సత్తా చాటిన యూపీ కెప్టెన్ సురేందర్ గిల్, భరత్
హైదరాబాద్, అక్టోబర్ 22: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో యూపీ యోధాస్ రెండో విజయం సొంతం చేసుకోగా.. పర్దీన్ నర్వాల్ కెప్టెన్సీలోని బెంగళూరు బుల్స్ వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడి హ్యాట్రిక్ పరాజయం చవి చూసింది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 57-–36 తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తుగా ఓడించింది. యూపీ యోధాస్ కెప్టెన్ సురేందర్ గిల్ 17 పాయింట్లతో విజృంభించాడు. ఆల్‌రౌండర్ భరత్ (14), డిఫెండర్ సుమిత్ (9) కూడా ఆకట్టుకున్నారు. బుల్స్ తరఫున కెప్టెన్ పర్దీప్ నర్వాల్ (16 ) సూపర్ టెన్ సాధించగా, జతిన్ (9) పోరాడాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ను యూపీ మూడుసార్లు ఆలౌట్ చేసింది.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి యూపీ యోధాస్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆ జట్టు రైడర్లు ఆరంభం నుంచి కెప్టెన్ సురేందర్ గిల్, భరత్ వరుస రైడ్ పాయింట్లతో విజృంభించారు. జట్టుకు తొలి పాయింట్ అందించిన భరత్ ప్రత్యర్థి డిఫెండర్ల పట్టుకు చిక్కకుండా అలరించాడు. మరోవైపు సురేందర్ కూడా కోర్టులో పాదరసంలా కదులుతూ ఆకట్టుకున్నాడు. అదే సమయంలో యోధాస్ డిఫెండర్లు సైతం సత్తా చాటారు. బెంగళూరు తరఫున కెప్టెన్ పర్దీప్ నర్వాల్, జతిన్ పోరాడినా మిగతా రైడర్ల నుంచి వారికి సహకారం లభించలేదు.
11వ నిమిషంలో బుల్స్‌ను ఆలౌట్ చేసిన 15–9తో ముందంజ వేసింది. ఆపై, భరత్ వెంటవెంటనే రెండు సూపర్ రైడ్లతో అలరించాడు. రెండు ప్రయత్నాల్లో ముగ్గురేసి ఆటగాళ్లను ఔట్ చేశాడు. దాంతో నాలుగు నిమిషాల వ్యవధిలోనే బెంగళూరును రెండోసారి ఆలౌట్ చేసిన యూపీ యోధాస్ 24–10తో భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. ఇదే జోరుతో భరత్, సురేందర్ సూపర్ టెన్స్ పూర్తి చేసుకోగా.. యోధాస్ 33–15తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.
రెండో భాగంలోనూ భరత్, సురేందర్ జోరు కొనసాగింది. అటువైపు బుల్స్ కెప్టెన్ పర్దీప్ సూపర్ రైడ్ చేసి సూపర్ టెన్ పూర్తి చేసుకోగా జతిన్ కూడా మెప్పించాడు. కానీ, యూపీ ఏమాత్రం పట్టు విడవలేదు. ఇరు జట్లూ కొద్దిసేపు పోటాపోటీగా రైడ్ పాయింట్లు రాబట్టగా యోధాస్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వెళ్లింది. 32వ నిమిషంలో మూడోసారి బెంగళూరును ఆలౌట్ చేసిన యూపీ 49–28తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో పర్దీప్‌తో పాటు ఇతర ఆటగాళ్లు పోరాడినా అది బెంగళూరు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. కాగా, బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో పుణెరి పల్టాన్ తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా పోటీ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment