టైటాన్స్‌కు మళ్లీ నిరాశ
30-28తో బెంగళూరు బుల్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: గత మ్యాచ్‌లో అద్భుత ఆటతీరు కనబర్చిన తెలుగు టైటాన్స్ ఉత్సాహం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భారీ విజయం తర్వాత ఆ జట్టు మళ్లీ ఓటమిని ఆహ్వానించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 30-28 స్కోరుతో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్ తరఫున రాహుల్ 9, నీలేశ్ 7 పాయింట్లు, బుల్స్ ఆటగాడు రోహిత్ కుమార్ 11 రైడింగ్ పాయింట్లు స్కోర్ చేశారు. బెంగళూరు జట్టులో కెప్టెన్ సురేందర్, ఆశిష్ కూడా రాణించారు. టైటాన్స్‌కు సీజన్‌లో ఇది నాలుగో ఓటమి.
రాహుల్ విఫలం: ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో 14 నిమిషాలకు టైటాన్స్, బుల్స్ 7-7తో సమంగా నిలిచాయి. ఈ సమయంలో ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు ఆధిక్యంలో దూసుకుపోయింది. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి తొలి అర్ధ భాగంలో 12 సార్లు రైడింగ్‌కు వెళ్లి 2 సార్లు మాత్రమే పాయింట్లతో తిరిగొచ్చాడు. సగం సమయం ముగిసే సరికి టైటాన్స్ 11-16తో వెనుకబడింది. రెండో అర్ధ భాగంలో టైటాన్స్ కోలుకుని ఒకసారి ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. స్కోరు సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా బెంగళూరు జాగ్రత్తగా ఆడి గెలిచింది.
ఆఖరి నిమిషంలో మరో రైడ్‌కు అవకాశం ఉన్నా... అంపైర్లు సమయం ముగిసిందని ప్రకటించడంపై కెప్టెన్ రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ దామోదర్ పదే పదే తమ పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నాడని అతను ఆరోపించాడు.
మహిళల మ్యాచ్ టై..: ఫైర్ బర్డ్స్, స్టార్మ్ క్వీన్స్ మధ్య ఆసక్తికరంగా సాగిన మహిళల లీగ్ మ్యాచ్ 14-14తో టైగా ముగిసింది. లీగ్‌లో ఏకపక్షంగా సాగిన తొలి రెండు మ్యాచ్‌లకు భిన్నంగా ఈ సారి ఇరు జట్లు ప్రతీ పాయింట్ కోసం పోటాపోటీగా తలపడ్డాయి. బర్డ్స్ తరఫున మమత ఆరు పాయింట్లు సాధించగా, క్వీన్స్ ప్లేయర్ మోతి 4 పాయింట్లు స్కోర్ చేసింది.
నేటి మ్యాచ్‌లు
దబాంగ్ ఢిల్లీ X జైపూర్ పింక్ పాంథర్స్
రా. గం. 8 నుంచి
తెలుగు టైటాన్స్ X యు ముంబా
రా. గం. 9 నుంచి
స్టార్ స్పోర్ట్స్-2 లో ప్రత్యక్ష ప్రసారం