తెలుగు టైటాన్స్ కు మూడో గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ టోర్నమెంట్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకు మూడో విజయం లభించింది. బెంగళూరు బుల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 35-26 పాయింట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ రాహుల్ చౌదరి అద్భుత ఆటతీరును కనబరిచి 11 పాయింట్లు సాధించి తెలుగు టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా ఆటగాళ్లు సుకేశ్ హేగ్డె నాలుగు, ధర్మరాజ్ చెరలథన్, వికాస్ కాలే మూడేసి పాయింట్లు సంపాదించగా... మేరాజ్ షేక్, రాహుల్ కుమార్ రెండేసి పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. విరామ సమయానికి 18-9తో ఆధిక్యంలో నిలిచిన టైటాన్స్ జట్టు రెండో అర్ధభాగంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 40-26తో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాపై సంచలన విజయం సాధించింది.