
పట్నా పైరేట్స్‌కు మరో విజయం
ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈసారి సొంతగడ్డపై ఆడుతున్న జట్లకు అంతగా కలిసి రావడంలేదు. విశాఖపట్నంలో తెలుగు టైటాన్స్ జట్టుకు రెండు విజయాలు, రెండు ఓటములు ఎదురవ్వగా... బెంగళూరు వేదికగా బుధవారం మొదలైన పోటీల్లో ఆతిథ్య బెంగళూరు బుల్స్‌కు తొలి మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 33-24 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు జట్టులో అమిత్ రాఠి ఒక్కడే పోరాటపటిమ కనబరిచి పది పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా ఫలితం లేకపోయింది.
మరోవైపు పట్నా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. రోహిత్ కుమార్ రెయిడింగ్‌లో విజృంభించి ఎనిమిది పాయింట్లు సంపాదించగా... సందీప్ నర్వాల్ ఐదు, మన్‌ప్రీత్ సింగ్ నాలుగు, సురేశ్ మూడు పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్ లో పుణేరి పల్టన్ 38-20 పాయింట్లతో ఢిల్లీ దబంగ్ జట్టును ఓడించింది. పుణేరి తరఫున దీపక్ హుడా 9 పాయింట్లు, మన్‌జీత్ చిల్లర్ 8 పాయింట్లు, సుర్జీత్ ఆరు పాయింట్లు సాధిం చగా... ఢిల్లీ తరఫున కాశీలింగ్ ఐదు, రోహిత్ మూడు పాయింట్లు సాధించారు. ఈ లీగ్‌లో ఢిల్లీకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. గురువారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది.