
తెలుగు టైటాన్స్ జోరు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్‌లో తెలుగు టైటాన్స్ మరో ప్రత్యర్థిని మట్టికరిపించింది. గురువారం పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు 34-22 తేడాతో సునాయాసంగా నెగ్గింది. దీంతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్‌లో టైటాన్స్ నాలుగు సార్లు పట్నాను ఆలౌట్ చేయగా... సుకేశ్ హెగ్డే, ప్రశాంత్ రాయ్‌లు అద్భుతంగా ఆడి చెరో 8 రైడింగ్ పాయింట్లు సాధించారు. ప్రథమార్ధంలో పట్నా ఆటగాళ్లు టైటాన్స్‌కు గట్టిపోటీనే ఇచ్చారు. ఫలితంగా 13-12తో తెలుగు జట్టు స్వల్ప ఆధిక్యంతో ముగించింది. ద్వితీయార్ధంలో ఒక్కసారిగా పుంజుకున్న టైటాన్స్ ఏ దశలోనూ పట్నాను కోలుకోనీయలేదు.
30-18తో స్పష్టమైన ఆధిక్యం సాధించి... చివర్లో చకచకా పాయింట్లు సాధిస్తూ ఘన విజయం సాధించింది. ప్రశాంత్ రాయ్‌కు బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్, సందీప్‌కు బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు లభించాయి.