ప్లే ఆఫ్స్‌కు పట్నా పైరేట్స్, యూపీ యోధాస్‌ | Patna Pirates and UP Yoddhas enter playoffs | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్స్‌కు పట్నా పైరేట్స్, యూపీ యోధాస్‌

Published Thu, Dec 19 2024 3:58 AM | Last Updated on Thu, Dec 19 2024 3:58 AM

Patna Pirates and UP Yoddhas enter playoffs

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో పట్నా పైరేట్స్, యూపీ యోధాస్‌ జట్లు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 41–37 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. తద్వారా 20 మ్యాచ్‌ల్లో 13 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 73 పాయింట్లు ఖాతాలో వేసుకున్న పైరేట్స్‌... పట్టికలో రెండో స్థానానికి చేరింది. 

మరోవైపు 21 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 10 పరాజయాలతో 61 పాయింట్లతో ఉన్న తెలుగు టైటాన్స్‌ పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కీలక పోరులో పట్నా పైరేట్స్‌ తరఫున దేవాంక్‌ 14 పాయింట్లతో విజృంభించగా... దీపక్, అంకిత్‌ చెరో ఆరు పాయింట్లతో అతడికి అండగా నిలిచారు. టైటాన్స్‌ తరఫున పవన్‌ సెహ్రావత్, విజయ్‌ మలిక్‌ చెరో 9 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. 

మరోవైపు ఇతర జట్ల ఫలితాల ఆధారంగా యూపీ యోధాస్‌ కూడా ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టింది. యోధాస్‌ బుధవారం బరిలోకి దిగకపోయినా... లీగ్‌లో 20 మ్యాచ్‌లాడి 11 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 69 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ జట్టు 31 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

తలైవాస్‌ 60–29 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌ను మట్టికరిపించింది. తలైవాస్‌ తరఫున మోయిన్, హిమాన్షు చెరో 13 పాయింట్లతో చెలరేగారు. ఈ ఇద్దరూ సూపర్‌ రెయిడ్‌లతో విజృంభించడంతో తలైవాస్‌ ఏకపక్ష విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్‌ జెయింట్స్‌తో యూపీ యోధాస్‌; యు ముంబాతో పట్నా పైరేట్స్‌ తలపడతాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement