పల్లెలకూ పాకిన బెట్టింగ్ భూతం | betting mafia in eluru over pro kabaddi, euro cup | Sakshi
Sakshi News home page

పల్లెలకూ పాకిన బెట్టింగ్ భూతం

Published Mon, Jun 27 2016 10:06 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

పల్లెలకూ పాకిన బెట్టింగ్ భూతం

పల్లెలకూ పాకిన బెట్టింగ్ భూతం

జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. కొంతకాలం క్రితం వరకు క్రికెట్‌కే పరిమితమైన బెట్టింగ్ జాడ్యం కబడ్డీ, ఫుట్‌బాల్, ఇతర పోటీలపైనా సాగుతోంది. పోలీసుల వరుస దాడులతో కొంతకాలం క్రితం తగ్గుముఖం పట్టినా ఇటీవల మళ్లీ విజృభిస్తోంది.  
 
ఏలూరు: జిల్లాలో బెట్టింగ్ మాఫియా క్రమేపీ మళ్లీ పుంజుకుంటోంది. కొంతకాలం క్రితం పోలీసుల దాడులతో కాస్త తగ్గినట్టు కనిపించినా మళ్లీ కోరలు చాస్తోంది. క్రికెట్‌తో మొదలైన బెట్టింగ్ ఝాఢ్యం మెల్లమెల్లగా అన్ని క్రీడలకూ పాకుతోంది. క్రీడతో సంబంధం లేకుండా ఏ పోటీలైనా బెట్టింగ్‌లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యూరో కప్ ఫుట్‌బాల్, కోపా అమెరికన్ ఫుట్‌బాల్ టోర్నీ, ప్రొ కబడ్డీ పోటీలపై కూడా జూదం జోరుగా సాగుతోంది.

గతంలో ఏలూరు నగర పరిధిలోని వన్‌టౌన్, టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. పెదవేగి మండల పరిధిలోని వేగివాడలో ఒక కేసు నమోదుకావడం గమనార్హం. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెలకూ ఈ మాఫియా విస్తరించిందనడానికి నిదర్శనం. పోలీసుల నిఘా కారణంగా ఎక్కువ మంది బుకీలు ఫోన్‌ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన అమిరంలో బెట్టింగ్ స్థావరంపై దాడి చేసిన పోలీసులు భారీస్థాయిలో నగదుతో పాటు నిందితులను పట్టుకున్నారు.
 
కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం
నిమ్మకాయలు విసిరే పందాల నుంచి మోటార్ వాహనాల టోటల్ ఎంత అంటూ నంబర్ల మొత్తాలపై కూడా పందేలు జరుగుతున్నాయి. క్రికెట్ పోటీలు జరిగితే బెట్టింగ్ నిర్వాహకులకు పండగే. ఒక వేళ ఎక్కడా క్రికెట్ పోటీలు లేకపోతే ఇతర క్రీడలపై పందేలు వేస్తున్నారు. ఏవీ లేకపోతే గ్రామ ముఖద్వారంలో నిలబడి రాబోయే మోటారు వాహనం టోటల్ ఎంత ఉంటుందనేది కూడా పందెం వేసుకుంటున్నారు.

జేబులు గుల్ల
బెట్టింగ్‌కు అలవాటు పడిన యువతలో చాలామంది చిరువ్యాపారులు, తల్లిదండ్రుల చాటు బిడ్డలు కావడంతో బెట్టింగ్‌లో వేలు గడించాలనే దురాశతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా మలుచుకున్న వ్యాపారులు వారికి ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. దీంతో వారి వ్యాపారు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది.
 
బెట్టింగ్ నివారణకు చర్యలు తీసుకున్నాం

ఏలూరు డివిజన్ పరిధిలో ఇప్పటికే బెట్టింగ్‌ల నిరోధానికి చర్యలు తీసుకున్నాం. త్వరలో ప్రొ కబడ్డీ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు ప్రారంభించాం. బెట్టింగ్ బుకీలను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. గతంలో బుకీలు, బెట్టింగ్‌లకు డబ్బులు వడ్డీకి అప్పులిచ్చే వ్యాపారులపైనా నిఘా కొనసాగిస్తున్నాం. బెట్టింగ్‌లపై ప్రజల వద్ద సమాచారం ఉంటే నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి నేరస్థులను కఠినంగా శిక్షిస్తాం. - ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement