ముగిసిన వేలం ప్రక్రియ
రెండో రోజు అత్యధికంగా అజిత్‌కు రూ.66 లక్షలు
ముంబై: రెండు రోజుల పాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంపాట ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోగా... తొలిరోజు రూ.2 కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడని ఫ్రాంచైజీలు రెండో రోజు మాత్రం పెద్దగా ఎగబడలేదు. శుక్రవారం ‘సి’, ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించగా ఏ ఒక్కరు రూ. కోటి దాకా వెళ్లలేకపోయారు. రెయిడర్ అజిత్ కుమార్‌కు అత్యధికంగా రూ. 66 లక్షలు దక్కాయి.
రెండో రోజు వేలంలో ఇదే పెద్ద మొత్తం కాగా, పుణేరి పల్టన్ ఆ రెయిడర్‌ను దక్కించుకుంది. జై భగవాన్‌ను రూ. 63 లక్షలకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు ‘సి’ కేటగిరీలో మరో ఇద్దరు రూ.అరకోటి మార్క్ దాటారు. ఆల్‌రౌండర్ గుర్‌దీప్‌ను రూ. 59 లక్షలకు, డిఫెండర్ దీపక్ రాజేందర్ సింగ్‌ను రూ. 50 లక్షలకు పట్నా పైరేట్స్ పైరేట్స్ కొనుక్కుంది. ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో రెయిడర్ అర్జున్ రాఠికి అత్యధికంగా రూ.41 లక్షలు లభించాయి.
బెంగాల్ వారియర్స్ అతన్ని చేజిక్కించుకోగా, ఆ తర్వాత ఇంకెవరూ ఈ జాబితాలో కనీసం రూ.20 లక్షలైనా పొందలేకపోయారు. డిఫెండర్ మొహ్మద్ అమన్‌ను రూ.16.20 లక్షలకు పుణేరి పల్టన్, రెయిడర్ స్టువర్ట్ సింగ్‌ను రూ.14.20 లక్షలకు యు ముంబా జట్లు తీసుకున్నాయి. మొత్తం మీద ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఇద్దరు ప్లేయర్లు సచిన్ (రూ.2.15 కోట్లు; తమిళ్ తలైవాస్), మొహమ్మద్ రెజా (రూ.2.07 కోట్లు; హరియాణా) రెండు కోట్లపైచిలుకు అమ్ముడయ్యారు.
ఆరు మందికి రూ.కోటికి పైగా మొత్తం లభించింది. ఇక 12 ఫ్రాంచైజీల్లో ఆటగాళ్ల కోసం అత్యధికంగా హరియాణా స్టీలర్స్ ఫ్రాంచైజీ దాదాపు రూ. ఐదు కోట్లు (రూ.4.99 కోట్లు) ఖర్చు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment