మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు, పక్కన అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు
సాక్షి, అశ్వారావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. మిరపరైతులు గిట్టుబాటు ధర అడిగితే బేడీలు వేసి జైల్లో పెట్టాయని ఆరోపించారు. బుధవారం దమ్మపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అశ్వారావుపేట ప్రజాకూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు మచ్చలేని వ్యక్తి
అని, ఆయన్ను గెలిపించాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని విమర్శిస్తున్నారని, ఆయన కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు అని అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధి అవసరం లేదని, తెలంగాణ ధనిక రాష్ట్ర ఆదాయం కేసీఆర్ కుటుంబానికి తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. తమది పేద రాష్ట్రమైనా అక్కడ, ఇక్కడ పతకాల అమలెలా ఉందో బేరీజు వేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సమస్య కేసీఆర్ మాత్రమేనన్నారు.
రేపు జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ఇక్కడుండే ఎమ్మెల్యే అభ్యర్థిని వేదికపైకి రానీయలేదని, మరి ఆరోజు ఎందుకు సీటిచ్చారని ప్రశ్నించారు. బస్సు ప్రమాదం జరిగినా రాని సీఎం ఎన్నికలు వచ్చేసరికి హెలికాప్టర్‌లో తిరుగుతున్నార ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక్క ఇల్లయినా కట్టారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆదాయం లేకపోయినా 8 5లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. మిషన్ భగీరధలో మీకు పైపులొచ్చాయా.. నీళ్లొచ్చాయా.. రెండూ రాలేదా ప్రశ్నించారు. ఇక్కడ ప్రజాకూటమి గెలిస్తే రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలొస్తాయన్నారు. పేదలకు6 గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పెంపు, రూ.3వేల నిరుద్యోగ భృతి సాధ్యమన్నారు. హైదరాబాదు బంగారు గుడ్డుపెట్టే ప్రాంతమని, సంపద సృష్టించే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.
ఏపీలో పోడు భూములకు పట్టాలిస్తుంటే ఇక్కడ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మీ ఎమ్మెల్యే ఎటు పరుగెడతాడో.. ఎటు వస్తాడో తెలియదని అన్నారు. బీజేపీకి ఓట్లు లేవు కానీ ముగ్గురు ముఖ్యమంత్రులు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గోదావరిలో నీళ్లు ఉపయోగించుకోవడానికి అథారిటీ ఏర్పాటు చేశామన్నారు. 2500టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని.. వీటిని సద్వినియోగం చేసుకుందామంటే సహకరించకుండా నేను అడ్డుపడుతున్నానని అంటున్నారన్నారు. మాటల గారడీలో కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒకటే అన్నారు. కేసీఆర్ జూనియర్ మోదీ అని, ఇద్దరూ నాటకాలాడుతున్నారని అన్నారు. మరోపక్క ఎంఐఎం కూడా వీళ్లకు మద్దతిస్తున్నారన్నారు.
అశ్వారావుపేట కూటమి(టీడీపీ)అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజలకు పాలేరుతనం చేస్తానన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మా ట్లాడుతూ చంద్రబాబును చూసినా.. సమ్మె చేసే కార్మికుడిని చూసినా చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. ఆఖరకు బాత్రూంలోకి వెళ్లాల న్నా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలోకి వెళుతున్నారన్నారు. ఇలా భయపడే ముఖ్యమంత్రి మనకు అవసరమా అన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్నే వీరాంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నారాయణ్ ప్రసాద్ తివారీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment