దబాంగ్‌ ఢిల్లీపై యూపీ యోధాస్‌ అద్భుత విజయం | PKL 2024-25, UP Yoddhas Beat Dabang Delhi With 28-23, Check Match Highlights Inside | Sakshi
Sakshi News home page

దబాంగ్‌ ఢిల్లీపై యూపీ యోధాస్‌ అద్భుత విజయం

Published Mon, Oct 21 2024 9:27 PM | Last Updated on Tue, Oct 22 2024 12:12 PM

Pro Kabaddi 2024: UP Yoddhas Beat Dabang Delhi

రాణించిన భవానీ రాజ్‌పుత్‌, సాహుల్ కుమార్

హైదరాబాద్,: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ను  యూపీ యోధాస్ జట్టు అద్బుత విజయంతో ఆరంభించింది. డిఫెన్స్‌లో  గొప్ప ప్రదర్శన చేస్తూ  రెండో భాగంలో గొప్పగా పుంజుకున్న యూపీ.. బలమైన దబాంగ్ ఢిల్లీ కేసీపై పైచేయి సాధించింది. సోమవారం  రాత్రి ఇక్కడి  జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో  యూపీ యోధాస్ 28–23 తేడాతో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. యూపీ జట్టులో రైడర్లు భవానీ రాజ్‌పుత్‌ (7 పాయింట్లు), సురేందర్ గిల్ (4) ఆకట్టుకోగా.. డిఫెండర్ సాహుల్ కుమార్ 5 పాయింట్లతో హైఫైవ్ సాధించాడు.  ఢిల్లీ జట్టులో కెప్టెన్‌, స్టార్ రైడర్‌‌ అషు మాలిక్ 15 రైడ్స్‌లో నాలుగే పాయింట్లు రాబట్టాడు. నవీన్ కుమార్ (4), ఆశీష్ (4) పోరాడినా ఫలితం లేకపోయింది.

ఈ మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా సాగింది. ఇరు జట్లూ పోటాపోటీగా తలపడుతూ  చెరో పాయింట్ సాధిస్తూ ముందుకెళ్లాయి. సురేందర్ గిల్ తెచ్చిన బోనస్‌తో యూపీ ఖాతా తెరవగా.. భరత్‌ను ట్యాకిల్ చేసిన యోగేశ్‌ ఢిల్లీకి తొలి పాయింట్ అందించాడు. డూ ఆర్ డై  రైడ్‌కు వచ్చిన  అషు సింగ్ సింగిల్‌ టయాకిల్ చేయగా.. భరత్ రెండోసారి ఢిల్లీ డిఫెండర్లకు దొరికిపోయాడు. ఈ దశలో అషు మాలిక్ వరుసగా రెండు రైడ్ పాయింట్లు రాబట్టాడు. మరోసారి రైడ్‌కు వచ్చిన అతడిని..  యూపీ ట్యాకిల్ చేయగా.. సురేందర్ గిల్‌ను  యోగేశ్‌ నిలువరించాడు.  ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో డూ ఆర్ డై రైడ్‌లోనే  ఢిల్లీ, యూపీ పాయింట్లు రాబట్టే ప్రయత్నం చేశాయి. దాంతో ఆట సమంగా సాగింది. విరామం ముంగిట చివరి రైడ్‌కు వచ్చిన అషు మాలిక్‌ను సుమిత్ ట్యాకిల్ చేయడంతో యూపీ 12–11తో ఒక పాయింట్ ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. 



కోర్టు మారిన తర్వాత యూపీ యోధాస్‌ పైచేయి సాధించింది. ఆలౌట్ ప్రమాదం తప్పించుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ముందంజ వేసింది.  విరామం నుంచి వచ్చిన వెంటనే  ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్‌‌.. సాహుల్ కుమార్, అషు సింగ్‌ పట్టు నుంచి తప్పించుకొని వచ్చి రెండు పాయింట్లు అందించాడు. ఆపై విక్రాంత్‌ను భరత్ ట్యాకిల్ చేయడంతో  దబాంగ్ ఢిల్లీ 16–14తో రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వచ్చింది. మరోవైపు  కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలడంతో యూపీ ఆలౌట్ ప్రమాదం ముంగిట నిలిచింది. 

కానీ,  హితేశ్‌, మొహమ్మద్‌రెజా కలిసి ఢిల్లీ కెప్టెన్ అషు మాలిను  సూపర్ ట్యాకిల్ చేయడంతో 16–16తో స్కోరు మరోసారి  సమం అయింది.  ఇక్కడి నుంచి యూపీ వేగం పెంచింది. భవాని రాజ్‌పుత్‌, సురేందర్ గిల్ చెరో  రైడ్ పాయింట్‌ రాబట్టగా.. నవీన్‌, మోహిత్‌తో పాటు ఆశీష్‌ను  యూపీ డిఫెండర్లు ట్యాకిల్ చేయడంతో 33వ నిమిషంలో  ఢిల్లీ ఆలౌట్ అయింది. దాంతో యోధాస్ 24–18తో  ఆరు పాయింట్ల ఆధిక్యం అందుకుంది. చివర్లో దబాంగ్ ఢిల్లీ పుంజుకునే ప్రయత్నం చేసినా ఆ జట్టుకు  యోధాస్‌ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రైడింగ్‌లో భవనీ రాజ్‌పుత్‌, నితిన్‌ జోరు చూపెట్టగా.. అషు మాలిక్‌ను మరోసారి ట్యాకిల్ చేసిన సాహుల్ కుమార్ హైఫైవ్ సాధించాడు. దాంతో తన ఆధికాన్ని 27–20కి పెంచుకున్న యూపీ విజయం ఖాతాలో వేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement