ప్రో కబడ్డీ లీగ్: ఇక ఐదో సీజన్ పండగే
ముంబై: భారత దేశ సంప్రదాయక గ్రామీణ క్రీడ కబడ్డీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. గ్రామలకే పరిమితమైన ఈ ఆట ప్రో కబడ్డీ లీగ్ పేరుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గత నాలుగు సీజన్లతో ప్రో కబడ్డీ లీగ్ కబడ్డీ అభిమానులను అలరించింది. ఈ ఎడాది జులైలో ఐదో సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ లీగ్‌లో 8 జట్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో నాలుగు జట్లు కొత్తగా చేరుతున్నాయి. ఈ విషయాన్ని పీకేఎల్ అధికారులు బుధవారం మీడియాకు తెలిపారు.
కొత్తగా తమిళనాడు, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలనుంచి నాలుగు జట్లు ఐదో సీజన్‌లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే ఉన్న జట్లు బెంగళూరు, హైదరాబాద్, పుణే, ఢిల్లీ, కొల్‌కత, జైపూర్, పట్నా నగరాల పేర్లతో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రోకబడ్డీ లీగ్‌లో కొత్తగా నాలుగు జట్లు చేరడంతో ఐదో సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మరో 11 రాష్ట్రాలకు ఈ లీగ్ విస్తరించనుందని, సుమారు 130 పైగా మ్యాచ్‌లు జరుగుతాయని లీగ్ అధికారులు పేర్కొన్నారు. కబడ్డీలీగ్‌ను మరింత విస్తరించాలని వాటాదారులంతా నిర్ణయించుకున్నట్లు స్టార్ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ తెలిపారు. సంప్రదాయ క్రీడలను ఆధునిక లీగ్‌ల పేర్లతో ఆదరణ కల్పించవచ్చనేదానికి ప్రో కబడ్డీ లీగ్ ఒక మంచి ఉదాహారణ అని అంతార్జాతీయ కబడ్డీ సంఘం అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గెహ్లాట్ అభిప్రాయపడ్డాడు.