యు ముంబా జోరు
దబాంగ్ ఢిల్లీపై విజయం
ప్రొ కబడ్డీ లీగ్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో యు ముంబా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన ఉత్కంఠ పోరులో 27-25 స్వల్ప తేడాతో యు ముంబా నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఢిల్లీ 14-12తో కాస్త పైచేయిలోనే ఉంది. అయితే ద్వితీయార్ధంలో ముంబా తమ వ్యూహాలను మార్చుకుని సత్తా చాటింది.
28వ నిమిషం వరకు 15-16తో వెనుకబడి ఉన్నా ఆ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచింది. ఈ సమయంలో రిషాంక్ దేవడిగ (8 రైడింగ్ పాయింట్లు) సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు తేవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ముంబా వైపు తిరిగింది. ఢిల్లీ నుంచి కెప్టెన్ కశిలింగ్ అడికే 6, సెల్వమణి 5 రైడింగ్ పాయింట్లు సాధించారు. దీపక్ నర్వాల్ తన 11 రైడింగ్ ప్రయత్నాల్లో ఒక్క పాయింట్ మాత్రమే తేవడం జట్టు ఫలితాన్ని ప్రభావితం చేసింది.
జైపూర్‌దే విజయం: నువ్వా.. నేనా అనే రీతిలో సాగిన మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 36-33 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిక్యం ఇరు జట్ల మధ్య మారుతూ వచ్చింది. అయితే కెప్టెన్ జస్వీర్ సింగ్ మరోసారి సూపర్ ఆటతో 13 రైడింగ్ పాయింట్లు సాధించి జట్టును గెలిపించాడు. బెంగాల్ నుంచి నితిన్ మదానే, మోను గోయట్ ఎనిమిదేసి పాయింట్లు సాధించారు.
ప్రొ కబడ్డీలో నేడు
దబాంగ్ ఢిల్లీ కేసీ గీ బెంగళూరు బుల్స్
రాత్రి 8 గంటల నుంచి
జైపూర్ పింక్ పాంథర్స్ గీ పుణెరి పల్టాన్
రాత్రి 9 గంటల నుంచి