అక్రమాల అడ్డా.. నడిగడ్డ! | Illegal Activities Going On Mahabubnagar | Sakshi
Sakshi News home page

అక్రమాల అడ్డా.. నడిగడ్డ!

Published Thu, Jul 4 2019 7:29 AM | Last Updated on Thu, Jul 4 2019 7:29 AM

Illegal Activities Going On Mahabubnagar - Sakshi

పోలీసుల అదుపులో బెట్టింగ్‌ నిర్వాహకులు (ఫైల్‌)

సాక్షి, గద్వాల క్రైం: అక్రమార్కుల ధాటికి జోగుళాంబ గద్వాల జిల్లాలోని విలువైన సంపద లూఠీ అవుతోంది. అమాయక ప్రజలను గారడీ మాటలతో మోసం చేసి మల్టీలెవల్‌ స్కీంల పేరిట రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఉన్నత విద్యకు తక్కువ ఫీజంటూ చెప్పి రూ.లక్షలు దండుకున్నారు. ఆరుగాలం శ్రమించే రైతన్నలకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మి సొమ్ము చేసుకున్న ముఠాలు, రూ.100కు రూ.10 వడ్డీ వసూలు చేసే జలగలు, అనుమతుల పేరిట, అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు, ఇసుక, మట్టి తవ్వకాలు.. ప్రభుత్వ, దేవాదాయ, ఇనాం భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కబ్జాలు.. గుట్కా, మట్కా, గంజాయి, సారా, కల్తీ కల్లు విక్రయాలు, యువతను పెడదోవ పట్టించే బెట్టింగ్, పేదల బియ్యం పక్కదారితోపాటు పలు చీకటి దందాలకు నడిగడ్డ అడ్డాగా మారింది.

ఇక కేసుల పరిష్కారం కోసం బాధితులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకు కొత్తగా వచ్చే ఎస్పీపైనే ప్రజలు కోటి ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో నడిగడ్డ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, చీకటి వ్యాపారాలపై ప్రత్యేక కథనం.. 

పాత కేసుల పురోగతి సాధ్యమేనా? 
2018లో నకిలీ పాస్‌ పుస్తకాల విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుమారు 10 వేల నకిలీ పాస్‌ పుస్తకాలు బయటపడ్డాయి. ఈ కేసులు ఇందులో దళారీ నుంచి రాజకీయ నాయకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపారులు సైతం చిక్కి జైలు జీవితం గడిపారు. ఇక కేసు అనుకున్న స్థాయిలో విచారణ జరగకపోవడం, కీలక సూత్రదారులు బయటకు రాకపోవడంతో మిస్టరీగా మిగిలింది. 

నకిలీ విత్తనాలు 
జిల్లాలో సీడ్‌ కాటన్‌ (పత్తి) పంటలను రైతులు ఎక్కువ శాతం పండించడం, విత్తన తయారీకి జాతీయ స్థాయిలో గద్వాలకు పేరు ఉంది. అయితే ఇక్కడే జాదుగాళ్లు నకిలీ విత్తనాలకు తెరలేపారు. ఫలితంగా సీడ్‌పత్తి పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోగా.. పలువురు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారు. వ్యవసాయాధికారులు పరిశీలించి నకిలీ విత్తనాలను నాటడంతోనే పంట దిగుబడి రాలేదని ధ్రువీకరించారు. ఈ విషయమై అప్పటి కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్‌ ప్రత్యేకంగా దృష్టిసారించడంతో జిల్లా యంత్రాగం ఒక్కసారిగా నకిలీ విత్తనాల ముఠా సభ్యుల స్థావరాలపై దాడులు చేసి నకిలీ పత్తి విత్తనాల కేసులను వెలుగులోకి తెచ్చారు. ఈ విత్తనాల తయారీలో పలు బడా కంపెనీలు, సీడ్‌పత్తి వ్యాపారులు, దళారులను అదుపులోకి తీసుకుని వేలాది క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. ఈ సీడ్‌పత్తి విత్తనాలతోపాటు మిర్చి, ఇతరత్రా కంపెనీలపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే వివిధ కారణాలతో ఈ కేసుల విషయంలో కూడా ఎలాంటి పురోగతి కనిపించలేదు.

వడ్డీ జలగలు.. 
అవసరాలకు అప్పులు చేసేందుకు సామాన్యులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే వారిని నిలువునా ముంచుతున్నారు. రూ.100కు రూ.10 వడ్డీ వసూలు చేయడం గమనార్హం. అప్పు తీసుకుని సకాలంలో వడ్డీలు చెల్లించలేక ఉన్న కొందరు ఆస్తులను తాకట్టు పెట్టి నేటికీ సతమతమవుతున్నారు. 2017లో అప్పటి ఎస్పీ వద్దకు బాధితులు ఫిర్యాదు చేయడంతో జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు. ఇచ్చిన అప్పులకు కట్టిన వడ్డీలను అంచనా వేయగా రూ.కోట్లలో తేలింది. ఈ విషయమై ప్రముఖ వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసుల్లో కూడా తీవ్ర జాప్యం జరిగిందన్న విమర్శలున్నాయి.

విలువైన సంపద ఖాళీ
జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల పరిసర ప్రాంతాల నుంచి జాతీయ సంపదైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ వనరులను కాపాల్సిన ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు సంఘాల నాయకులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీస్‌శాఖ ప్రత్యేక సిబ్బందితో ఇసుక వ్యాపారానికి కాస్త చెక్‌ పెట్టారు.

ఈ దందాలో పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటడంతో నామమాత్రపు చర్యలు తప్ప కఠిన చర్యలు లేవని ప్రజలు ఆరోపణ. అలాగే మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జిల్లాలో జరుగుతున్నాయి. అక్రమార్కుల ధాటికి గుట్టలు సైతం ఖాళీ అవుతున్నాయి. ఇక అక్రమ దందాను నిలువరించేందుకు రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక పీడీఎస్‌ బియ్యం సైతం పక్కదారి పడుతుంది. 

నిషేధిత మత్తు పదార్థాలు 
నిషేధిత మత్తు పదార్ధాల దందా సైతం జిల్లాలో జోరుగా సాగుతుంది. గంజాయి సాగు కూడా గుట్టుగా సాగిస్తున్నారు. ముఖ్యంగా అయిజ, గద్వాల, నదితీర ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి పలు రాష్ట్రాలకు కూడ ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. కల్తీ కల్లు, సారా, మద్యం కూడా జిల్లాలో జోరుగా నడుస్తుంది. ఇక రాయిచూర్‌ నుంచి గద్వాల మీదుగా ప్రతిరోజు గుట్కాను అక్రమంగా తరలిస్తున్నారు. 

తెరపైకి పలువురి పేర్లు 
జిల్లా ఎస్పీ ఎవరనే విషయంపై ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా సింధుశర్మ, మల్లారెడ్డి, శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నారాయణపేట, వనపర్తి ఎస్పీల పేర్లు సైతం ప్రచారంలోకి వచ్చాయి. గత నెల 30న పదవీ రమణ పొందిన లక్ష్మీనాయక్‌ స్థానంలో అదే రోజే వనపర్తి ఎస్పీ అపూర్వారావుకు ఇన్‌చార్జ్‌ ఎస్పీగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. 

జిల్లా ఏర్పాటు తర్వాత.. 
జోగుళాంబ   గద్వాల జిల్లాగా ఏర్పాటు నుంచి పలు  చికటీ కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కుమార్‌ అక్రమార్కుల దందాలపై తనదైన ముద్ర వేసి చాలా వరకు అడ్డుకట్ట వేశారు. ఇక 2018 మార్చి నెలలో ఎస్పీ విజయ్‌కుమార్‌ బదిలీ పై వెళ్లారు. అప్పటి నుంచి జిల్లాలో పలు దందాలు  మళ్లీ   తెరపైకి  వచ్చాయి.ఈ  క్రమంలోనే గత నెల 30న జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్‌ పదవీ విరమణ పొందడంతో జిల్లా బాస్‌ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎస్పీపైనే ఈ బాధ్యతలన్నీ పడనున్నాయి

చర్యలు తీసుకుంటాం
అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను దోచుకునే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. గతంలో నమోదైన కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులను తయారు చేసి విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపుతాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. 
– అపూర్వరావు, ఇన్‌చార్జ్‌ ఎస్పీ, జోగుళాంబ గద్వాల     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement