42-40తో తలైవాస్‌పై పైరేట్స్ ఉత్కంఠ విజయం
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్
హైదరాబాద్, పట్నా పైరేట్స్ స్టార్ రెయిడర్ దేవాంక్ కండ్లుచెదిరే కూతతో రికార్డులు తిరగరాశాడు. కూతకెళ్లి ఏకంగా 25 పాయింట్లు సాధించిన దేవాంక్ ఒంటిచేత్తో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌కు ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో తొలి విజయం అందించాడు. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై పట్నా పైరేట్స్ 42-40తో ఉత్కంఠ విజయం సాధించింది.
మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిక్యంలో కొనాసాగిన తమిళ్ తలైవాస్ హ్యాట్రిక్ విజయం దిశగా సాగింది. కానీ కీలక సమయంలో తలైవాస్‌ను ఆలౌట్ చేసిన దేవాంక్.. పట్నా పైరేట్స్‌ను గెలుపు పట్టాలెక్కించాడు. పట్నా పైరేట్స్ తరఫున ఆల్‌రౌండర్ అనికెత్ (4 పాయింట్లు), గుర్దీప్ (2 పాయింట్లు), సందీప్ (2 పాయింట్లు) మెరిశారు. తమిళ్ తలైవాస్ రెయిడర్ నరేందర్ ఖండోలా (15 పాయింట్లు), సచిన్ (6 పాయింట్లు) సహా డిఫెండర్ నితేశ్ (4 పాయింట్లు) మెరిసినా.. ఆ జట్టుకు సీజన్లో తొలి పరాజయం తప్పలేదు.
తలైవాస్ జోరు
తమిళ్ తలైవాస్ వరుసగా మూడో మ్యాచ్‌లో జోరు చూపించింది. తలైవాస్, పట్నా పైరేట్స్ తొలి రెయిడ్‌లోనే పాయింట్ల ఖాతా తెరిచినా.. ఆ తర్వాత తలైవాస్ జొరందుకుంది. తలైవాస్ రెయిడర్లకు డిఫెండర్లు సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్‌కు చిక్కులు తప్పలేదు. తొలి 20 నిమిషాల ఆట అనంతరం తమిళ్ తలైవాస్ 5 పాయింట్ల ఆధిక్యం సాధించింది. నరేందర్ సూపర్ టెన్‌తో కూతలో చెలరేగగా.. డిఫెండర్ నితేశ్ నాలుగు ట్యాకిల్స్‌తో మెరిశాడు. దీంతో తలైవాస్ 23-18లో పట్నా పైరేట్స్‌పై పైచేయి సాధించింది. పైరేట్స్ తరఫున దేవాంక్ 11 రెయిడ్ పాయింట్లతో మెరిసినా.. డిఫెన్స్‌లో పైరేట్స్ తేలిపోయింది. కూతలో తలైవాస్ కంటే మెరుగ్గా రాణించినా.. ట్యాకిల్స్‌లో వెనుకంజ వేయటంతో ఆధిక్యం కోల్పోవాల్సి వచ్చింది.
పుంజుకున్న పైరేట్స్
ద్వితీయార్థంలోనూ తమిళ్ తలైవాస్ ఆధిక్యం కొనసాగించింది. కానీ ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మ్యాచ్ మలుపు తిరిగింది. కండ్లుచెదిరే కూతతో ఒంటరి పోరాటం చేసిన పైరేట్స్ రెయిడర్ దేవాంక్ 34వ నిమిషంలో సూపర్ రెయిడ్‌తో చెలరేగాడు. తలైవాస్ మ్యాట్‌పై నలుగురు ఆటగాళ్లను అవుట్ చేయటంతో పాటు ఆ జట్టును ఆలౌట్ చేశాడు. దీంతో నాలుగు పాయింట్ల వెనుకంజ నుంచి పైరేట్స్ ఏకంగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు ఐదు నిమిషాల్లో ఆధిక్యం నిలుపుకున్న పైరేట్స్ సీజన్లో తొలి విజయం సాధించింది. మ్యాచ్‌లో మెజార్టీ భాగం ఆధిక్యంలో నిలిచిన తలైవాస్ ఒక్క ఆలౌట్‌తో కుదేలైంది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో మూడు మ్యాచుల్లో తలైవాస్‌కు ఇది తొలి పరాజయం.
Comments
Please login to add a commentAdd a comment