ఎదురులేని పుణే | Bengal Warriors wins | Sakshi
Sakshi News home page

ఎదురులేని పుణే

Published Sun, Feb 28 2016 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

ఎదురులేని పుణే

ఎదురులేని పుణే

న్యూఢిల్లీ: తమ చివరి ఐదు మ్యాచ్‌ల్లో పరాజయమనేది లేకుండా వణికించిన పుణేరి పల్టన్ మరోసారి అదే స్థాయి ఆటతీరును ప్రదర్శించింది. శనివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44-27 తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఈ జట్టు రెండో స్థానానికి చేరింది. అజయ్ ఠాకూర్ 7, మంజిత్ చిల్లార్ ఆరు రైడింగ్ పాయింట్లు సాధించారు. బెంగళూరు నుంచి దీపక్ హుడా ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు. అయితే ఆరంభంలో బెంగళూరు నుంచి పుణే గట్టి పోటీనే ఎదుర్కోవడంతో పాటు 10వ నిమిషంలో ఆలౌట్ అయ్యింది. 10-4తో ఉన్న బెంగళూరు ఆధిక్యానికి దీపక్ హుడా సూపర్ రైడ్‌తో మరో మూడు పాయింట్లు వచ్చాయి. ఈ సమయంలో అంతగా ఫామ్‌లో లేని అజయ్ ఠాకూర్ ముగ్గురు డిఫెండర్లను అవుట్ చేసి పుణే స్కోరును పెంచాడు. దీంతో తొలి అర్ధభాగాన్ని పుణే 19-13తో ముగించింది. ద్వితీయార్ధం 32వ నిమిషం వరకు కూడా ఆట పోటాపోటీగా సాగి 24-21తో పుణే స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అయితే కొద్దిసేపట్లోనే బెంగళూరు ఆలౌట్ కావడంతో తిరిగి కోలుకోలేకపోయింది.

 బెంగాల్ విజయం
మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 37-31 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. బెంగాల్ నుంచి జంగ్ కున్ లీ 13, నితిన్ తోమర్ 10 రైడింగ్ పాయింట్లు.. ఢిల్లీ నుంచి అనిల్ శ్రీరామ్ 12, సెల్వమణి 10 రైడింగ్ పాయింట్లు సాధించారు. ప్రస్తుతం బెంగాల్ జట్టు పుణేతో సమానంగా 42 పాయింట్లతో ఉన్నా నాలుగు పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో జైపూర్ పింక్‌పాంథర్స్; తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement