42-37తో యూపీ యోధాస్‌పై గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11
హైదరాబాద్: పీకెఎల్ మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై 42-37తో పట్నా పైరేట్స్ పైచేయి సాధించింది. రెయిడింగ్‌లో, డిఫెన్స్‌లో హవా చూపించిన పైరేట్స్ 5 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను చిత్తు చేసింది. పట్నా పైరేట్స్ రెయిడర్ దేవాంక్ (11 పాయింట్లు) సూపర్ టెన్ షోతో మెరువగా.. అయాన్ ( 9 పాయింట్లు) అదరగొట్టాడు. యూపీ యోధాస్ ఆటగాళ్లలో గగన్ గౌడ (9 పాయింట్లు), భరత్ (6 పాయింట్లు) , సురేందర్ గిల్(5 పాయింట్లు) రాణించినా ఆ జట్టుకు సీజన్లో మూడో పరాజయం తప్పలేదు.
పైరేట్స్ ముందంజ :
యూపీ యోధాస్, పట్నా పైరేట్స్ మ్యాచ్‌లో మూడుసార్లు ప్రథమార్థంలో ముందంజ వేసింది. తొలి 20 నిమిషాల ఆటలో 23-19తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. పైరేట్స్ ఆధిక్యం సాధించినా.. ప్రథమార్థం హోరాహోరీగా సాగింది. రెయిడింగ్, డిఫెన్స్‌లో ఇరు జట్లు తగ్గ పోటీనిచ్చాయి. దీంతో ఇరు జట్లు ఆలౌట్ సైతం చవిచూశాయి. డిఫెన్స్‌లో పైచేయి సాధించిన పట్నా పైరేట్స్.. తొలి అర్థభాగం ఆటను ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ శుభమ్ షిండె మెరుపు ట్యాకిల్స్‌తో అదరగొట్టాడు. రెయిడర్ దేవాంక్ సహజంగానే తనదైన జోరు కొనసాగించాడు.
యోధాస్‌కు నిరాశ :
ఆట ద్వితీయార్థంలో యూపీ యోధాస్ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రథమార్థం ఆధిక్యం కొనసాగించిన పట్నా పైరేట్స్.. ఓ దశలో ఏడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. యూపీ యోధాస్ రెయిడర్లు సురేందర్ గిల్, గగన్ గౌడ సహా ఆల్‌రౌండర్ భరత్ వరుసగా పాయింట్లు సాధించారు. యూపీ యోధాస్‌ను ఆఖరు వరకు రేసులో నిలపాలని చూశారు. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ సైతం పాయింట్ల వేటలో దూకుడు చూపించింది. దేవాంక్‌కు అయాన్ సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్ ఏ దశలోనూ ఆధిక్యం కోల్పోలేదు. ఆఖరు రెయిడ్‌లోనూ రెండు పాయింట్లు సాధించిన అయాన్ పట్నా పైరేట్స్‌కు మెరుపు విజయాన్ని అందించాడు. ద్వితీయార్థంలో యూపీ యోధాస్ 18 పాయింట్లు సాధించగా, పట్నా పైరేట్స్ 19 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment