ఆపరేషన్ ‘బెట్టింగ్’! | Betting mafia is restricted | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ ‘బెట్టింగ్’!

Published Tue, Apr 5 2016 4:14 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

ఆపరేషన్ ‘బెట్టింగ్’! - Sakshi

ఆపరేషన్ ‘బెట్టింగ్’!

అజ్ఞాతంలోకి బుకీలు
►  టీడీపీ నేతల హస్తం

 
నెల్లూరు(క్రైమ్): క్రికెటర్లు ఫీల్డ్‌లో పరుగులు తీస్తుంటే బయట పందాలు కాస్తూ జల్సాలు చేసిన బుకీలు, పంటర్లు, బెట్టింగ్ మాఫియా ప్రస్తుతం ఎవ్వరికి కనపడకుండా  పరుగులు తీస్తున్నారు. కొంప, గోడు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వారికి దాపురించింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్ క్రికెట్ పోటీలు ప్రారంభం నుంచే జిల్లా లో  బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు  కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఈనెల తొమ్మిది నుంచి ఐపీఎల్-9 ప్రారంభం కానుంది. 50 రోజుల పాటు క్రికెట్ పోటీలు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో సామాన్య, ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలను గుల్లచేస్తున్న బెట్టింగ్‌ను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ చర్యలు చేపట్టారు.

ఆపరేషన్ బెట్టింగ్ పేరిట బుకీల భరతం పట్టేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఎవరినీ ఉపేక్షించవద్దని హుకుం జారీచేశారు. ఆదేశాలు అందిందే తడువుగా స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ విక్రమ్‌శ్రీనివాస్ నేతృత్వంలో సిబ్బంది బుకీల ఎరివేతకు చర్యలు చేపట్టారు. ఆదివారం పొదలకూరుకు చెందిన శ్యామ్‌ప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని నెల్లూరుకు తరలించి తమదైన శైలిలో విచారించినట్లు తెలిసింది. ఆయన వద్ద నుంచి పలువురు బుకీల ఫోన్ నెంబర్లు వివరాలు సేకరించారు. వారి గురించి గుట్టుగా ఆరా తీస్తున్నారు.


 అజ్ఞాతంలోకి బుకీలు:
పోలీసు బాస్ చర్యలతో బుకీ ల వెన్నులో వణుకు మొదలైంది. సుమారు రెండేళ్లపాటు చక్రం తిప్పిన బుకీలు ఒక్కొక్కరిగా అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన బి.వి రమణకుమార్, సెంథిల్‌కుమార్‌లు క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో బెట్టింగ్‌కు బ్రేక్‌పడింది. ఆ తర్వాత ఎస్పీలు పెద్దగా దీనిపై దృష్టిసారించలేదు. దీంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. జిల్లా ఎస్పీగా విశాల్‌గున్నీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి క్రికెట్ బెట్టింగ్‌పై పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆపరేషన్ బెట్టింగ్ పేరుతో బుకీల భరతం పట్టేందుకు చర్యలు చేపట్టారు.  


 పలువురు రాజకీయనాయకులు:
 క్రికెట్ బెట్టింగ్‌లో పలువురు రాజకీయ నేతలు హస్తం ఉన్నట్లు సమాచారం. ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొన్న శ్యాంప్రసాద్‌ను, అతని సహచరుడైన టీడీపీ చోటా నేతను 2013మే 23వ తేదీన  రెండో నగర పోలీసులు అరెస్ట్‌చేశారు. నాడు పోలీసులకు పట్టుబడ్డ నేత నేడు బడానేతగా మారాడు. నేటికి వారిద్దరూ సన్నిహితంగా గడుపుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారపార్టీకి చెందిన మరోనేత సైతం ఇదే తరహాలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో మాగంట లేఅవుట్‌లో పట్టుబడ్డ ఓ బుకీ సైతం ప్రస్తుతం తన కార్యకలాపాలను విసృ్తతం చేశాడన్న విమర్శలున్నాయి. హరనాధపురానికి చెందిన ఇద్దరు బుకీలు కార్యకలాపాలు సాగిస్తున్నారు.


 ఎస్పీ చర్యలు అభినందనీయం:
 క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ఎస్పీ విశాల్‌గున్నీ తీసుకొంటున్న చర్యలకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. బెట్టింగ్ మాఫియా సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement