
తెలుగు టైటాన్స్ ఓటమి
సాక్షి, కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–42 తేడాతో ఓడింది. ప్రారంభం నుంచే టైటాన్స్ వెనకబడిపోయి ఏ దశలోనూ ప్రత్యర్థిని అధిగమించలేకపోయింది. మ్యాచ్ ప్రారంభమైన 10 నిమిషాల వరకు టైటాన్స్ జట్టు ఖాతా తెరవకపోవడం గమనార్హం. అప్పటికి పుణేరి పల్టన్ 18 పాయింట్లతో ముందంజలో ఉంది. దీంతో ప్రథమార్ధం ముగిసేసరికి పుణేరి జట్టు 26–12తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది.
చివరి పది నిమిషాల్లో టైటాన్స్ జట్టు ఓ మాదిరి పోరాటం కనబర్చడంతో ఓటమి వ్యత్యాసాన్ని కాస్త తగ్గించుకోగలిగింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 9 రైడింగ్ పాయింట్లు సాధించగా... పుణేరి నుంచి దీపక్ హుడా కూడా 9 పాయింట్లతో నిలిచాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 31–31తో టైగా ముగిసింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్; గుజరాత్ సూపర్ జెయింట్స్‌తో యూపీ యోధ తలపడతాయి.