లోకల్‌సర్కిల్స్ సర్వేలో మెజారిటీ తల్లిదండ్రులు వెల్లడి
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధించాలని అభిప్రాయం
న్యూఢిల్లీ: పిల్లలు సహా అన్ని వర్గాలకు అనువైనదిగా మార్క్ చేసిన కంటెంట్‌లో తరచుగా అసభ్య ప్రకటనలు వస్తున్నాయని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ సర్వే నివేదికలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది తల్లిదండ్రులు ఈ విషయం తెలిపారు. గత మూడేళ్లుగా గ్యాంబ్లింగ్/గేమింగ్, లోదుస్తులు, సెక్సువల్ వెల్‌నెస్‌కి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వివరించారు.
పిల్లలకు అనువైనదిగా పేర్కొన్న కంటెంట్‌లో గ్యాంబ్లింగ్/గేమింగ్ (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) సంబంధ ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని 41 శాతం మంది తెలిపారు. లోదుస్తుల ప్రకటనలు తరచుగా ఉంటున్నాయని 35 శాతం మంది, సెక్సువల్ వెల్‌నెస్ యాడ్స్ ఉంటున్నాయని 29 శాతం మంది, మద్యం .. పొగాకు సంబంధ ప్రకటనలు ఉంటున్నాయని 24 శాతం మంది పేర్కొన్నారు.
వయస్సుకు తగని ప్రకటనలు ప్రసారం చేస్తే నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించాలని 88 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల డివైజ్‌నే ఉపయోగిస్తారు కాబట్టి .. డివైజ్ ఓనర్ ప్రొఫైల్‌ను బట్టి కాకుండా లైవ్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ ప్రకారం ప్రకటనలు ఉండేలా ఆయా ప్లాట్‌ఫాంలు, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. 10,698 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వివిధ ప్రశ్నలకు దేశవ్యాప్తంగా 305 జిల్లాల నుంచి 30,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment