ తరఫున పంకజ్ మోహితె (6 పాయింట్లు), మోహిత్ గోయత్ (6 పాయింట్లు) రాణించారు. బెంగళూర్ బుల్స్ ఆటగాళ్లలో పంకజ్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. బెంగళూర్ బుల్స్‌కు ఏదీ కలిసి రావటం లేదు. హ్య్రాటిక్ పరాజయాలు చవిచూసిన బుల్స్.. నాల్గో మ్యాచ్‌లోనూ ఏమాత్రం మారలేదు. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ పేలవ ప్రదర్శన ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. శుక్రవారం పుణెరి పల్టాన్‌తో మ్యాచ్‌లో బుల్స్ పూర్తిగా తేలిపోయింది. తొలి అర్థభాగం ఆటలో ఆ జట్టు 11-18తో నిలిచింది.
తొలి పది నిమిషాల ఆటలో ఆ జట్టు పాయింట్లు రెండెంకలకు చేరుకోలేదు. ప్రథమార్థంలో చివర్లో పంకజ్ మెరుపులతో బుల్స్ 11 పాయింట్ల వరకు చేరుకుంది. మరోవైపు పల్టాన్ ఆటగాళ్లు పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లకు కెప్టెన్ అస్లాం ఇనామ్‌దార్ (5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి (4 పాయింట్లు), ఆమన్ (4 పాయింట్లు) జతకలిశారు.
మ్యాచ్ రెండో అర్థభాగంలో బెంగళూర్ బుల్స్ ప్రదర్శన కాస్త మెరుగైనా.. ఏ దశలోనూ పుణెరి పల్టాన్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. విరామం అనంతరం సైతం మెరుపు ప్రదర్శన పునరావృతం చేసిన పుణెరి పల్టాన్ చివరి 20 నిమిషాల ఆటలోనూ 18-11తో బుల్స్‌ను చిత్తు చేసింది. దీంతో పుణెరి పల్టాన్ 36-22తో బెంగళూర్‌పై అలవోక విజయం సాధించింది. సీజన్లలో పుణెరి పల్టాన్‌కు ఇది నాలుగు మ్యాచుల్లో మూడో విజయం. ఈ విక్టరీతో పీకెఎల్ 11 పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. వరుసగా నాల్గో పరాజయంతో బెంగళూర్ బుల్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment