బెట్టింగ్‌ బంగార్రాజులు | Betting Mafia Gambling During Elections | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ బంగార్రాజులు

Published Tue, Nov 27 2018 10:57 AM | Last Updated on Tue, Nov 27 2018 11:00 AM

Betting Mafia Gambling During Elections - Sakshi

సాక్షి, అశ్వారావుపేట: తెలంగాణ ఎన్నికలనూ బెట్టింగ్‌ మాఫియా వదల్లేదు. పోలింగ్‌కు ముందే పందేలు కాయడం మొదలు పెట్టారు. సాధారణంగా ఎన్నికల పందేలు పోలింగ్‌ తర్వాత మొదలవుతాయి. ఈసారి ప్రచారంతోటే ప్రారంభమయ్యాయి. క్రికెట్‌ బెట్టింగ్, పేకాట, కోడిపందేలు, ప్రో కబడ్డీ బెట్టింగ్‌కు పాల్పడే వారే ఈ దందాలో అధిక శాతం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏపీలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉంది. అక్కడి జూదరులకు  ఈ ప్రాంతంతో సంబంధాలు, చుట్టరికాలు, వ్యవసాయ, వ్యాపారాలున్నాయి. దీంతో బెట్టింగ్‌ వ్యవహారం కూడా పాకింది. ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకోకుంటే రేపటి రోజున పందెం దొరకదన్నట్లుగా చెప్పుకుంటున్నారు.  

పందెం.. పలు రకాలు.. 
కోడిపందేలు, క్రికెట్‌ బెట్టింగ్, పేకాట, ప్రో కబడ్డీ మాదిరిగా ఎన్నికల బెట్టింగ్‌లో కూడా పలు రకాలున్నట్లు తెలుస్తోంది.  బెట్టింగ్‌ నిర్వాహకుడు, జూదగాళ్ల పరిజ్ఞానాన్ని బట్టి పందేలు కాస్తుంటారు. ఇందుకు ముందస్తు డిపాజిట్‌పై డిస్కౌంట్, స్పాట్‌ క్యాష్‌పై అడ్వాన్స్‌ బుకింగ్, క్రెడిట్‌ బుకింగ్‌ పై వడ్డీ వంటి సదుపాయాలున్నట్లు సమాచారం. క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠానే ఈ తంతు నడిపిస్తుండగా.. వారి కస్టమర్లే ఇక్కడా రిపీట్‌ కావడంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా సాగిపోతోంది.  ఓ జూదగాడు రూ.5లక్షలు ముందుగా డిపాజిట్‌ చేస్తే అతనికి కోరుకున్నట్లుగా పందేలను అవసరమైతే తక్కువ కాన్సిలేషన్‌ చార్జీతో మార్చుకోవచ్చు. ముందుగా డబ్బులు కట్టలేనోళ్లు వారి పేర్లు నమోదు చేయించుకుంటే(నమ్మకస్తులు మాత్రమేనండోయ్‌) అప్పటికపుడు డబ్బు చెల్లించి పందెంలో పాల్గొనచ్చు. ఇది ఫలితాల రోజున జాతరలా ఉంటుందని సమాచారం.  

ఆడి చెడ్డోళ్లుంటారు..  
మొదట్లో కారు.. ఓ డ్రైవర్‌.. క్యాష్‌ బ్యాగు మోయడానికి, గ్లాసులో మద్యం పోయడానికి ఓ అసిస్టెంట్‌తో బెట్టింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చి... సర్వ నాశమయి.. ఎప్పటికైనా తిరిగి మొదటి స్థానానికి చేరుకోలేనా..? అనుకుంటూ అక్కడే ఓకొత్త జూదగాడికి అసిస్టెంట్‌గా పనిచేసే ఆడిచెడ్డోళ్లు. వీరికి మాత్రం డబ్బు కట్టకున్నా.. పరిమితంగా ఆడుకునే అవకాశమిస్తారు. కాకుంటే కాస్త(నూటికి 20శాతం మాత్రమే) వడ్డీ పడుద్ది అంతే.

ఫేవరేట్‌.. తరుగు 
ఎన్నికల పందేల్లో ఒకరు ఫేవరేట్‌(గెలిచే అభ్యర్థి).. ఇంకొకరు తరుగు(ఓడే అభ్యర్థి) అని కోడ్‌ ఉంటుంది. బెట్టింగ్‌ మాఫియాలో రెండు వర్గాలుగా చీలిపోతారు. ఒకరు ఒకరిని ఫేవరేట్‌ అంటే మరో వర్గం మరొకరిని ఫేవరేట్‌ అంటారు. ఫేవరేట్‌పై పందె కాయాలంటే 30శాతం అదనంగా డిపాజిట్‌ చేయాలి. ఉదాహరణకు.. అశ్వారావుపేటలో ఎక్స్‌ అనే అభ్యర్థి ఫేవరేట్‌ ఉన్నచోట రూ.లక్ష పందెం కాయాలంటే రూ.1.30లక్షలు డిపాజిట్‌ చేయాలి. ఎక్స్‌.. గెలిస్తే రూ.లక్ష తిరిగొస్తుంది. రూ.5వేలు కమిషన్‌ కట్‌ అవుతుంది. ఓడితే చేతికి పైసా కూడా రాదు. ఇదే మీడియేటర్‌ దగ్గర ఎక్స్‌ ప్రత్యర్థిపై  పందెం కట్టి,  రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే... రూ.1.30లక్షలకు 5శాతం కమీషన్‌ పోను మిగిలినవి వస్తాయి. ఎక్స్‌  గెలిస్తే.. ఏమీ రావు. ఫేవరేట్‌పై సాహసించి పందెం కట్టడమే. తరుగుపైనే పందెం ఎక్కువగా కడతారు. ప్రస్తుతం అశ్వారావుపేటలో ఫేవరేట్‌.. తరుగు పందాలే ఎక్కువగా సాగుతున్నాయి.
మెజారిటీపై కూడా.. 
గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఏ నియోజకవర్గంలో ఏఅభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుందనే పందేలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ గెలుపుతో సంబంధం ఏమాత్రముండదు. కేవలం మెజారిటీదే పాత్ర. వెయ్యి మెజారిటీ దాటదు... పదివేలకు తక్కువ రాదు.. పదీ పదిహేనువేల మధ్యలో వస్తుంది. నాలుగువేలు వస్తుంది కానీ మెజారిటీ ఐదు వేలకు చేరదు(నాలుగుంది గానీ.. ఐదు లేదు..) ఇలా రకరకాల  పందేలు కాస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో పదికి టీఆర్‌ఎస్‌కు ఇన్నొస్తాయి.. ఇన్ని రావు.. కూటమికి ఇన్నొస్తాయి.. ఇన్నిరావు.. ప్రభుత్వం ఈపార్టీ ఏర్పాటు చేస్తుందనీ.. చేయదని.. రాష్ట్ర వ్యాప్తంగా ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు మాత్రమే వస్తాయని.. రావని.. ఫలానా ఫిగర్‌ దాటుతుందని.. దాటదని.. హంగు ఏర్పాటవుతుందని.. ఏర్పాటు కాదని.. కర్ణాటక లా సీన్‌ ఏర్పాటయితే ఎవరెవరు పార్టీలు మారతారు..? ఇలా రకరకాలుగా ఆఫర్లున్నాయి. సరిహద్దులో హద్దుమీరిన పందేలు జోరుగా సాగుతున్నాయి. కొందరు ఫేస్‌ టూ ఫేస్‌ పందేలు కాసుకుంటుంటే, కొందరు సెల్‌ఫోన్లో సంభాషిస్తూ బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలుస్తోంది.

తక్కువ పందేలు.. 
రెండు తక్కువ, , మూడు తక్కువ, నాలుగు తక్కువ, ఐదు తక్కువ, ఆరు తక్కువ అంటూ కోడిపందేల్లో బిర్రి బయట అరుస్తుంటారు. ఇదే విధంగా ఎన్నికల్లో కూడా తక్కువ పందేలుంటాయి. రెండు తక్కువ అంటే పందెం కాసిన సొమ్మును రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని తగ్గిస్తారు. ఇలాగే ఏ అంకె పక్కన తక్కువ ఉంటే అన్ని భాగాలు చేసి ఒక భాగాన్ని మినహాయించుకుంటారు. ఈ పద్ధతి ప్రకారం ఉదాహరణకు సత్తుపల్లిలో ఎస్‌ అనే అభ్యర్థిపై రెండు తక్కువ పందెం ఎక్కువగా ఆఫర్‌ చేస్తున్నారు. ఎస్‌పై  రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే.. ఆయన గెలిస్తే ఏమీలేదు. ఓడిపోతే రెండు లక్షలకు 5శాతం కమీషన్‌ కట్‌ చేసుకుని తిరిగిస్తారు. ఈతరహా పందేలు పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాలపై నడుస్తున్నాయి. మిగిలినవన్నీ ఫేవరేట్‌.. తరుగు పందాలే నడుస్తున్నట్లు తెలుస్తోంది.  సంభాషణ ఇలా ఉంటుంది  
జూదగాడు.: ఏమండీ.. ఖమ్మం ఫేవరేట్‌ మీద ఓ లక్ష కట్టండి..
ఫంటర్‌(నిర్వాహకుడి ఏజెంట్‌): సరే సార్‌ మీ డిపాజిట్‌లో రూ.లక్ష పోగా ఇంకా నాలుగు లక్షలున్నాయి..
గెలుపోటముల తర్వాత.. 
జూదగాడు: ఏంటి మరి సంగతీ..? 
ఫంటర్‌: మీరు ఐదు పందేలు కట్టారు. రెండు పోయాయి. మూడు గెలిచారు. మూడుకు మూడు.. కమీషన్‌ పోను రెండున్నర లక్షలుంటాయ్‌. ఆడుకుంటారా.. పంపించాలా..? 
జూదగాడు: పంపించండి  
ఫంటర్‌: మావాడు వచ్చి మీకు ఫోన్‌ చేస్తాడు. 
జూదగాడు: సరే ‘ఎమ్‌’ అందింది. రెండున్నర లక్షలు. ఓకే ఇప్పటికి ఇద్దరి మధ్యా ఏమీ బ్యాలెన్స్‌ లేదు.
ఇలా సంభాషణలే లెక్కలు చెప్పేస్తాయి. ఇలాంటి సంభాషణలకు మాత్రమే ప్రత్యేక ఫోన్‌లు, సిమ్‌లు మెమరీ కార్డులు వాడుతారు. ఇదీ ఎన్నికల పందేల తంతు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement