ఆరంభం ఉత్కం‘టై’
♦ హైదరాబాద్‌లో అదిరిపోయిన ప్రొ కబడ్డీ ఆరంభం
♦ తెలుగు టైటాన్స్, పింక్ పాంథర్స్ మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్ : తారళ తళుకులు... మిరుమిట్లు గొలిపే కాంతులు... నరాలు తెగే ఉత్కంఠతో ఆట... వెరసి హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ లీగ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. అయితే గెలుపు అవకాశాన్ని ఆతిథ్య టైటాన్స్ జట్టు చేజార్చుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌ను 39-39తో డ్రాగా ముగించింది. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి. మరో మ్యాచ్‌లో యు ముంబా 29-25 పాయింట్ల స్కోరుతో ఢిల్లీ దబాంగ్స్‌ను చిత్తు చేసింది.
తొలి అర్ధభాగంలో టైటాన్స్ జోరు
పింక్ పాంథర్స్‌తో మ్యాచ్‌లో తొలి అర్ధభాగం తెలుగు జట్టు అద్భుతంగా ఆడి ఆకట్టుకుంది. దీపక్ తొలి పాయింట్ అందించగా... సుకేశ్ హెగ్డే సూపర్ రైడ్‌తో ఒకేసారి మూడు పాయింట్లు తెచ్చాడు. ఇదే జోరులో జైపూర్‌ను ఆలౌట్ చేసి 10-2 ఆధిక్యంలోకి వెళ్లారు. మరోవైపు పాంథర్స్ ఆటగాడు రాజేశ్ నర్వాల్ వరుసగా రైడింగ్ పాయింట్లు తెస్తూ ఆ జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. తొలి అర్ధభాగంలో తెలుగు జట్టు 20-12తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.
ద్వితీయార్ధంలో కోలుకున్న జైపూర్: మ్యాచ్ ద్వితీయార్ధంతో పాంథర్స్ ఆటగాడు సోనూ నర్వాల్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా పాయింట్లు కొల్లగొట్టాడు. వరుసగా ఆరు రైడ్‌లలో అతను ఆరు పాయింట్లు సాధించడం విశేషం. డిఫెన్స్‌లో కూడా ఆ జట్టు అద్భుతంగా ఆడటంతో ఒక్కసారిగా పాయింట్ల తేడా తగ్గుతూ వచ్చింది. మరో 10 నిమిషాలు మ్యాచ్ మిగిలి ఉన్న దశలో టైటాన్స్ 29-21తో ఆధిక్యంలో ఉంది. అయితే ఆ తర్వాత జైపూర్ ఏకంగా 18 పాయింట్లు కొల్లగొట్టింది. ప్రత్యర్థిని ఆలౌట్ చేసి పాంథర్స్ దూకుడు ప్రదర్శించింది. 35వ నిమిషంలో స్కోరు సమం చేసిన జైపూర్... ఆ వెంటనే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ క్రమంలో టైటాన్స్ రెండో సారి ఆలౌట్ అయింది. 37-39తో వెనుకబడిన దశలో రాహుల్ వరుసగా రెండు రైడింగ్ పాయింట్లు సాధించి జట్టును రక్షించాడు. చివరి నిమిషంలో రైడ్‌కు వెళ్లిన జైపూర్ ఆటగాడు జస్వీర్ ప్రత్యర్థి ఆటగాడిని తాకినట్లుగా గట్టిగా వాదించినా అంపైర్లు ఆ పాయింట్లు తిరస్కరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తెలుగు టైటాన్స్ జట్టులో రాహుల్ చౌదరి 14, సుకేశ్ హెగ్డే 9 పాయింట్లు స్కోర్ చేయగా...జైపూర్ తరఫున సోనూ నర్వాల్ 13, రాజేశ్ నర్వాల్ 7 పాయింట్లు సాధించారు.
అర్జున్ జాతీయ గీతాలాపన
ప్రొ కబడ్డీ లీగ్‌లో మ్యాచ్‌లు ఏ నగరంలో జరిగినా ప్రతి రోజూ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. హైదరాబాద్‌లో తొలి రోజు సినీ హీరో, తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్య క్రమంలో సినీ నటుడు శ్రీకాంత్, తెలుగు టైటా న్స్ యజమాని శ్రీనివాస్, జాతీయ కబడ్డీ సం ఘం అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గెహ్లోట్ పాల్గొ న్నారు. పలువురు సెలబ్రిటీలు, భారీ సంఖ్యలో అభి మానులు మ్యాచ్ చూడటానికి వచ్చారు.
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
తెలుగు టైటాన్స్ ఁ బెంగాల్ వారియర్స్
రా. గం. 8.00 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం