నితిన్‌కు రూ.93 లక్షలు
యూపీ ఫ్రాంచైజీ సొంతమైన రైడర్ ∙ప్రొ కబడ్డీ లీగ్–2017 వేలం
న్యూఢిల్లీ: స్టార్ రైడర్ నితిన్ తోమర్ రికార్డు ధర పలికాడు. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో అతన్ని రూ. 93 లక్షలకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొత్త ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. పీకేఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. కొత్తగా మరో నాలుగు ఫ్రాంచైజీలను పెంచడంతో ఈ సీజన్లో మొత్తం 12 ఫ్రాంచైజీల కోసం సోమవారం ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించారు. ఇందులో నితిన్‌తో పాటు పలువురు ఆటగాళ్లకు భారీ మొత్తం లభించింది. స్టార్ ఆల్‌రౌండర్ మంజిత్ చిల్లర్‌ను రూ. 75.5 లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ సొంతం చేసుకోగా, డిఫెండర్ సుర్జీత్ సింగ్‌ను రూ. 73 లక్షలకు బెంగాల్ వారియర్స్ చేజిక్కించుకుంది.
రాజేశ్ నర్వాల్ (రూ.69 లక్షలు–యూపీ), సందీప్ నర్వాల్ (రూ. 66 లక్షలు–పుణేరి పల్టన్), కుల్దీప్ సింగ్ (రూ. 51.5 లక్షలు–యు ముంబా), రాకేశ్ కుమార్ (రూ. 45 లక్షలు–తెలుగు టైటాన్స్), అమిత్ హుడా (రూ. 63 లక్షలు–తమిళనాడు), జీవన్ కుమార్ (రూ.52 లక్షలు–యూపీ), మోహిత్ చిల్లర్ (రూ.46.5 లక్షలు–హరియాణా), ధర్మరాజ్ (రూ. 46 లక్షలు–పుణేరి పల్టన్), సచిన్ షింగడే (రూ.42.5 లక్షలు–పట్నా పైరేట్స్), విశాల్ మానే (రూ.36.5 లక్షలు–పట్నా పైరేట్స్), నిలేశ్ షిండే (రూ.35.5 లక్షలు–దబంగ్ ఢిల్లీ), జోగిందర్ సింగ్ నర్వాల్ (రూ. 25 లక్షలు–యు ముంబా), రోహిత్ రాణా (రూ. 27.5 లక్షలు– తెలుగు టైటాన్స్)లకు భారీ మొత్తం లభించింది.
ఇరాన్ ఆటగాళ్లు అబుజర్ మొహజెర్మిఘని (రూ.50 లక్షలు–గుజరాత్), అబుల్ఫజెల్ (రూ.31.8 లక్షలు–దబంగ్ ఢిల్లీ), ఫర్హాద్ (రూ.29 లక్షలు–తెలుగు టైటాన్స్), హది ఒస్తోరక్ (రూ.18.6 లక్షలు–యు ముంబా)లకు చెప్పుకోదగిన ధర లభించింది. ఆటగాళ్ల వేలం నేడు (మంగళవారం) కూడా జరగనుంది.