పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో భాగంగా శనివారం పట్నా పైరెట్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 10 పాయింట్లతో సత్తా చాటగా... సుధాకర్ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 9 పాయింట్లు సాధించగా... గుమన్ సింగ్, జితేందర్ యాదవ్ చెరో 8 పాయింట్లతో మెరిశారు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పట్నా 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... గుజరాత్ 18 రెయిడ్ పాయింట్లకు పరిమితమైంది. ట్యాక్లింగ్‌లో వెనుకబడిన పట్నా 11 పాయింట్లతో సరిపెట్టుకోగా... గుజరాత్ 20 ట్యాకింగ్స్‌తో సత్తాచాటింది. ఇరు జట్ల మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరు చివరకు సమంగా ముగిసింది.
పట్నా జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరడంతో పాటు పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... గుజరాత్ 21 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 13 పరాజయాలు, 3 ‘టై’లతో 38 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 33–31 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది.
ఢిల్లీ తరఫున అశు మాలిక్ 12 పాయింట్లతో రాణించగా... జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లతో పోరాడాడు. ఢిల్లీ, జైపూర్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో యూ ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment