నేడు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు
యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ‘ఢీ’
పట్నా పైరేట్స్‌తో యు ముంబా పోరు
రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
పుణే: గత రెండు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరింది. లీగ్ దశ పోటీలు ముగియగా... ఇక నాకౌట్ సమరాలకు వేళయింది. పాయింట్ల పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచిన హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించగా... ఆ తర్వాత 3 నుంచి 6వ స్థానం వరకు నిలిచిన జట్ల మధ్య గురువారం ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇందులో విజయం సాధించిన జట్లు సెమీఫైనల్‌కు చేరనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుండగా... రాత్రి 9 గంటల నుంచి జరగనున్న రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా పోటీపడుతుంది. పీకేఎల్‌లో యూపీ యోధాస్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోగా... జైపూర్ పింక్ పాంథర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది.
పట్నా పైరేట్స్ మూడుసార్లు చాంపియన్‌గా నిలవగా... యు ముంబా కూడా ఒకసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడింది. తాజా సీజన్‌లో యూపీ యోధాస్ 13 విజయాలు సాధించి 79 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలవగా... పింక్ పాంథర్స్ 12 విజయాలతో 70 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కెపె్టన్ సురేందర్ గిల్‌తో పాటు శివమ్ చౌధరీ యోధాస్‌కు కీలకం కానుండగా... పింక్ పాంథర్స్ జట్టు సారథి అర్జున్ దేశ్వాల్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది.
మరి ఈ కీలక పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. లీగ్ చివరి మ్యాచ్ విజయంతో యు ముంబా ముందడుగు వేయగా... పట్నా పైరేట్స్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి నాకౌట్‌లో అడుగు పెట్టింది. యు ముంబా జట్టు తరఫున కెప్టెన్ సునీల్ కుమార్, అజిత్ చౌహాన్, మన్‌జీత్ రాణిస్తుండగా... పైరేట్స్ తరఫున దేవాంక్, దీపక్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్లు శుక్రవారం జరగనున్న సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment