భారీ మొత్తంతో సొంతం చేసుకున్న తమిళ్ తలైవాస్
రెజాకు రూ. 2.07 కోట్లు
ప్రొ కబడ్డీ లీగ్ వేలం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంలో రూ. కోట్ల కూత కూసింది. దీంతో కబడ్డీ ప్లేయర్ల రాత కూడా రానురానూ మారుతోంది. పీకేఎల్ 11వ సీజన్ కోసం నిర్వాహకులు గురువారం ఆటగాళ్ల వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తొలిరోజు ఎ, బి కేటగిరీలకు చెందిన ఆటగాళ్ల వేలం నిర్వహించగా, రాజస్తాన్‌కు చెందిన సచిన్ తన్వర్‌పై ఫ్రాంచైజీలు రూ. రెండు కోట్లకు పైగా వెచ్చించేందుకు పోటీపడ్డాయి. చివరకు తమిళ్ తలైవాస్ ఈ రెయిడర్‌పై రూ. 2.15 కోట్లు కురిపించి మరీకైవసం చేసుకుంది.
గత సీజన్‌లో పట్నా పైరేట్స్ తరఫున కూత పెట్టిన సచిన్ అంతకుముందు గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన్వర్ భారత జట్టులో కీలక సభ్యుడు. గతేడాది హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇతనితో పాటు ‘ఎ’ కేటగిరీలో ఉన్న మరో స్టార్ కబడ్డీ ప్లేయర్, ఇరానియన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా కోసం ఫ్రాంచైజీలు ఎగబడి వేలం పాట పాడాయి.
చివరకు అతన్ని రూ. 2.07 కోట్లతో హరియాణా స్టీలర్స్ చేజిక్కించుకుంది. తొలి రోజు వేలంలో రెండు కేటగిరీల్లో కలిపి 8 మంది ఆటగాళ్లు రూ. కోటికి పైగా ధర పలికారు. రెయిడర్లు గుమన్ సింగ్ రూ. 1.97 కోట్లు (గుజరాత్ జెయింట్స్), మణీందర్ సింగ్ రూ. 1.15 కోట్లు (బెంగాల్ వారియర్స్), అజింక్యా అశోక్ రూ. 1.10 కోట్లు (బెంగళూరు బుల్స్), ఆల్‌రౌండర్లు పవన్ కుమార్ సెహ్రావత్ రూ.1.72 కోట్లు (తెలుగు టైటాన్స్), భరత్ రూ. 1.30 కోట్లు (యూపీ యోధాస్), డిఫెండర్ సునీల్ కుమార్ రూ. 1.01 కోట్లు (యు ముంబా)లు భారీ ధర పలికారు.
తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ పవన్ సెహ్రావత్‌తో పాటు డిఫెండర్ క్రిషన్ ధుల్ (రూ. 70 లక్షలు), ఆల్‌రౌండర్ విజయ్ మలిక్ (రూ. 20 లక్షలు)లను తొలిరోజు వేలంలో కొనుక్కుంది. రెండో రోజు శుక్రవారం వేలంలో ‘ఎ’, ‘బి’లతో పాటు ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment