టోక్యో: మరోసారి సాధికారిక ఆటతీరును ప్రదర్శించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 11–21, 21–10, 21–13తో ప్రపంచ 20వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 21–13, 21–16తో ప్రపంచ 17వ ర్యాంకర్ కాంటా సునెయామ (జపాన్)ను ఓడించాడు.
హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. రాస్‌ముస్ గెమ్కే (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 9–21, 15–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 15–21, 21–11, 21–19తో హువాంగ్ కాయ్ జాంగ్– లియు చెంగ్ (చైనా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో దెచాపోల్–సప్‌సిరి (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్)తో సింధు; సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; తకెషి–కీగో సొనోడా (జపాన్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment