‘సూపర్’ శ్రీకాంత్ | Shuttler Srikanth storms into Singapore Open semis | Sakshi
Sakshi News home page

‘సూపర్’ శ్రీకాంత్

Published Fri, Apr 11 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

‘సూపర్’ శ్రీకాంత్

‘సూపర్’ శ్రీకాంత్

* సింగపూర్ ఓపెన్ లో  ప్రపంచ 14వ ర్యాంకర్ యున్ హూపై గెలుపు
* తొలిసారి ‘సూపర్’ టోర్నీ సెమీస్‌లోకి
* సింధు, సాయిప్రణీత్ పరాజయం
 
సింగపూర్: ఇటీవల తాను బరిలోకి దిగిన మూడు టోర్నీల్లోనూ తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన ఆంధ్రప్రదేశ్ యువతార కిడాంబి శ్రీకాంత్... సింగపూర్ ఓపెన్‌లో మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులను బోల్తా కొట్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ టోర్నీలో అన్‌సీడెడ్‌గా అడుగుపెట్టిన శ్రీకాంత్ శుక్రవారం మరో సంచలనం సృష్టించాడు. కెరీర్‌లో తొలిసారి సూపర్ సిరీస్ స్థాయి టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. 63 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ శ్రీకాంత్ 17-21, 21-14, 21-19తో ప్రపంచ 15వ ర్యాంకర్ యున్ హూ (హాంకాంగ్)ను ఓడించాడు.

* ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ టకుమా ఉయెదా (జపాన్)పై నెగ్గిన శ్రీకాంత్... ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ తియాన్ మిన్హ్ నగుయాన్ (వియత్నాం)ను ఓడించాడు. ఓవరాల్‌గా యున్ హూపై శ్రీకాంత్‌కిది వరుసగా రెండో విజయం. ఈ ఏడాది మలేసియా ఓపెన్ తొలి రౌండ్‌లోనూ యున్ హూపై ఈ గుంటూరు జిల్లా క్రీడాకారుడు గెలిచాడు.

* శ్రీకాంత్‌కు శనివారం అసలు సవాల్ ఎదురుకానుంది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో అతను తలపడనున్నాడు. ముఖాముఖి రికార్డులో లీ చోంగ్ వీ 1-0తో ఆధిక్యంలో ఉన్నాడు వీరిద్దరూ గతేడాది హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఆడగా... లీ చోంగ్ వీ 21-18, 21-14తో గెలిచాడు.

* యున్ హూతో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ ఆ తర్వాత తేరుకున్నాడు. రెండో గేమ్‌లో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 6-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే ఆధిక్యాన్ని కొనసాగించి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. కీలక దశలో పాయింట్లు నెగ్గిన శ్రీకాంత్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

* పురుషుల సింగిల్స్ మరో క్వార్టర్ ఫైనల్లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం ముగిసింది. ప్రపంచ 7వ ర్యాంకర్ డూ పెంగ్యూ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 15-21, 15-21తో ఓటమి చవిచూశాడు. ఏకపక్షంగా సాగిన  పోరులో తొలి గేమ్‌లో ఒక్కసారీ ఇద్దరి స్కోర్లు సమంకాలేదు. రెండో గేమ్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లిన పెంగ్యూ డూ వెనుదిరిగి చూడలేదు.

* మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధుకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 3వ ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 19-21, 15-21తో పరాజయం పాలైంది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యిహాన్ వాంగ్‌ను ఓడించిన సింధు అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయలేకపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement