betting mafia
-
బెట్టింగ్ బాలరాజులు! కొంపలు కాలిపోతున్నాయి.!
బెట్టింగ్... ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ... చాప కింద యాసిడ్‌లా విస్తరించి అనేక కొంపల్ని ముంచేస్తోంది . బెట్టింగ్ ఒక మానసిక వ్యసనం ! తల్లితండ్రులు " కంచు" టైపు అయితే పిల్లల్లో బెట్టింగ్ వ్యసనం వచ్చే అవకాశం ఎక్కువ ! " కంచు మొగునట్లు కనకంబు మోగునా ?" అని నానుడి. కొంత మంది ఎంత సేపూ "షో ఆఫ్ " టైపు . తమ గొప్పలు చెప్పుకోవడం .. చూపుకోవడం వీరి దిన చర్య . కిట్టి పార్టీలు మందు పార్టీలలో ఈ "కంచులు" గణగణ మోగుతుంటాయి . " ఈ కాలం కూడా ఇంకా మారుతీ సుజుకిలో ఎట్టా ట్రావెల్ చేస్తారో .. ఏంటో .. నేనైతే మినిమం వోల్వో వదినా .. మా అన్నగారయితే లాండ్రోవర్ దిగరు" అని బిల్డప్‌లు ఇస్తూ బతికేస్తారు. అదొక ఐడెంటిటీ క్రైసిస్. ఆత్మ న్యూనతా భావం. ఆవు చేలో దూడ గట్టున మేస్తుందా ? నేను గొప్ప అని అవతలివారికి చాటి చెప్పుకోవాలి అనే ఆలోచన బెట్టింగ్ కు దారి తీస్తుంది. కష్టపడే తత్త్వం లేకపోవడం , ఈజీ గా డబ్బు సంపాదించాలి అనుకోవడం కూడా ఒక కారణం గ్యాంబ్లింగ్ డిసార్డర్ - అనేది తీవ్ర మానసిక రోగం. నేడు ఎంతో మంది దీని బారినపడి సతమమవుతున్నారు . ఆలోచనలు ఎప్పుడూ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరుగుతుంటాయి. ఎన్నికలు .. క్రికెట్... సినిమా జయాపజయాలు.. కాదోయి ఏది బెట్టింగ్ కు అనర్హం. ఒక్క సారి గెలిస్తే.. "ఇప్పుడు మనకు సుడి తిరిగింది.. స్టార్స్ కలిసి వస్తున్నాయి.. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తే అది ఇప్పుడే.. ఇప్పుడే" అంటూ అందులో లీనం అయిపోతారు. ఓడితే .. "ఇజ్జాత్ కా సవాల్ .. ప్రెస్టేజ్ క్వొశ్చన్.. ఓడిపోయి పోవడమా? గెలిచే దాక ఆడాల్సిందే!" అంటూ ఆటలో మునిగిపోతారు. అంటే బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ అనేది సుడిగుండం. పద్మ వ్యూహం.. ఒక సారి దిగితే సేఫ్ గా బయటకు రావడం అనేది ఉండదు . ఆలా ఒకటి రెండు సార్లు వచ్చినా ఆది అంతం కాదు .. జస్ట్ బిగినింగ్. జూదంలో గెలవడం వల్ల డోపమైన్ హార్మోన్ వస్తుంది . ఇది మహా కిక్కు ఇస్తుంది. ముందుగా ఒక పెగ్గు మందుతో స్టార్ట్ చేసినవాడికి మూడేళ్లయ్యే సరికి కనీసం క్వార్టర్ దిగనిదే కిక్కు ఎక్కదు. బెట్టింగ్ కూడా అంతే. అమౌంట్ పెంచుకొంటూ పెద్ద పెద్ద బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తేనే మునుపటి కిక్కు వస్తుంది. కాబట్టి చిన్నగా మొదలయిన వ్యసనం.. ఆస్తులు... పెళ్ళాం పిల్లల తాకట్టు దాకా దారితీస్తుంది . "నేనట్టా కాదు లే ... నేను మహా స్మార్ట్. జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నా". అని ప్రతి బెట్టింగ్ బంగారు రాజు అనుకొంటాడు. బెట్టింగ్ డోపమైన్ "హై" అనేది ఒక సైంటిఫిక్ రూల్. అది ఎవడినీ వదలదు అని వాడు అర్థం చేసుకొనేటప్పటికీ అన్ని అయిపోయి కొంపలు కాలిపోయి ఉంటాయి. మహాభారతం కాలం నుంచి అన్ని రకాల జూదాలు/ బెట్టింగ్ లు మాయా వ్యవహారాలే. కేసినోకు పొయ్యి సర్వ నాశనం కానోడు .. కేసినో నిర్వహించి కోట్లకు పడగలెత్తని వాడు భూప్రపంచం లో కనపడడు. బెట్టింగ్ బంగారు రాజులను బకరాలను చేయడానికి బెట్టింగ్ మాఫియా .." ఫలానా వాడు మిలియన్స్ సాధించాడు" అని బిల్డ్ అప్ స్టోరీ లు వదులుతుంటుంది. బకరాలు నమ్మేస్తారు . బెట్టింగ్ వల్ల నిమ్మళంగా ఒక చోట కూర్చోలేని చంచలత్వం వస్తుంది . ఇలాంటి వారు ఏ పనిపై దృష్టి సారించలేరు . బెడ్ రూమ్‌లో కూడా ఇదే ధ్యాసతో వుంటారు .ఉస్సేన్ బోల్ట్ లయి పోతారు, ఆ తర్వాత ఇంకేముంది.. సంసార జీవనంలో చిక్కులే చిక్కులు. బెట్టింగ్ గాళ్ళు సులభంగా చిరాకు కు గురవుతారు . అసహనం పెరిగిపోతుంది. బెట్టింగ్ అప్పులకు దారి తీస్తుంది . అప్పులు తీర్చ్చడానికి అదనంగా బెట్టింగ్ చేస్తారు . ఆంటే చిన్న ఊబిలో నుంచి మరీనా ట్రెంచ్ లోతుల్లోకి వీరి పతనం వేగంగా సాగుతుంది. తమ కుటుంబానికి తమ వ్యసనం గురించి తెలిసిపోకుండా ఉండేందుకు అబద్దాలు చెప్పడం మొదలెడతారు. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ జరిగే చోట మందు- విందు- పొందు తప్పని సరి ఆడ్ ఆన్స్. డయాబెటిస్ బిపి కిడ్నీ సమస్యలు ఊబకాయం , ఎయిడ్స్ .. వీరు అదనంగా పొందే కొన్ని బహుమతులు . బెట్టింగ్ వల్ల అప్పుల ఊబి ఖాయం . ఆత్మహత్యలు ... కొన్ని సార్లు హత్యలు .. అటుపై చిప్పకూళ్ళు .. బెట్టింగ్ కుటుంబాలను నాశనం చేస్తుంది . 25ఏళ్ళ లోపు వారిలో మెదడు ముందుభాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా అభివృద్ధి చెందివుండదు . దీనితో వీరు భావోద్వేగాలను తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగివుండరు . వీరి చేతిలో సెల్ ఫోన్ . నేడు నీలి చిత్రాలు , హింసాత్మక వీడియో గేమ్స్ కన్నా కుటుంబాలను నాశనం చేస్తోంది ఆన్లైన్ బెట్టింగ్. చేతిలో సెల్ ఫోన్ ఏదో చేసుకొంటున్నాడు అని తల్లితండ్రులు అనుకొనే లోపే బెట్టింగ్ మాఫియా లు వచ్చి " మీ వాడు ఇరవై లక్షలు అప్పుపడ్డాడు . ఇస్తారా చస్తారా? అంటూ బెదిరించి ఆస్తులు మానప్రాణాలు తీసిన ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. మీ ఇంటిలో కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. బెట్టింగ్ మాఫియా కాళ్లావేళ్లా పడ్డా కనికరించదు. దయనీయమయిన స్థితిలో జీవితాన్ని చాలించాల్సి వస్తుంది. సిగరెట్ తాగితే ఇరవై ఏళ్లకు ప్రాణం మీదకు వస్తుంది. మందు తాగితే 15 ఏళ్లకు. గంజాయి కొడితే ఐదేళ్లకు. ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కేవలం ఆరునెలలకు.. చస్తారు. మిగతా వాటిలో తాగిన వాడొక్కడి ప్రాణం. కానీ ఆన్లైన్ బెట్టింగ్ లో ఇంటిల్లి పాదీ.. కట్టకట్టుకుని.. తస్మాత్ జాగ్రత్త . పిల్లల్ని సెల్ ఫోన్ కు దూరంగా ఉంచండి . 'ఈజీ మనీ పాములాంటిది అని చెప్పండి . కష్టపడే తత్వాన్ని నేర్పండి. వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
మునుగోడులో బెట్టింగ్ జోరు.. కోట్లలో లావాదేవీలు
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ తరహాలో ఉప ఎన్నికపై బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు మునుగోడు ఎన్నికలను కీలకంగా తీసుకున్న నేపథ్యంలో గెలుపోటములపై బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. అభ్యర్థులను అంచనా వేస్తూ ఏకంగా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు, నగదు చేతులు మారుతున్నట్లు సమాచారం. మునుగోడుతో పాటు చౌటుప్పల్, నాంపల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌లోని పలు ప్రాంతల్లో ఏజెంట్లను నియమించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థిపై ఒక్కో విధంగా బెట్టింగ్‌లు వేస్తూ, ఆన్లైన్ ట్రాన్సక్షన్ ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నారని వినికిడి. అయితే మునుగోడులో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బెట్టింగ్ రాయుళ్లపై కన్నేసి ఉంచింది. కాగా ఇప్పటికే మునుగోడు ఓటర్లను ప్రలోభా పెట్టడానికి పార్టీ నేతలు భారీ నగదు పంపిణీ, మద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. మంత్రుల వాహనాలతో సహా అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. చదవండి: నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్.. -
అక్రమాల అడ్డా.. నడిగడ్డ!
సాక్షి, గద్వాల క్రైం: అక్రమార్కుల ధాటికి జోగుళాంబ గద్వాల జిల్లాలోని విలువైన సంపద లూఠీ అవుతోంది. అమాయక ప్రజలను గారడీ మాటలతో మోసం చేసి మల్టీలెవల్ స్కీంల పేరిట రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఉన్నత విద్యకు తక్కువ ఫీజంటూ చెప్పి రూ.లక్షలు దండుకున్నారు. ఆరుగాలం శ్రమించే రైతన్నలకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మి సొమ్ము చేసుకున్న ముఠాలు, రూ.100కు రూ.10 వడ్డీ వసూలు చేసే జలగలు, అనుమతుల పేరిట, అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు, ఇసుక, మట్టి తవ్వకాలు.. ప్రభుత్వ, దేవాదాయ, ఇనాం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలు.. గుట్కా, మట్కా, గంజాయి, సారా, కల్తీ కల్లు విక్రయాలు, యువతను పెడదోవ పట్టించే బెట్టింగ్, పేదల బియ్యం పక్కదారితోపాటు పలు చీకటి దందాలకు నడిగడ్డ అడ్డాగా మారింది. ఇక కేసుల పరిష్కారం కోసం బాధితులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకు కొత్తగా వచ్చే ఎస్పీపైనే ప్రజలు కోటి ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో నడిగడ్డ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, చీకటి వ్యాపారాలపై ప్రత్యేక కథనం.. పాత కేసుల పురోగతి సాధ్యమేనా? 2018లో నకిలీ పాస్ పుస్తకాల విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుమారు 10 వేల నకిలీ పాస్ పుస్తకాలు బయటపడ్డాయి. ఈ కేసులు ఇందులో దళారీ నుంచి రాజకీయ నాయకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపారులు సైతం చిక్కి జైలు జీవితం గడిపారు. ఇక కేసు అనుకున్న స్థాయిలో విచారణ జరగకపోవడం, కీలక సూత్రదారులు బయటకు రాకపోవడంతో మిస్టరీగా మిగిలింది. నకిలీ విత్తనాలు జిల్లాలో సీడ్ కాటన్ (పత్తి) పంటలను రైతులు ఎక్కువ శాతం పండించడం, విత్తన తయారీకి జాతీయ స్థాయిలో గద్వాలకు పేరు ఉంది. అయితే ఇక్కడే జాదుగాళ్లు నకిలీ విత్తనాలకు తెరలేపారు. ఫలితంగా సీడ్‌పత్తి పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోగా.. పలువురు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారు. వ్యవసాయాధికారులు పరిశీలించి నకిలీ విత్తనాలను నాటడంతోనే పంట దిగుబడి రాలేదని ధ్రువీకరించారు. ఈ విషయమై అప్పటి కలెక్టర్ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్ ప్రత్యేకంగా దృష్టిసారించడంతో జిల్లా యంత్రాగం ఒక్కసారిగా నకిలీ విత్తనాల ముఠా సభ్యుల స్థావరాలపై దాడులు చేసి నకిలీ పత్తి విత్తనాల కేసులను వెలుగులోకి తెచ్చారు. ఈ విత్తనాల తయారీలో పలు బడా కంపెనీలు, సీడ్‌పత్తి వ్యాపారులు, దళారులను అదుపులోకి తీసుకుని వేలాది క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ సీడ్‌పత్తి విత్తనాలతోపాటు మిర్చి, ఇతరత్రా కంపెనీలపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే వివిధ కారణాలతో ఈ కేసుల విషయంలో కూడా ఎలాంటి పురోగతి కనిపించలేదు. వడ్డీ జలగలు.. అవసరాలకు అప్పులు చేసేందుకు సామాన్యులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే వారిని నిలువునా ముంచుతున్నారు. రూ.100కు రూ.10 వడ్డీ వసూలు చేయడం గమనార్హం. అప్పు తీసుకుని సకాలంలో వడ్డీలు చెల్లించలేక ఉన్న కొందరు ఆస్తులను తాకట్టు పెట్టి నేటికీ సతమతమవుతున్నారు. 2017లో అప్పటి ఎస్పీ వద్దకు బాధితులు ఫిర్యాదు చేయడంతో జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు. ఇచ్చిన అప్పులకు కట్టిన వడ్డీలను అంచనా వేయగా రూ.కోట్లలో తేలింది. ఈ విషయమై ప్రముఖ వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసుల్లో కూడా తీవ్ర జాప్యం జరిగిందన్న విమర్శలున్నాయి. విలువైన సంపద ఖాళీ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల పరిసర ప్రాంతాల నుంచి జాతీయ సంపదైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ వనరులను కాపాల్సిన ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు సంఘాల నాయకులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీస్‌శాఖ ప్రత్యేక సిబ్బందితో ఇసుక వ్యాపారానికి కాస్త చెక్ పెట్టారు. ఈ దందాలో పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటడంతో నామమాత్రపు చర్యలు తప్ప కఠిన చర్యలు లేవని ప్రజలు ఆరోపణ. అలాగే మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జిల్లాలో జరుగుతున్నాయి. అక్రమార్కుల ధాటికి గుట్టలు సైతం ఖాళీ అవుతున్నాయి. ఇక అక్రమ దందాను నిలువరించేందుకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక పీడీఎస్ బియ్యం సైతం పక్కదారి పడుతుంది. నిషేధిత మత్తు పదార్థాలు నిషేధిత మత్తు పదార్ధాల దందా సైతం జిల్లాలో జోరుగా సాగుతుంది. గంజాయి సాగు కూడా గుట్టుగా సాగిస్తున్నారు. ముఖ్యంగా అయిజ, గద్వాల, నదితీర ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి పలు రాష్ట్రాలకు కూడ ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. కల్తీ కల్లు, సారా, మద్యం కూడా జిల్లాలో జోరుగా నడుస్తుంది. ఇక రాయిచూర్ నుంచి గద్వాల మీదుగా ప్రతిరోజు గుట్కాను అక్రమంగా తరలిస్తున్నారు. తెరపైకి పలువురి పేర్లు జిల్లా ఎస్పీ ఎవరనే విషయంపై ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా సింధుశర్మ, మల్లారెడ్డి, శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నారాయణపేట, వనపర్తి ఎస్పీల పేర్లు సైతం ప్రచారంలోకి వచ్చాయి. గత నెల 30న పదవీ రమణ పొందిన లక్ష్మీనాయక్ స్థానంలో అదే రోజే వనపర్తి ఎస్పీ అపూర్వారావుకు ఇన్చార్జ్ ఎస్పీగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఏర్పాటు తర్వాత.. జోగుళాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు నుంచి పలు చికటీ కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కుమార్ అక్రమార్కుల దందాలపై తనదైన ముద్ర వేసి చాలా వరకు అడ్డుకట్ట వేశారు. ఇక 2018 మార్చి నెలలో ఎస్పీ విజయ్‌కుమార్ బదిలీ పై వెళ్లారు. అప్పటి నుంచి జిల్లాలో పలు దందాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.ఈ క్రమంలోనే గత నెల 30న జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ పదవీ విరమణ పొందడంతో జిల్లా బాస్ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎస్పీపైనే ఈ బాధ్యతలన్నీ పడనున్నాయి చర్యలు తీసుకుంటాం అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను దోచుకునే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. గతంలో నమోదైన కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులను తయారు చేసి విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపుతాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – అపూర్వరావు, ఇన్చార్జ్ ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
బెట్టింగ్ బంగార్రాజులు
సాక్షి, అశ్వారావుపేట: తెలంగాణ ఎన్నికలనూ బెట్టింగ్ మాఫియా వదల్లేదు. పోలింగ్‌కు ముందే పందేలు కాయడం మొదలు పెట్టారు. సాధారణంగా ఎన్నికల పందేలు పోలింగ్ తర్వాత మొదలవుతాయి. ఈసారి ప్రచారంతోటే ప్రారంభమయ్యాయి. క్రికెట్ బెట్టింగ్, పేకాట, కోడిపందేలు, ప్రో కబడ్డీ బెట్టింగ్‌కు పాల్పడే వారే ఈ దందాలో అధిక శాతం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏపీలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉంది. అక్కడి జూదరులకు ఈ ప్రాంతంతో సంబంధాలు, చుట్టరికాలు, వ్యవసాయ, వ్యాపారాలున్నాయి. దీంతో బెట్టింగ్ వ్యవహారం కూడా పాకింది. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోకుంటే రేపటి రోజున పందెం దొరకదన్నట్లుగా చెప్పుకుంటున్నారు. పందెం.. పలు రకాలు.. కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్, పేకాట, ప్రో కబడ్డీ మాదిరిగా ఎన్నికల బెట్టింగ్‌లో కూడా పలు రకాలున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ నిర్వాహకుడు, జూదగాళ్ల పరిజ్ఞానాన్ని బట్టి పందేలు కాస్తుంటారు. ఇందుకు ముందస్తు డిపాజిట్‌పై డిస్కౌంట్, స్పాట్ క్యాష్‌పై అడ్వాన్స్ బుకింగ్, క్రెడిట్ బుకింగ్ పై వడ్డీ వంటి సదుపాయాలున్నట్లు సమాచారం. క్రికెట్ బెట్టింగ్ ముఠానే ఈ తంతు నడిపిస్తుండగా.. వారి కస్టమర్లే ఇక్కడా రిపీట్ కావడంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. ఓ జూదగాడు రూ.5లక్షలు ముందుగా డిపాజిట్ చేస్తే అతనికి కోరుకున్నట్లుగా పందేలను అవసరమైతే తక్కువ కాన్సిలేషన్ చార్జీతో మార్చుకోవచ్చు. ముందుగా డబ్బులు కట్టలేనోళ్లు వారి పేర్లు నమోదు చేయించుకుంటే(నమ్మకస్తులు మాత్రమేనండోయ్) అప్పటికపుడు డబ్బు చెల్లించి పందెంలో పాల్గొనచ్చు. ఇది ఫలితాల రోజున జాతరలా ఉంటుందని సమాచారం. ఆడి చెడ్డోళ్లుంటారు.. మొదట్లో కారు.. ఓ డ్రైవర్.. క్యాష్ బ్యాగు మోయడానికి, గ్లాసులో మద్యం పోయడానికి ఓ అసిస్టెంట్‌తో బెట్టింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి... సర్వ నాశమయి.. ఎప్పటికైనా తిరిగి మొదటి స్థానానికి చేరుకోలేనా..? అనుకుంటూ అక్కడే ఓకొత్త జూదగాడికి అసిస్టెంట్‌గా పనిచేసే ఆడిచెడ్డోళ్లు. వీరికి మాత్రం డబ్బు కట్టకున్నా.. పరిమితంగా ఆడుకునే అవకాశమిస్తారు. కాకుంటే కాస్త(నూటికి 20శాతం మాత్రమే) వడ్డీ పడుద్ది అంతే. ఫేవరేట్.. తరుగు ఎన్నికల పందేల్లో ఒకరు ఫేవరేట్(గెలిచే అభ్యర్థి).. ఇంకొకరు తరుగు(ఓడే అభ్యర్థి) అని కోడ్ ఉంటుంది. బెట్టింగ్ మాఫియాలో రెండు వర్గాలుగా చీలిపోతారు. ఒకరు ఒకరిని ఫేవరేట్ అంటే మరో వర్గం మరొకరిని ఫేవరేట్ అంటారు. ఫేవరేట్పై పందె కాయాలంటే 30శాతం అదనంగా డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు.. అశ్వారావుపేటలో ఎక్స్ అనే అభ్యర్థి ఫేవరేట్ ఉన్నచోట రూ.లక్ష పందెం కాయాలంటే రూ.1.30లక్షలు డిపాజిట్ చేయాలి. ఎక్స్.. గెలిస్తే రూ.లక్ష తిరిగొస్తుంది. రూ.5వేలు కమిషన్ కట్ అవుతుంది. ఓడితే చేతికి పైసా కూడా రాదు. ఇదే మీడియేటర్ దగ్గర ఎక్స్ ప్రత్యర్థిపై పందెం కట్టి, రూ. లక్ష డిపాజిట్ చేస్తే... రూ.1.30లక్షలకు 5శాతం కమీషన్ పోను మిగిలినవి వస్తాయి. ఎక్స్ గెలిస్తే.. ఏమీ రావు. ఫేవరేట్పై సాహసించి పందెం కట్టడమే. తరుగుపైనే పందెం ఎక్కువగా కడతారు. ప్రస్తుతం అశ్వారావుపేటలో ఫేవరేట్.. తరుగు పందాలే ఎక్కువగా సాగుతున్నాయి. మెజారిటీపై కూడా.. గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఏ నియోజకవర్గంలో ఏఅభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుందనే పందేలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ గెలుపుతో సంబంధం ఏమాత్రముండదు. కేవలం మెజారిటీదే పాత్ర. వెయ్యి మెజారిటీ దాటదు... పదివేలకు తక్కువ రాదు.. పదీ పదిహేనువేల మధ్యలో వస్తుంది. నాలుగువేలు వస్తుంది కానీ మెజారిటీ ఐదు వేలకు చేరదు(నాలుగుంది గానీ.. ఐదు లేదు..) ఇలా రకరకాల పందేలు కాస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి టీఆర్ఎస్కు ఇన్నొస్తాయి.. ఇన్ని రావు.. కూటమికి ఇన్నొస్తాయి.. ఇన్నిరావు.. ప్రభుత్వం ఈపార్టీ ఏర్పాటు చేస్తుందనీ.. చేయదని.. రాష్ట్ర వ్యాప్తంగా ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు మాత్రమే వస్తాయని.. రావని.. ఫలానా ఫిగర్ దాటుతుందని.. దాటదని.. హంగు ఏర్పాటవుతుందని.. ఏర్పాటు కాదని.. కర్ణాటక లా సీన్ ఏర్పాటయితే ఎవరెవరు పార్టీలు మారతారు..? ఇలా రకరకాలుగా ఆఫర్లున్నాయి. సరిహద్దులో హద్దుమీరిన పందేలు జోరుగా సాగుతున్నాయి. కొందరు ఫేస్ టూ ఫేస్ పందేలు కాసుకుంటుంటే, కొందరు సెల్ఫోన్లో సంభాషిస్తూ బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ పందేలు.. రెండు తక్కువ, , మూడు తక్కువ, నాలుగు తక్కువ, ఐదు తక్కువ, ఆరు తక్కువ అంటూ కోడిపందేల్లో బిర్రి బయట అరుస్తుంటారు. ఇదే విధంగా ఎన్నికల్లో కూడా తక్కువ పందేలుంటాయి. రెండు తక్కువ అంటే పందెం కాసిన సొమ్మును రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని తగ్గిస్తారు. ఇలాగే ఏ అంకె పక్కన తక్కువ ఉంటే అన్ని భాగాలు చేసి ఒక భాగాన్ని మినహాయించుకుంటారు. ఈ పద్ధతి ప్రకారం ఉదాహరణకు సత్తుపల్లిలో ఎస్ అనే అభ్యర్థిపై రెండు తక్కువ పందెం ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారు. ఎస్పై రూ.లక్ష డిపాజిట్ చేస్తే.. ఆయన గెలిస్తే ఏమీలేదు. ఓడిపోతే రెండు లక్షలకు 5శాతం కమీషన్ కట్ చేసుకుని తిరిగిస్తారు. ఈతరహా పందేలు పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాలపై నడుస్తున్నాయి. మిగిలినవన్నీ ఫేవరేట్.. తరుగు పందాలే నడుస్తున్నట్లు తెలుస్తోంది. సంభాషణ ఇలా ఉంటుంది జూదగాడు.: ఏమండీ.. ఖమ్మం ఫేవరేట్ మీద ఓ లక్ష కట్టండి.. ఫంటర్(నిర్వాహకుడి ఏజెంట్): సరే సార్ మీ డిపాజిట్లో రూ.లక్ష పోగా ఇంకా నాలుగు లక్షలున్నాయి.. గెలుపోటముల తర్వాత.. జూదగాడు: ఏంటి మరి సంగతీ..? ఫంటర్: మీరు ఐదు పందేలు కట్టారు. రెండు పోయాయి. మూడు గెలిచారు. మూడుకు మూడు.. కమీషన్ పోను రెండున్నర లక్షలుంటాయ్. ఆడుకుంటారా.. పంపించాలా..? జూదగాడు: పంపించండి ఫంటర్: మావాడు వచ్చి మీకు ఫోన్ చేస్తాడు. జూదగాడు: సరే ‘ఎమ్’ అందింది. రెండున్నర లక్షలు. ఓకే ఇప్పటికి ఇద్దరి మధ్యా ఏమీ బ్యాలెన్స్ లేదు. ఇలా సంభాషణలే లెక్కలు చెప్పేస్తాయి. ఇలాంటి సంభాషణలకు మాత్రమే ప్రత్యేక ఫోన్లు, సిమ్‌లు మెమరీ కార్డులు వాడుతారు. ఇదీ ఎన్నికల పందేల తంతు. -
పల్లెలకూ పాకిన బెట్టింగ్ భూతం
జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. కొంతకాలం క్రితం వరకు క్రికెట్‌కే పరిమితమైన బెట్టింగ్ జాడ్యం కబడ్డీ, ఫుట్‌బాల్, ఇతర పోటీలపైనా సాగుతోంది. పోలీసుల వరుస దాడులతో కొంతకాలం క్రితం తగ్గుముఖం పట్టినా ఇటీవల మళ్లీ విజృభిస్తోంది. ఏలూరు: జిల్లాలో బెట్టింగ్ మాఫియా క్రమేపీ మళ్లీ పుంజుకుంటోంది. కొంతకాలం క్రితం పోలీసుల దాడులతో కాస్త తగ్గినట్టు కనిపించినా మళ్లీ కోరలు చాస్తోంది. క్రికెట్‌తో మొదలైన బెట్టింగ్ ఝాఢ్యం మెల్లమెల్లగా అన్ని క్రీడలకూ పాకుతోంది. క్రీడతో సంబంధం లేకుండా ఏ పోటీలైనా బెట్టింగ్‌లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యూరో కప్ ఫుట్‌బాల్, కోపా అమెరికన్ ఫుట్‌బాల్ టోర్నీ, ప్రొ కబడ్డీ పోటీలపై కూడా జూదం జోరుగా సాగుతోంది. గతంలో ఏలూరు నగర పరిధిలోని వన్‌టౌన్, టూటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. పెదవేగి మండల పరిధిలోని వేగివాడలో ఒక కేసు నమోదుకావడం గమనార్హం. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెలకూ ఈ మాఫియా విస్తరించిందనడానికి నిదర్శనం. పోలీసుల నిఘా కారణంగా ఎక్కువ మంది బుకీలు ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన అమిరంలో బెట్టింగ్ స్థావరంపై దాడి చేసిన పోలీసులు భారీస్థాయిలో నగదుతో పాటు నిందితులను పట్టుకున్నారు. కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం నిమ్మకాయలు విసిరే పందాల నుంచి మోటార్ వాహనాల టోటల్ ఎంత అంటూ నంబర్ల మొత్తాలపై కూడా పందేలు జరుగుతున్నాయి. క్రికెట్ పోటీలు జరిగితే బెట్టింగ్ నిర్వాహకులకు పండగే. ఒక వేళ ఎక్కడా క్రికెట్ పోటీలు లేకపోతే ఇతర క్రీడలపై పందేలు వేస్తున్నారు. ఏవీ లేకపోతే గ్రామ ముఖద్వారంలో నిలబడి రాబోయే మోటారు వాహనం టోటల్ ఎంత ఉంటుందనేది కూడా పందెం వేసుకుంటున్నారు. జేబులు గుల్ల బెట్టింగ్‌కు అలవాటు పడిన యువతలో చాలామంది చిరువ్యాపారులు, తల్లిదండ్రుల చాటు బిడ్డలు కావడంతో బెట్టింగ్‌లో వేలు గడించాలనే దురాశతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా మలుచుకున్న వ్యాపారులు వారికి ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. దీంతో వారి వ్యాపారు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది. బెట్టింగ్ నివారణకు చర్యలు తీసుకున్నాం ఏలూరు డివిజన్ పరిధిలో ఇప్పటికే బెట్టింగ్‌ల నిరోధానికి చర్యలు తీసుకున్నాం. త్వరలో ప్రొ కబడ్డీ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు ప్రారంభించాం. బెట్టింగ్ బుకీలను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. గతంలో బుకీలు, బెట్టింగ్‌లకు డబ్బులు వడ్డీకి అప్పులిచ్చే వ్యాపారులపైనా నిఘా కొనసాగిస్తున్నాం. బెట్టింగ్‌లపై ప్రజల వద్ద సమాచారం ఉంటే నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి నేరస్థులను కఠినంగా శిక్షిస్తాం. - ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు -
ఆపరేషన్ ‘బెట్టింగ్’!
► అజ్ఞాతంలోకి బుకీలు ► టీడీపీ నేతల హస్తం నెల్లూరు(క్రైమ్): క్రికెటర్లు ఫీల్డ్‌లో పరుగులు తీస్తుంటే బయట పందాలు కాస్తూ జల్సాలు చేసిన బుకీలు, పంటర్లు, బెట్టింగ్ మాఫియా ప్రస్తుతం ఎవ్వరికి కనపడకుండా పరుగులు తీస్తున్నారు. కొంప, గోడు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వారికి దాపురించింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్ క్రికెట్ పోటీలు ప్రారంభం నుంచే జిల్లా లో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఈనెల తొమ్మిది నుంచి ఐపీఎల్-9 ప్రారంభం కానుంది. 50 రోజుల పాటు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య, ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలను గుల్లచేస్తున్న బెట్టింగ్‌ను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ చర్యలు చేపట్టారు. ఆపరేషన్ బెట్టింగ్ పేరిట బుకీల భరతం పట్టేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఎవరినీ ఉపేక్షించవద్దని హుకుం జారీచేశారు. ఆదేశాలు అందిందే తడువుగా స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ విక్రమ్‌శ్రీనివాస్ నేతృత్వంలో సిబ్బంది బుకీల ఎరివేతకు చర్యలు చేపట్టారు. ఆదివారం పొదలకూరుకు చెందిన శ్యామ్‌ప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని నెల్లూరుకు తరలించి తమదైన శైలిలో విచారించినట్లు తెలిసింది. ఆయన వద్ద నుంచి పలువురు బుకీల ఫోన్ నెంబర్లు వివరాలు సేకరించారు. వారి గురించి గుట్టుగా ఆరా తీస్తున్నారు. అజ్ఞాతంలోకి బుకీలు: పోలీసు బాస్ చర్యలతో బుకీ ల వెన్నులో వణుకు మొదలైంది. సుమారు రెండేళ్లపాటు చక్రం తిప్పిన బుకీలు ఒక్కొక్కరిగా అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన బి.వి రమణకుమార్, సెంథిల్‌కుమార్‌లు క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో బెట్టింగ్‌కు బ్రేక్‌పడింది. ఆ తర్వాత ఎస్పీలు పెద్దగా దీనిపై దృష్టిసారించలేదు. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. జిల్లా ఎస్పీగా విశాల్‌గున్నీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి క్రికెట్ బెట్టింగ్‌పై పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆపరేషన్ బెట్టింగ్ పేరుతో బుకీల భరతం పట్టేందుకు చర్యలు చేపట్టారు. పలువురు రాజకీయనాయకులు: క్రికెట్ బెట్టింగ్‌లో పలువురు రాజకీయ నేతలు హస్తం ఉన్నట్లు సమాచారం. ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొన్న శ్యాంప్రసాద్‌ను, అతని సహచరుడైన టీడీపీ చోటా నేతను 2013మే 23వ తేదీన రెండో నగర పోలీసులు అరెస్ట్‌చేశారు. నాడు పోలీసులకు పట్టుబడ్డ నేత నేడు బడానేతగా మారాడు. నేటికి వారిద్దరూ సన్నిహితంగా గడుపుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారపార్టీకి చెందిన మరోనేత సైతం ఇదే తరహాలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో మాగంట లేఅవుట్లో పట్టుబడ్డ ఓ బుకీ సైతం ప్రస్తుతం తన కార్యకలాపాలను విసృ్తతం చేశాడన్న విమర్శలున్నాయి. హరనాధపురానికి చెందిన ఇద్దరు బుకీలు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎస్పీ చర్యలు అభినందనీయం: క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ఎస్పీ విశాల్‌గున్నీ తీసుకొంటున్న చర్యలకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. బెట్టింగ్ మాఫియా సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు. -
ఖమ్మం టు ఇంగ్లండ్... వయా ముంబై
* జడలు విప్పుతున్న బెట్టింగ్ మాఫియా * జిల్లాలో జోరుగా క్రికెట్ పందేలు మ్యాచ్ జరిగితే రూ.5కోట్లు తారుమారు * చేతులు మారుతున్న వందల కోట్ల రూపాయలు * హాట్‌లైన్, ఫేస్‌టుఫేస్ పేరుతో పందేలు * లక్షలాది రూపాయలు నష్టపోతున్న యువత * రాజకీయ నాయకులు, బడాబాబుల నుంచి సామాన్యుల వరకు అదే బాట * ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి వ్యసనాలకు లోనవుతున్న వైనం ఖమ్మం: ఖమ్మం మార్కెట్లో స్విచ్ వేస్తే ఎక్కడో ఉన్న లండన్‌లో లైటు వెలుగుతోంది. ఇక్కడ ఊ.. అంటే ముంబైలో పచ్చనోట్లు రెపరెపలాడుతున్నాయి. ఇదేమిటీ అని ఆశ్చర్యపోతున్నారా...జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌ల మహిమ. యువకులు, వ్యాపారులు, రాజకీయనాయకులు ఎందర్నో కట్టిపడేసి నిలువునా ముంచేస్తున్న ఈ వ్యసనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... వ్యసనపరుల బలహీనతను ఆసరాగా చేసుకున్న బెట్టింగ్ మాఫియా జిల్లాలో జడలు విప్పుతోంది. ట్వంటీ20, 50ఓవర్ల మ్యాచ్‌లు, లీగ్మ్యాచ్ల పేరుతో కోట్లాది రూపాయలు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారుతున్నాయి. ఇందుకు లండన్ ప్రధాన వేదికగా, ముంబై మాఫియా కనుసన్నల్లో ఆన్లైన్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలానా ఓవర్ వరకు ఇన్ని పరుగులు కొడతారని, మొత్తం ఇన్నింగ్స్‌లో ఇన్ని పరుగులు కొడతారని, ఫలానా జట్టు గెలుస్తుందని పందేలు కాస్తున్న వారు.. ముఖ్యంగా యువతరం బెట్టింగ్ మోజులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఈ బెట్టింగ్‌లో రాజకీయ నాయకులు, బడాబాబులు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నారు. ఎక్కడైనా సరే ఒక్కమ్యాచ్ జరిగితే... జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ రూపంలో రూ.5 కోట్లు చేతులు మారుతున్నాయంటే పందేల తీవ్రత అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలే కాదు...మండల కేంద్రాలకు కూడా బెట్టింగ్ మాఫియా విస్తరించింది. ఈ బెట్టింగ్‌ల రూపంలో ఇప్పటికే జిల్లాలో వందల కోట్ల రూపాయలు మార్పిడి జరిగిఉంటుందని అంచనా. ఈ జూదంలో వందలాది మంది జీవితాలు బలయిపోతున్నాయి. సునాయసంగా డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో లక్షల రూపాయలు పందేలు కాసి పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పులపాలై మానసిక వ్యథకు గురయిన వీరు పలు వ్యసనాలకు కూడా బానిసలవుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మెట్రోపాలిటన్ నగరాల తరహాలో బెట్టింగ్ నడుస్తున్నా నియంత్రించడంలో పోలీసు శాఖ విఫలమయిందనే భావన ప్రజల్లో నెలకొంది. బెట్టింగ్ కడతారిలా....! ఈ బెట్టింగ్ ప్రక్రియ చాలా పక డ్బందీగా జరుగుతుంది. ట్వంటీ20 నుంచి ఎలాంటి మ్యాచ్ జరిగినా హాట్‌లైన్ ఓపెన్ అయిపోతుంది. ముందుగా మ్యాచ్ ప్రారంభం కాగానే 10 ఓవర్లకు బ్యాటింగ్ జట్టు ఎంత స్కోరు చేస్తుందనేది నిర్ధారించి ఆ స్కోరుపై బెట్టింగ్ కాస్తారు. నిర్వాహకులు ఇంత స్కోరు చేస్తుందని చెపితే బెట్టింగ్ చేసేవాళ్లు ఎస్ ఆర్ నో చెప్పాలి. దానిని బట్టి 10 ఓవర్లు పూర్తయిన తర్వాత గెలుపోటముల ఆధారంగా అప్పటికే వారి వద్ద ఉన్న నగదు నుంచి మినహాయించుకోవడం లేదా బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 25, 35, 50 ఓవర్లకు, మరలా ఇన్నింగ్స్కోరుకు, ఆ తర్వాత మ్యాచ్ ఫలితంపై... ఇలా పలు దశల్లో మ్యాచ్ పూర్తయ్యే వరకు ఈ బెట్టింగ్ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఒక పందెం ఓడితే ఆ డబ్బులు రాబట్టుకోవాలని, గెలిస్తే మరిన్ని డబ్బులు సంపాదించాలని జూదరులు ఈ బెట్టింగ్‌లో మ్యాచ్ పూర్తయ్యేంతవరకు పాల్గొంటూనే ఉంటారు. ఇక ట్వంటీ20 మ్యాచ్‌లో అయితే తొలుత 6ఓవర్లకు, ఆ తర్వాత ఇన్నింగ్స్ స్కోరు, మరలా మ్యాచ్ఫలితంపై బెట్టింగ్‌లుంటాయి. హాట్‌లైన్ పద్ధతిలో ఇలా ఉంటే.... ఇక ఫేస్‌టుఫేస్ బెట్టింగ్‌ల పేరిట మరో రకం పందేలు నడుస్తున్నాయి. తెలిసిన వ్యక్తుల మధ్య జరిగే ఈ బెట్టింగ్‌లలో కూడా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. అయితే, ఈతరహా బెట్టింగ్‌లు మాత్రం మ్యాచ్ ఫలితం పైనే ఎక్కువగా సాగుతున్నాయి. ఈ బెట్టింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లాలో వందలాది మంది బుకీలున్నట్లు సమాచారం. వీరికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న బుకీలతో సంబంధాలున్నాయని, నిత్యం వారిని సంప్రతిస్తూ బె ట్టింగ్‌లు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని సమాచారం. వీరి గురించి పోలీసులకు తెలిసినా ఏమీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జూదంలో కోల్పోయి... ఇతర వ్యసనాలకు బానిసలై... ఈ బెట్టింగ్ జూదంలో జిల్లా ప్రజలు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. యువకులు ఇంట్లో డబ్బులు దొంగిలించి పందేలు కాస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన మోటారు బైక్‌లను సైతం ఫైనాన్స్‌లలో తాకట్టుపెట్టి మరీ బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఇక వ్యాపారులు, రాజకీయ నాయకులది కూడా ఇదే పరిస్థితి. కొందరు బడాబాబులు అయితే లక్షల్లో బెట్టింగ్‌లు కడుతున్నారు. ఒక్కోరోజు దాదాపు రూ.3లక్షలు పోగొట్టుకున్న లేదా సంపాదించిన సందర్భాలు కూడా ఉంటాయని, అయితే ఎక్కువగా డబ్బు పోగొట్టుకోవడమే జూదం ప్రధాన లక్షణమని బెట్టింగ్‌లో ఆర్థికంగా నష్టపోయిన ఓ వ్యాపారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా డబ్బులు పోగొట్టుకున్నామనే బాధతో యువకులు కొన్ని వ్యసనాలకు కూడా లోనవుతున్నారు. తాగుడు, మత్తుమందు లాంటి వాటికి బానిసలయి అటు కుటుంబాలను, ఇటు తమ వ్యక్తిత్వాన్ని బజారుకీడ్చుకుంటున్నారు. ఖాకీలేం చేస్తున్నారు? కోట్ల రూపాయలు చేతులుమారే బెట్టింగ్ రాకెట్ జెట్స్పీడ్తో దూసుకెళుతుంటే అరికట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బుకీల సమాచారం, బెట్టింగ్ వ్యవహారం పక్కాగా తెలిసినప్పటికీ పోలీసు శాఖ చేష్టలుడిగిందనే విమర్శలున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడం, అసలు తీసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఖాకీలు బుకీల మధ్య ఏదైనా ‘అవగాహన’ఉండి ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎప్పుడో ఓ నలుగురుని అరెస్టు చేసి బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని చెప్పే పోలీసులు ఆ తర్వాత అసలు ఆ వైపు దృష్టి కూడా సారించడంలేదు. పందేల రూపంలో లక్షల రూపాయలు కోల్పోతున్న యువత భవిష్యత్తు నాశనమయిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో... విధినిర్వహణలో చురుకుగా, కఠినంగా వ్యవహరిస్తారనే పేరు సంపాదించుకున్న జిల్లా పోలీస్‌బాస్ అయినా కలగజేసుకుని ఈ బెట్టింగ్ జాఢ్యం నుంచి జిల్లా ప్రజలను విముక్తులను చేయాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.