Bhamidipati Sai Praneeth
-
అభిమానుల కోసం కొత్త ‘స్పోర్ట్స్ యాప్’
సాక్షి, హైదరాబాద్: అరవై పదాల్లో ఆసక్తికర క్రీడా సమాచారం... ఇదే లక్ష్యంతో కొత్త మొబైల్ అప్లికేషన్ మార్కెట్లోకి వచ్చింది. ‘వాట్స్ ఇన్ ద గేమ్’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ సహ భాగస్వామి. సాయిప్రణీత్‌తో పాటు అనిల్ కుమార్ మామిడాల, ఈజేబీ ప్రమీల కలిసి ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ఇతర స్పోర్ట్స్ యాప్‌లతో పోలిస్తే ‘వాట్స్ ఇన్ ద గేమ్’ అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, షెడ్యూల్ మొదలు ఫలితాల వరకు సమాచారం అరవై పదాల్లోనే అందుబాటులో ఉంటుదని రూపకర్తలు వెల్లడించారు. ప్రొఫెషనల్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడినే అయినా... ఇతర క్రీడలపై తనకున్న ఆసక్తి, ఒక క్రీడాభిమానిగా అన్ని రకాల సమాచారం తెలుసుకోవాలని కుతూహలం కారణంగా ఇలాంటి యాప్ ఉంటే బాగుంటుందని భావించానని, అందుకే తాను భాగం అయ్యాయని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణీత్ ఒక్కడే క్వార్టర్స్‌కు
బ్యాంకాక్: టైటిల్ వేటలో భారత షట్లర్ల ఆటలు థాయ్‌లాండ్ ఓపెన్‌లోనూ సాగడంలేదు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే కంగుతిన్నారు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500’ టోర్నమెంట్లో ఇప్పుడు భారత్ ఆశలన్నీ భమిడిపాటి సాయిప్రణీత్‌పైనే ఉన్నాయి. ఈ అన్‌సీడెడ్ షట్లర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల, మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ జోడీలు ముందంజ వేయగా సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీకి చుక్కెదురైంది. సాయి ప్రణీత్ అలవోక విజయం మిగతా భారత షట్లర్లకు విదేశీ ఆటగాళ్లు ఎదురుకాగా... సాయిప్రణీత్‌తో సహచరుడు శుభాంకర్ డే తలపడ్డాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను వరుస గేముల్లో 21–18, 21–19తో శుభాంకర్‌పై గెలుపొందాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శుభాంకర్ ప్రతీ గేమ్‌లోనూ పోరాడాడు. కానీ అతనికంటే మేటి ఆటగాడైన ప్రణీత్ ముందు ఎదురు నిలువలేకపోయాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–11, 16–21, 12–21తో స్థానిక ఆటగాడు కొసిట్ ఫెప్రదబ్ చేతిలో కంగుతిన్నాడు. మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) ధాటికి 21–9, 21–14తో పారుపల్లి కశ్యప్ నిలువలేకపోయాడు. హెచ్.ఎస్.ప్రణయ్ ఆటను జపాన్‌కు చెందిన కెంటో నిషిమోటో వరుస గేముల్లోనే ముగించాడు. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరోసీడ్ నిషిమోటో 21–17, 21–10తో ప్రణయ్‌ని ఇంటిదారి పట్టించాడు. సైనా పోరాటం సరిపోలేదు మహిళల సింగిల్స్‌లో సుమారు రెండు నెలల అనంతరం బరిలోకి దిగిన సైనా తొలి గేమ్ విజయంతో టచ్‌లోకి వచ్చింది. తర్వాత గేమ్‌లలో పోరాడే ప్రయత్నం చేసినా... జపాన్ ప్రత్యర్థి సయాక తకహాషి జోరు ముందు అదేమాత్రం సరిపోలేదు. చివరకు ఏడో సీడ్ భారత స్టార్ 21–16, 11–21, 14–21తో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–17, 21–19తో ఆరోసీడ్ ఫజర్–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–19తో అల్ఫియాన్–మార్షెయిలా ఇస్లామి (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. సిక్కిరెడ్డి–ప్రణవ్ జోడీ 16–21, 11–21తో ఎనిమిదో సీడ్ తంగ్చన్ మన్– సె యింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్
టోక్యో: మరోసారి సాధికారిక ఆటతీరును ప్రదర్శించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 11–21, 21–10, 21–13తో ప్రపంచ 20వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 21–13, 21–16తో ప్రపంచ 17వ ర్యాంకర్ కాంటా సునెయామ (జపాన్)ను ఓడించాడు. హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 9–21, 15–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 15–21, 21–11, 21–19తో హువాంగ్ కాయ్ జాంగ్– లియు చెంగ్ (చైనా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో దెచాపోల్–సప్సిరి (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్)తో సింధు; సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; తకెషి–కీగో సొనోడా (జపాన్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తలపడతారు. -
ఈసారి శ్రీకాంత్‌దే పైచేయి
సాయిప్రణీత్‌పై విజయంతో సెమీస్‌లోకి ► సింధు, సైనా నిష్క్రమణ ► ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ సిడ్నీ: తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ వరుసగా మూడో సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో భాగంగా... భారత్‌కే చెందిన భమిడిపాటి సాయిప్రణీత్‌తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 25–23, 21–17తో విజయం సాధించాడు. సాయిప్రణీత్‌తో ఇప్పటివరకు ఏడుసార్లు ఆడిన శ్రీకాంత్‌కిది కేవలం రెండో విజయం కావడం గమనార్హం. అంతేకాకుండా సాయిప్రణీత్‌ను వరుసగా రెండు గేముల్లో ఓడించడం శ్రీకాంత్‌కిదే తొలిసారి. గత ఏప్రిల్‌లో సింగపూర్ ఓపెన్ ఫైనల్లో సాయిప్రణీత్ చేతిలో ఓడిన శ్రీకాంత్ తాజా విజయంతో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ షి యుకి (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు. ఈ మ్యాచ్‌కు ముందు 2014లో ఇండియా గ్రాండ్‌ప్రి టోర్నీలో ఏౖకైకసారి సాయిప్రణీత్‌ను ఓడించిన శ్రీకాంత్‌కు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. అయితే ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా)ను వరుసగా రెండు టోర్నీల్లో ఓడించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ అదే జోరులో సాయిప్రణీత్ అడ్డంకిని దాటాడు. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌లో ఒకదశలో 13–16తో వెనుకబడినా వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం పోరాడారు. అయితే కీలకదశలో సాయిప్రణీత్ తప్పిదాలు చేసి తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్ కూడా హోరాహోరీగా సాగింది. అయితే విరామ సమయానికి 11–9తో ముందంజ వేసిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. నేటి సెమీఫైనల్స్ ఉదయం గం. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
రెండో రౌండ్లో సాయిప్రణీత్
న్యూఢిల్లీ : కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్‌తోపాటు భారత్‌కే చెందిన అజయ్ జయరామ్, ఆనంద్ పవార్ శుభారంభం చేశారు. అయితే మరో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ మాత్రం తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 21-11, 21-17తో అలిస్టర్ క్యాసీ (స్కాట్లాండ్)ను ఓడించగా... అజయ్ జయరామ్ 21-10, 21-19తో షి కుయె చున్ (చైనీస్ తైపీ)పై, ఆనంద్ పవార్ 21-9, 21-10తో నికొలస్ వాలెర్ (అమెరికా)పై గెలిచారు. గురుసాయిదత్ 9-21, 14-21తో షి యుకీ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
‘సూపర్’ శ్రీకాంత్
* సింగపూర్ ఓపెన్ లో ప్రపంచ 14వ ర్యాంకర్ యున్ హూపై గెలుపు * తొలిసారి ‘సూపర్’ టోర్నీ సెమీస్‌లోకి * సింధు, సాయిప్రణీత్ పరాజయం సింగపూర్: ఇటీవల తాను బరిలోకి దిగిన మూడు టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే ఓడిపోయిన ఆంధ్రప్రదేశ్ యువతార కిడాంబి శ్రీకాంత్... సింగపూర్ ఓపెన్‌లో మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులను బోల్తా కొట్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ టోర్నీలో అన్‌సీడెడ్‌గా అడుగుపెట్టిన శ్రీకాంత్ శుక్రవారం మరో సంచలనం సృష్టించాడు. కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ స్థాయి టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. 63 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ శ్రీకాంత్ 17-21, 21-14, 21-19తో ప్రపంచ 15వ ర్యాంకర్ యున్ హూ (హాంకాంగ్)ను ఓడించాడు. * ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ టకుమా ఉయెదా (జపాన్)పై నెగ్గిన శ్రీకాంత్... ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ తియాన్ మిన్హ్ నగుయాన్ (వియత్నాం)ను ఓడించాడు. ఓవరాల్‌గా యున్ హూపై శ్రీకాంత్‌కిది వరుసగా రెండో విజయం. ఈ ఏడాది మలేసియా ఓపెన్ తొలి రౌండ్లోనూ యున్ హూపై ఈ గుంటూరు జిల్లా క్రీడాకారుడు గెలిచాడు. * శ్రీకాంత్‌కు శనివారం అసలు సవాల్ ఎదురుకానుంది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో అతను తలపడనున్నాడు. ముఖాముఖి రికార్డులో లీ చోంగ్ వీ 1-0తో ఆధిక్యంలో ఉన్నాడు వీరిద్దరూ గతేడాది హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్లో ఆడగా... లీ చోంగ్ వీ 21-18, 21-14తో గెలిచాడు. * యున్ హూతో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ ఆ తర్వాత తేరుకున్నాడు. రెండో గేమ్‌లో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 6-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే ఆధిక్యాన్ని కొనసాగించి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. కీలక దశలో పాయింట్లు నెగ్గిన శ్రీకాంత్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. * పురుషుల సింగిల్స్ మరో క్వార్టర్ ఫైనల్లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం ముగిసింది. ప్రపంచ 7వ ర్యాంకర్ డూ పెంగ్యూ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 15-21, 15-21తో ఓటమి చవిచూశాడు. ఏకపక్షంగా సాగిన పోరులో తొలి గేమ్‌లో ఒక్కసారీ ఇద్దరి స్కోర్లు సమంకాలేదు. రెండో గేమ్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లిన పెంగ్యూ డూ వెనుదిరిగి చూడలేదు. * మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధుకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 3వ ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 19-21, 15-21తో పరాజయం పాలైంది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యిహాన్ వాంగ్‌ను ఓడించిన సింధు అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయలేకపోయింది.