పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యూపీ యోధాస్ జోరుకు గుజరాత్ జెయింట్స్ చేతులెత్తేసింది. దీంతో యూపీ యోధాస్ 59–23 స్కోరుతో ఏకపక్ష విజయం సాధించింది. రెయిడర్లు గగన్ గౌడ (19 పాయింట్లు), భవాని రాజ్‌పుత్ (11 పాయింట్లు) అదరగొట్టగా, డిఫెండర్లు సుమిత్ (5), అశు సింగ్ (4), మహేందర్ సింగ్ (4) రాణించారు. 18 సార్లు కూతకెళ్లిన గగన్ గౌడ 13 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మ్యాచ్‌లో నాలుగుసార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం విశేషం.
తొలి అర్ధభాగం మొదలైన ఎనిమిది నిమిషాలకే యోధాస్ ఆటగాళ్లు గుజరాత్‌ను ఆలౌట్ చేశారు. 12–7తో అక్కడ మొదలైన ఆధిపత్యం ఆఖరిదాకా కొనసాగింది. ఈ అర్ధభాగం ముగిసేలోపే మళ్లీ 18వ నిమిషంలో జెయంట్స్ ఆలౌటైంది. గుజరాత్ ఆటగాళ్లలో రెయిడర్ గుమన్ సింగ్ (7), ఆల్‌రౌండర్ జితేందర్ యాదవ్ (6), రెయిడర్ రాకేశ్ (5) రాణించారు.
ఇదివరకే ప్లేఆఫ్స్‌కు అర్హత సంపాదించిన యూపీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 43–37తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ (15) పదేపదే పాయింట్లు తెచ్చిపెట్టగా, డిఫెండర్లు సునీల్ కుమార్ (5), పర్వేశ్ (4), మన్‌జీత్ (4), ఆల్‌రౌండర్ రోహిత్ రాఘవ్ (4) సమష్టిగా రాణించారు.
పైరేట్స్ తరఫున రెయిడర్ దేవాంక్ (12), అయాన్ (7), డిఫెండర్లు దీపక్ (4), శుభమ్ (4) మెరుగ్గా ఆడారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్... తెలుగు టైటాన్స్‌తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment