
మోహిత్ ఛిల్లర్‌కు రూ. 53 లక్షలు
► బెంగళూరు బుల్స్ సొంతం
► ప్రో కబడ్డీ లీగ్ సీజన్-4 వేలం
► జూలై 31న హైదరాబాద్‌లో ఫైనల్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో యువ ఆటగాడు మోహిత్ ఛిల్లర్ పంట పండింది. శుక్రవారం జరిగిన సీజన్-4 వేలంలో బెంగళూరు బుల్స్ అతడిని రూ. 53 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఇదే అత్యధిక మొత్తం. సీజన్-2లో యు ముంబా జట్టును చాంపియన్‌గా నిలపడంలో మోహిత్ కీలక పాత్ర పోషించాడు. సందీప్ నర్వాల్‌ను తెలుగు టైటాన్స్ రూ. 45.5 లక్షలకు, జీవ కుమార్‌ను యు ముంబా రూ. 40 లక్షలకు జట్టులోకి తీసుకున్నాయి. పీకేఎల్ సీజన్-4 మ్యాచ్‌లు జూన్ 25నుంచి జులై 31 వరకు జరుగుతాయి. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. వేలంలో ఎనిమిది జట్లు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి. లీగ్ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు ఇద్దరు పాత ఆటగాళ్లను కొనసాగించగా, మిగతావారిని వేలంలో ఎంచుకున్నాయి. దాంతో ఈ సారి అన్ని జట్లు మళ్లీ కొత్తగా కనిపించనున్నాయి.
రాహుల్, సుకేశ్ టైటాన్స్‌కే...
తెలుగు టైటాన్స్ జట్టు తమ ఇద్దరు ప్రధాన రైడర్లు రాహుల్ చౌదరి, సుకేశ్ హెగ్డేలను కొనసాగించింది. వీరు కాకుండా మరో 13 మందిని వేలంలో ఎంచుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలి సారి పాకిస్తాన్ ఆటగాడు బరిలోకి దిగుతుండటం విశేషం. ఆల్‌రౌండర్ ముహమ్మద్ రిజ్వాన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు తీసుకుంది. వేలంలో మరో ఏడుగురు పాకిస్తానీ ఆటగాళ్లు ఉన్నా ఎవరూ తీసుకోలేదు.
తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి, సుకేశ్ హెగ్డే, వినోత్ కుమార్, కె. ప్రపంజన్, నీలేశ్ సాలుంకే (రైడర్లు), వినోద్ కుమార్, సందీప్ ధుల్ (డిఫెండర్లు), జస్మీర్ సింగ్, రూపేశ్ తోమర్, సందీప్ నర్వాల్, శశాంక్ వాంఖెడే, సాగర్ కృష్ణ, మొహమ్మద్ మఖ్సూద్, అఖ్లాఖ్ హుస్సేన్, ముహమ్మద్ రిజ్వాన్ (ఆల్‌రౌండర్లు).