సాక్షి, కృష్ణాజిల్లా: విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చి కారు.. మరో కారు ఢీకొట్టింది. ముందు భాగంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఐదుగురి ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం తోషిబా విద్యుత్ కంపెనీలో పని చేస్తున్న శివప్రసాద్‌కు చెందిన కారుగా గుర్తించారు. గన్నవరం పిన్నమనేని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.
మరో ఘటనలో...
మరో ఘటనలో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారిపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి మరో వాహన చోదకుడిని బలితీసుకున్నాడు. పట్టపగలు నడిరోడ్డు పై జరిగిన ఈ ఘటనలో వ్యక్తి మృతి దుర్మరణం చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల వద్ద ఏలూరు రోడ్డుపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి ప్రాంతానికి చెందిన బడుగు సోమయ్య (54) వ్యవసాయం చేస్తుంటాడు. ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె మమతతో కలసి కోర్టు పనుల నిమిత్తమై ద్విచక్రవాహనంపై విజయవాడ వచ్చారు. ఏలూరు రోడ్డు గుణదల నుంచి చుట్టుగుంట వైపు వెళుతుండగా వెనుకగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న సోమయ్య, మమత రోడ్డుపై పడిపోయారు. అంతటితో ఆగకుండా ఆ డ్రైవర్ తన ట్రాక్టర్‌ను ముందుకు నడిపాడు.
ఈ ఘటనలో రోడ్డుపై పడి ఉన్న సోమయ్యపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మమత కొద్ది దూరంలో పడగా ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108 సహాయంతో బాధితులను వైద్యం నిమిత్తం గుణదలలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తరువాత సోమయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మమతకు ప్రాణాపాయం లేదని ఆమె కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సోమయ్య కుమారుడు బడుగు దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ సాంబశివరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment