బెట్టింగ్ బాలరాజులు! కొంపలు కాలిపోతున్నాయి.! | Beware That Betting Can Ruin Lives | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ బాలరాజులు! కొంపలు కాలిపోతున్నాయి.!

Published Fri, Dec 29 2023 12:12 PM | Last Updated on Fri, Dec 29 2023 3:17 PM

Beware That Betting Can Ruin Lives - Sakshi

బెట్టింగ్...  ముఖ్యంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్ ... చాప కింద యాసిడ్‌లా విస్తరించి అనేక   కొంపల్ని ముంచేస్తోంది . బెట్టింగ్ ఒక మానసిక వ్యసనం !  తల్లితండ్రులు " కంచు"  టైపు అయితే పిల్లల్లో బెట్టింగ్ వ్యసనం వచ్చే అవకాశం ఎక్కువ ! " కంచు మొగునట్లు కనకంబు మోగునా ?" అని నానుడి.  కొంత మంది ఎంత  సేపూ  "షో ఆఫ్ " టైపు .  తమ గొప్పలు చెప్పుకోవడం .. చూపుకోవడం వీరి దిన చర్య . కిట్టి పార్టీలు మందు పార్టీలలో ఈ "కంచులు"  గణగణ మోగుతుంటాయి  . 

" ఈ కాలం కూడా ఇంకా మారుతీ సుజుకిలో ఎట్టా ట్రావెల్ చేస్తారో .. ఏంటో .. నేనైతే మినిమం వోల్వో వదినా .. మా అన్నగారయితే లాండ్‌రోవర్ దిగరు" అని  బిల్డప్‌లు ఇస్తూ  బతికేస్తారు. అదొక ఐడెంటిటీ క్రైసిస్. ఆత్మ న్యూనతా భావం.

ఆవు చేలో దూడ గట్టున మేస్తుందా ?  నేను గొప్ప అని అవతలివారికి చాటి చెప్పుకోవాలి అనే ఆలోచన బెట్టింగ్ కు దారి తీస్తుంది. కష్టపడే తత్త్వం లేకపోవడం , ఈజీ గా డబ్బు సంపాదించాలి అనుకోవడం కూడా ఒక కారణం గ్యాంబ్లింగ్ డిసార్డర్ - అనేది తీవ్ర మానసిక రోగం. నేడు ఎంతో మంది దీని బారినపడి సతమమవుతున్నారు .

ఆలోచనలు ఎప్పుడూ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరుగుతుంటాయి. ఎన్నికలు .. క్రికెట్... సినిమా జయాపజయాలు.. కాదోయి ఏది బెట్టింగ్ కు అనర్హం. ఒక్క సారి గెలిస్తే.. "ఇప్పుడు మనకు సుడి తిరిగింది.. స్టార్స్ కలిసి వస్తున్నాయి.. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తే అది ఇప్పుడే.. ఇప్పుడే" అంటూ అందులో  లీనం  అయిపోతారు. 

ఓడితే .. "ఇజ్జాత్ కా సవాల్ .. ప్రెస్టేజ్ క్వొశ్చన్‌.. ఓడిపోయి పోవడమా? గెలిచే దాక ఆడాల్సిందే!"  అంటూ ఆటలో మునిగిపోతారు. అంటే బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ అనేది సుడిగుండం. పద్మ వ్యూహం.. ఒక సారి దిగితే సేఫ్ గా బయటకు రావడం అనేది ఉండదు . ఆలా ఒకటి రెండు సార్లు వచ్చినా ఆది అంతం కాదు .. జస్ట్ బిగినింగ్. జూదంలో గెలవడం వల్ల డోపమైన్ హార్మోన్ వస్తుంది . ఇది మహా కిక్కు ఇస్తుంది.

ముందుగా ఒక  పెగ్గు  మందుతో స్టార్ట్ చేసినవాడికి మూడేళ్లయ్యే సరికి కనీసం క్వార్టర్ దిగనిదే కిక్కు ఎక్కదు. బెట్టింగ్ కూడా అంతే. అమౌంట్ పెంచుకొంటూ పెద్ద పెద్ద బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తేనే మునుపటి కిక్కు వస్తుంది. కాబట్టి చిన్నగా మొదలయిన  వ్యసనం.. ఆస్తులు...  పెళ్ళాం పిల్లల తాకట్టు దాకా దారితీస్తుంది .

"నేనట్టా కాదు లే ... నేను మహా స్మార్ట్. జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నా". అని ప్రతి బెట్టింగ్ బంగారు రాజు అనుకొంటాడు. బెట్టింగ్ డోపమైన్ "హై" అనేది ఒక సైంటిఫిక్ రూల్. అది ఎవడినీ వదలదు అని వాడు అర్థం చేసుకొనేటప్పటికీ అన్ని అయిపోయి కొంపలు కాలిపోయి ఉంటాయి. 

మహాభారతం కాలం నుంచి అన్ని రకాల జూదాలు/ బెట్టింగ్ లు మాయా వ్యవహారాలే. కేసినోకు పొయ్యి సర్వ నాశనం కానోడు .. కేసినో నిర్వహించి కోట్లకు పడగలెత్తని వాడు భూప్రపంచం లో కనపడడు. బెట్టింగ్ బంగారు రాజులను బకరాలను చేయడానికి బెట్టింగ్ మాఫియా .." ఫలానా వాడు మిలియన్స్ సాధించాడు" అని బిల్డ్ అప్ స్టోరీ లు వదులుతుంటుంది.

బకరాలు నమ్మేస్తారు . బెట్టింగ్ వల్ల నిమ్మళంగా ఒక చోట కూర్చోలేని చంచలత్వం వస్తుంది . ఇలాంటి వారు ఏ పనిపై దృష్టి సారించలేరు . బెడ్ రూమ్‌లో కూడా ఇదే ధ్యాసతో వుంటారు .ఉస్సేన్ బోల్ట్ లయి పోతారు, ఆ తర్వాత ఇంకేముంది.. సంసార జీవనంలో చిక్కులే చిక్కులు.

బెట్టింగ్ గాళ్ళు సులభంగా చిరాకు కు గురవుతారు . అసహనం పెరిగిపోతుంది.  బెట్టింగ్ అప్పులకు దారి తీస్తుంది . అప్పులు తీర్చ్చడానికి అదనంగా బెట్టింగ్ చేస్తారు . ఆంటే చిన్న ఊబిలో నుంచి మరీనా ట్రెంచ్ లోతుల్లోకి  వీరి పతనం వేగంగా సాగుతుంది. తమ కుటుంబానికి తమ వ్యసనం గురించి తెలిసిపోకుండా ఉండేందుకు అబద్దాలు చెప్పడం మొదలెడతారు.

బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ జరిగే చోట మందు- విందు- పొందు తప్పని సరి ఆడ్ ఆన్స్. డయాబెటిస్ బిపి కిడ్నీ సమస్యలు ఊబకాయం , ఎయిడ్స్ .. వీరు అదనంగా పొందే కొన్ని బహుమతులు . బెట్టింగ్ వల్ల అప్పుల  ఊబి ఖాయం . ఆత్మహత్యలు ...  కొన్ని సార్లు హత్యలు .. అటుపై చిప్పకూళ్ళు .. బెట్టింగ్ కుటుంబాలను నాశనం  చేస్తుంది . 

25ఏళ్ళ లోపు వారిలో మెదడు ముందుభాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా అభివృద్ధి చెందివుండదు . దీనితో వీరు భావోద్వేగాలను తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగివుండరు . వీరి  చేతిలో సెల్ ఫోన్ . నేడు నీలి చిత్రాలు , హింసాత్మక వీడియో గేమ్స్ కన్నా కుటుంబాలను నాశనం  చేస్తోంది  ఆన్‌లైన్‌ బెట్టింగ్.

చేతిలో సెల్ ఫోన్ ఏదో చేసుకొంటున్నాడు అని తల్లితండ్రులు అనుకొనే లోపే బెట్టింగ్ మాఫియా లు వచ్చి " మీ వాడు ఇరవై లక్షలు అప్పుపడ్డాడు . ఇస్తారా చస్తారా?  అంటూ బెదిరించి ఆస్తులు మానప్రాణాలు తీసిన ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి.

మీ ఇంటిలో కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. బెట్టింగ్ మాఫియా కాళ్లావేళ్లా పడ్డా కనికరించదు. దయనీయమయిన స్థితిలో జీవితాన్ని చాలించాల్సి వస్తుంది. సిగరెట్ తాగితే ఇరవై ఏళ్లకు ప్రాణం మీదకు వస్తుంది. మందు తాగితే 15 ఏళ్లకు. గంజాయి కొడితే ఐదేళ్లకు. ఆన్‌లైన్‌ బెట్టింగ్ చేస్తే కేవలం ఆరునెలలకు.. చస్తారు. మిగతా వాటిలో తాగిన వాడొక్కడి ప్రాణం. కానీ ఆన్‌లైన్‌ బెట్టింగ్ లో ఇంటిల్లి పాదీ.. కట్టకట్టుకుని..  తస్మాత్ జాగ్రత్త . పిల్లల్ని సెల్ ఫోన్ కు దూరంగా ఉంచండి . 'ఈజీ మనీ పాములాంటిది అని చెప్పండి . కష్టపడే తత్వాన్ని నేర్పండి.

 
వాసిరెడ్డి అమర్‌నాథ్‌, ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement