Pro Kabaddi 2024: అర్జున్‌ అదరహో | Pro Kabaddi League 2024 Nov 25th Highlights: Jaipur Pink Panther And UMumba Beat Bangalore Bulls And Puneri Paltan, Score Details | Sakshi
Sakshi News home page

Pro Kabaddi 2024: అర్జున్‌ అదరహో

Published Tue, Nov 26 2024 8:46 AM | Last Updated on Tue, Nov 26 2024 9:34 AM

Jaipur Pink Panthers seal a close win against Puneri Paltan

16 పాయింట్లు సాధించిన 

 పింక్‌పాంథర్స్‌ రెయిడర్‌

పుణేరి పల్టన్‌పై జైపూర్‌ ఘనవిజయం   

నోయిడా: స్టార్‌ రెయిడర్‌ అర్జున్‌ దేశ్వాల్‌ 16 పాయింట్లతో విజృంభించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఏడో విజయం నమోదు చేసుకుంది. లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన పోరులో పింక్‌ పాంథర్స్‌ 37–23 పాయింట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. జైపూర్‌ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడితే... పుణేరి కేవలం రెయిడింగ్‌లోనే సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో పింక్‌ పాంథర్స్‌ 20 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... పల్టన్‌ 19 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 

డిఫెన్స్‌లో జైపూర్‌ 10 పాయింట్లు కొల్లగొట్టగా... పుణేరి 3 పాయింట్లకే పరిమితమైంది. జైపూర్‌ తరఫున అర్జున్‌ విజృంభించగా.. అతడికి నీరజ్‌ నర్వాల్‌ నుంచి సహకారం లభించింది. పుణేరి పల్టన్‌ తరఫున పంకజ్, మోహిత్‌ గోయట్‌ చెరో 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు ఖతాలో వేసుకున్న జైపూర్‌ ఐదో స్థానానికి చేరింది. 42 పాయింట్లతో పుణేరి పల్టన్‌ నాలుగో స్థానంలో ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 34–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది.

 యు ముంబా తరఫున మన్‌జీత్‌ (8 పాయింట్లు), అజిత్‌ చవాన్‌ (7 పాయింట్లు) రాణించగా... బెంగళూరు తరఫున సుశీల్‌ (8 పాయింట్లు), ప్రదీప్‌ నర్వాల్‌ (6 పాయింట్లు) సత్తాచాటారు. 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 45 పాయింట్లతో నిలిచిన యు ముంబా పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 14 మ్యాచ్‌ల్లో 12వ పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు బుల్స్‌ 16 పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తమిళ్‌ తలైవాస్‌ (రాత్రి 8 గంటలకు), దబంగ్‌ ఢిల్లీతో పట్నా పైరేట్స్‌ (రాత్రి 9 గంటలకు) 
తలపడతాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement