'వారికి ప్రొ కబడ్డీ ఆహ్వానం లేదు'
కరాచీ: ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఊతమిచ్చినంత కాలం ఆ దేశంతో క్రీడా సంబంధాలు ఉండవని భారత క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ మరొకసారి స్పష్టం చేశారు. వచ్చే నెల్లో భారత్ లో ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ఆటగాళ్లను ఎంపిక చేసిన క్రమంలో వారికి ఎటువంటి ఆహ్వానం లేదని కుండబద్దలు కొట్టారు.
' ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ దాన్ని ఆపేంత వరకూ వారితో క్రీడా సంబంధాలు సాగించే ప్రసక్తే లేదు. దానిలో భాగంగానే జూన్ 25 నుంచి ఆరంభమయ్యే ప్రొ కబడ్డీకి సైతం పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎటువంటి ఆహ్వానం లేదు. ఒకవేళ ఎంపిక చేసిన పాక్ ఆటగాళ్లు ఇక్కడకు వచ్చినా ఆడే అవకాశం ఉండదు. పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రొ కబడ్డీ లీగ్ లో ఆడాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ తో క్రీడా సంబంధాలు సాధ్యం కావు'అని గోయల్ తెలిపారు.