బెంగళూరు: తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ను ‘టై’తో ఆరంభించింది. బుధవారం టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 స్కోరుతో సమంగా ముగిసింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ 11 పాయింట్లు సాధించగా, డిఫెండర్లలో సందీప్ 5, రుతురాజ్, అరుణ్ మూడేసి పాయింట్లు తెచ్చి పెట్టారు. మ్యాచ్‌లో తలైవాస్ రైడర్ మన్‌జీత్ సత్తా చాటాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 3 బోనస్ పాయింట్లు సహా 12 పాయింట్లు స్కోరు చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే స్టార్ రైడర్ సిద్ధార్థ్, రజ్‌నీశ్ జట్టుకు వరుస పాయింట్లు సాధించిపెట్టారు.
డిఫెండర్ సందీప్ కండోలా కూడా ప్రత్యర్థి రైడర్లను చేజిక్కించుకోవడంతో టైటాన్స్ జట్టు 8 నిమిషాల్లోనే తలైవాస్‌ను ఆలౌట్ చేసింది. అనంతరం తలైవాస్ రైడర్ మన్‌జీత్ దీటుగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మన్‌జీత్ చేసిన సూపర్ రైడ్ ఏకంగా 3 పాయింట్లు తెచ్చిపెట్టడంతో నిమిషాల వ్యవధిలో ఆధిక్యం మారిపోయింది. తొలి అర్ధ భాగం 23–21 వద్ద ముగిసింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు శ్రమించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఒక దశలో ఇరు జట్ల రైడర్లు విఫలమైతే డిఫెండర్ల హవా కొనసాగింది.
తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేయడం ద్వారా తలైవాస్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే సిద్ధార్ధ్ దేశాయ్ కీలక దశలో రైడింగ్‌కు వెళ్లినప్పుడల్లా పాయింట్లు సాధించడంతో టైటాన్స్ పుంజుకుంది. ఇంకో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా తన రైడింగ్ పాయింట్‌తో తమిళ్ తలైవాస్ రెండోసారి ఆలౌటైంది. అక్కడే స్కోరు సమమైంది. టాకిల్‌తో సందీప్, రైడింగ్‌తో సిద్ధార్థ్ తెలుగు జట్టును ఓటమి నుంచి తప్పించారు. ఇతర మ్యాచ్‌లలో యు ముంబా 46–30తో బెంగళూరు బుల్స్‌పై...బెంగాల్ వారియర్స్ 38–33తో యూపీ యోధపై గెలిచింది.
సిద్ధార్థ్ దేశాయ్
Comments
Please login to add a commentAdd a comment