హర్యానాదే ఆల్‌రౌండ్‌ షో | Pro Kabaddi League 2024 November 7th Highlights: Haryana Steelers Win Over Gujarat Giants With 35-22 | Sakshi
Sakshi News home page

Pro Kabaddi League 2024: హర్యానాదే ఆల్‌రౌండ్‌ షో

Published Thu, Nov 7 2024 10:49 PM | Last Updated on Fri, Nov 8 2024 12:58 PM

Pro Kabaddi League Season 11: Haryana Steelers Win Over Gujarat Giants

గుజరాత్‌పై ఘన విజయం

అదరగొట్టిన వినయ్‌, రెజా

హైదరాబాద్‌, నవంబర్‌ 7: ప్రో కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో మ్యాచ్‌లను రసవత్తరంగా సాగుతున్నాయి. పాయింట్‌ పాయింట్‌కు ప్లేయర్లు కసికొద్ది తలపడుతున్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌ 35-22తో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన హర్యానా తరఫున వినయ్‌(9), మహమ్మద్‌ రెజా(6),సంజయ్‌(4) అదరగొట్టారు. వినయ్‌ రైడింగ్‌లో విజృంభిస్తే..రెజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరోవైపు గుమన్‌సింగ్‌(11) ఒంటరిపోరాటం గుజరాత్‌ను గెలిపించలేకపోయింది. ఈ విజయంతో హర్యానా 21 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా, గుజరాత్‌ జెయింట్స్‌(7) ఆఖరి స్థానానికి పరిమితమైంది.

స్టీలర్స్‌ జోరు.. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఓటములతో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హర్యానా స్టీలర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. లీగ్‌లో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితుల మధ్య బరిలోకి దిగిన రెండు జట్లు అద్భుతంగా పోరాడుతున్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన గుజరాత్‌పై హర్యానా ఒకింత ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌ 19వ నిమిషంలో రోహిత్‌, నీరజ్‌, బాలాజీని ఔట్‌ చేయడం ద్వారా హర్యానాకు వినయ్‌ ఒకే రైడ్‌లో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు.

ఓవైపు హర్యానాకు వినయ్‌ వరుస రైడ్లలో పాయింట్లు తీసుకొస్తే..మరోవైపు గుజరాత్‌ తరఫున గుమన్‌సింగ్‌ పాయింట్లు అందించాడు. అయితే 16వ నిమిషంలో రైడ్‌కు వెళ్లిన వినయ్‌ను గుమన్‌సింగ్‌ సూపర్‌ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు. ఈ క్రమంలో మరింత పట్టు బిగించిన స్టీలర్స్‌ వరుస రైడ్లతో గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. డూ ఆర్‌ డై రైడ్‌కు వచ్చిన నీరజ్‌కుమార్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి నిమిషంలో రైడ్‌కు వచ్చిన నవీన్‌..జితేందర్‌యాదవ్‌ను ఔట్‌ చేయడంతో 10వ నిమిషంలో గుజరాత్‌ ఆలౌటైంది. స్టీలర్స్‌ పక్కా వ్యూహాంతో గుజరాత్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ తొలి అర్ధభాగం ముగిసే సరికి 18-13తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.

అదే దూకుడు: తొలి అర్ధభాగంలో హర్యానాకు వినయ్‌, జయ పాయింట్ల వేటలో కీలకంగా వ్యవహరించగా, గుమన్‌సింగ్‌..గుజరాత్‌కు ఆయువుపట్టుగా నిలిచాడు. తొలిరైడ్‌కు వెళ్లిన గుమన్‌సింగ్‌..నవీన్‌ను ఔట్‌ చేసి జట్టులో జోష్‌ నింపే ప్రయత్నం చేశాడు. ఓవైపు వినయ్‌ తనదైన దూకుడు కొనసాగిస్తే..అతనికి మహమ్మద్‌ రెజా జతకలిశాడు. వరుస రైడ్లలో పాయింట్లకు తోడు డిఫెన్స్‌లోనూ చెలరేగిన రెజా స్టీలర్స్‌కు కీలక పాయింట్లు అందించాడు. గుమన్‌సింగ్‌ ఒంటరి పోరాటం గుజరాత్‌ను ఒడ్డున పడేయలేకపోయింది. దీంతో మరో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement