Japan open badminton tourney
-
Japan Open: పోరాడి ఓడిన ప్రణయ్
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. టోక్యోలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–15, 20–22తో ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో ప్రణయ్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ముఖాముఖిగా ఇప్పటివరకు చౌ తియెన్ చెన్, ప్రణయ్ ఎనిమిదిసార్లు తలపడగా... ఐదుసార్లు చౌ తియెన్ చెన్, మూడుసార్లు ప్రణయ్ గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 28 వేలు)తోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
వరల్డ్ నంబర్ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్ ఔట్
జపాన్ ఓపెన్ 2022లో బుధవారం భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా, కిదాంబి శ్రీకాంత్.. వరల్డ్ నంబర్ 4 ఆటగాడికి షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. బుధవారం శ్రీకాంత్ ఒక్కడే తొలి రౌండ్ గండాన్ని అధిగమించాడు. శ్రీకాంత్.. మలేషియాకు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీకాంత్.. ఈ గేమ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. మిగతా గేమ్‌ల్లో లక్ష్యసేన్.. జపాన్‌కు చెందిన కెంట నిషిమొటొ చేతిలో 21-18, 14-21, 13-21 తేడాతో, సైనా నెహ్వాల్.. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 21-9, 21-17 తేడాతో ఓడారు. పురుషుల డబుల్స్‌లో అర్జున్-కపిల ద్వయం.. చోయ్-కిమ్ చేతిలో, మహిళల డబుల్స్‌లో జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ.. కిటితరకుల్-ప్రజోంగజ్ చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో ప్రసాద్-దేవాంగన్ జంట.. జెంగ్-హుయాంగ్ చేతిలో ఓటమి చవిచూశాయి. కాగా, ఈ టోర్నీలో మంగళవారం హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్ -
సెమీస్‌తో సరి
టోక్యో: ఊహించిన ఫలితమే వచ్చింది. సెమీఫైనల్ చేరే క్రమంలో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్... సెమీఫైనల్లో మాత్రం తన శక్తిమేర పోరాడినా సంచలన ఫలితం నమోదు చేయలేకపోయాడు. ఫలితంగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ సాయిప్రణీత్ 18–21, 12–21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో 11వ ర్యాంకర్ నిషిమోటో (జపాన్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 17వ ర్యాంకర్ సునెయామ (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 18వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందిన సాయిప్రణీత్‌కు సెమీస్‌లో ఓటమితో 10,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 23 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెంటో మొమోటాతో ఐదోసారి తలపడిన సాయిప్రణీత్ ఈసారి వరుస గేముల్లో ఓడిపోయాడు. ఏప్రిల్‌లో సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లో కెంటో మొమోటాకు మూడు గేమ్‌లపాటు ముచ్చెమటలు పట్టించిన ఈ తెలుగు తేజం ప్రస్తుత పోరులో 45 నిమిషాల్లో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్ హోరాహోరీగా సాగినా కీలకదశలో మొమోటా పైచేయి సాధించాడు. ఒకదశలో 6–11తో వెనుకబడిన సాయిప్రణీత్ అద్భుత ఆటతో వరుసగా ఐదు పాయింట్లు గెలిచి స్కోరును 11–11తో సమం చేశాడు. కానీ వెంటనే తేరుకున్న మొమోటా వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ ఆరంభంలో సాయిప్రణీత్ దూకుడుగా ఆడుతూ 9–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ నిలబెట్టుకోలేకపోయాడు. మొమోటా సాధికారిక ఆటతీరుకుతోడు అనవసర తప్పిదాలు చేసిన సాయిప్రణీత్ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయాడు. 9–12తో వెనుకంజలో నిలిచాడు. ఆ తర్వాత సాయిప్రణీత్ కోలుకొని 12–14తో ఆధిక్యాన్ని రెండు పాయింట్లకు తగ్గించాడు. ఈ దశలో మొమోటా ఒక్కసారిగా గేర్ మార్చాడు. వరుసగా ఏడు పాయింట్లు సంపాదించి 21–12తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ‘మ్యాచ్‌లో అడపాదడపా బాగా ఆడాను. కెంటో మొమోటాను ఓడించడం అంత సులువు కాదు. ఏ రకంగా ఆడినా అతని నుంచి సమాధానం వస్తోంది. దూకుడుగా ఆడినా... సుదీర్ఘ ర్యాలీలు ఆడినా... రక్షణాత్మకంగా ఆడినా... స్మాష్ షాట్లు సంధించినా... మొమోటా దీటుగా బదులు ఇస్తున్నాడు. తనదైన శైలి ఆటతో ప్రత్యర్థి ఎలా ఆడాలో, ప్రత్యర్థిని ఎలా ఆడించాలో అతనే శాసిస్తున్నాడు’ –సాయిప్రణీత్ -
సింధు ఔట్.. సెమీస్‌లో ప్రణీత్
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ఒక్కడి చేతుల్లోనే మిగిలుంది. తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ అలవోక విజయంతో సెమీఫైనల్ చేరగా... స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఆట క్వార్టర్స్‌లోనే ముగిసింది. టోక్యో: ఈ సీజన్లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మళ్లీ టైటిల్ వేటకు దూరమైంది. జపాన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్ కూడా ఆమెకు అందని ద్రాక్షగా ముగిసింది. ఈ టోర్నీ మహిళల ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ సింధు క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరో వైపు ఈ టోర్నీలో అసాధారణ ఆటతీరుతో ముందడుగు వేస్తున్న సాయి ప్రణీత్ టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ అన్‌సీడెడ్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. అలవోక విజయంతో... పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. అతను 21–12, 21–15తో ఇండోనేసియాకు చెందిన టామి సుగియార్తోను ఇంటిదారి పట్టించాడు. కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించాడు. తొలి గేమ్‌లో సుగియార్తోనే ఖాతా తెరిచినా... జోరు మాత్రం ప్రణీత్‌దే! ఇండోనేసియా ఆటగాడు ఒక పాయింట్ చేయగానే... సాయిప్రణీత్ వరుసగా 5 పాయింట్లు సాధించాడు. అక్కడి నుంచి మొదలైన జోరుకు ఏ దశలోనూ సుగియార్తో ఎదురు నిలువలేకపోయాడు. ప్రత్యర్థి 10 పాయింట్లు సాధించేలోపే 19 పాయింట్లతో తెలుగు షట్లర్ గెలుపు తీరం చేరాడు. రెండో గేమ్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఆరంభం నుంచే సాయిప్రణీత్ కోర్టులో చురుగ్గా కదంతొక్కడంతో పాయింట్ల చకచకా వచ్చేశాయి. రెండు సార్లు 5–4, 12–10 స్కోరు వద్ద ప్రణీత్‌కు చేరువైనప్పటికీ... సుగియార్తోను ఓడించేందుకు భారత ఆటగాడికి ఎంతోసేపు పట్టలేదు. సింధు మరోసారి... మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ ఐదో సీడ్ సింధు 18–21, 15–21తో నాలుగో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో చక్కని పోరాటపటిమ కనబరిచిన సింధు... రెండో గేమ్‌లో ఆ ఆటతీరు కొనసాగించలేకపోయింది. చివరకు 50 నిమిషాల్లో ప్రత్యర్థి ధాటికి ఇంటిదారి పట్టింది. ఈ సీజన్లో సింధు ఒకే ఒక్క టోర్నీ (ఇండోనేసియా ఓపెన్)లో ఫైనల్ చేరింది. అంతిమ పోరులో యామగుచి... సింధును ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. తాజాగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం సింధుకు వచ్చింది. కానీ తెలుగుతేజం కసితీరా ఆడలేకపోయింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ షెట్టి ద్వయం 19–21, 18–21తో రెండో సీడ్ తకెషి కముర– కెయిగొ సొనొద (జపాన్) జంట చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్
టోక్యో: మరోసారి సాధికారిక ఆటతీరును ప్రదర్శించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 11–21, 21–10, 21–13తో ప్రపంచ 20వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 21–13, 21–16తో ప్రపంచ 17వ ర్యాంకర్ కాంటా సునెయామ (జపాన్)ను ఓడించాడు. హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 9–21, 15–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 15–21, 21–11, 21–19తో హువాంగ్ కాయ్ జాంగ్– లియు చెంగ్ (చైనా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో దెచాపోల్–సప్సిరి (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్)తో సింధు; సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; తకెషి–కీగో సొనోడా (జపాన్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తలపడతారు. -
సింధు ముందుకు... శ్రీకాంత్ ఇంటికి
టోక్యో: ఈ సీజన్లో తన నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 11–21, 20–22తో భారత్‌కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీకాంత్ చేతిలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ప్రణయ్ ఈసారి మాత్రం సంచలన ప్రదర్శన చేసి తన సహచరుడికి షాక్ ఇచ్చాడు. 2011లో ఏకైకసారి శ్రీకాంత్‌ను ఓడించిన ప్రణయ్ ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అతడిపై గెలుపొందడం విశేషం. మరో సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సమీర్ వర్మ (భారత్) 17–21, 12–21తో ఆంటోన్సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 21–9, 21–17తో హాన్ యుయె (చైనా)పై గెలిచింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 11–21, 14–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడీ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 14–21తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–16, 21–17తో మార్కస్ ఇలిస్–క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు; కాంటా సునెయామ (జపాన్)తో సాయిప్రణీత్; రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు. -
సాయిప్రణీత్ శుభారంభం
టోక్యో: తనకంటే మెరుగైన ర్యాంకర్ ప్రత్యర్థిగా ఉన్నా... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సహజశైలిలో ఆడిన భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో నిషిమోటో (జపాన్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 23వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–17, 21–13తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాయిప్రణీత్‌కు గట్టిపోటీ ఎదురైనా... కీలకదశలో వరుస పాయింట్లతో విజృంభించి విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఎనిమిది టోర్నీల్లో ఆడిన సాయిప్రణీత్ స్విస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచాడు. ఇండోనేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో తొలిరౌండ్లో నిష్క్రమించాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, న్యూజిలాండ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరిన అతను ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. రెండేళ్ల తర్వాత నిషిమోటోతో మరోసారి ఆడిన సాయిప్రణీత్ రెండు గేముల్లోనూ తొలుత వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకొని ఆధిక్యంలోకి వచ్చాడు. రెండో గేమ్‌లో 2–7తో వెనుకంజలో ఉన్న సాయిప్రణీత్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 12–12 వద్ద ఉన్నపుడు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి 20–12తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించాడు. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన కాంటా సునెయామతో సాయిప్రణీత్ ఆడతాడు. తొలి రౌండ్లో సునెయామ 21–14, 21–17తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ లాంగ్ (చైనా)ను ఓడించడం విశేషం. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని ద్వయం 21–14, 21–19తో మార్విన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మను అత్రి జంట పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సుమీత్–మను అత్రి జోడీ 12–21, 16–21తో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హాన్ యుయె (చైనా)తో పీవీ సింధు; హెచ్ఎస్ ప్రణయ్‌తో కిడాంబి శ్రీకాంత్; ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా)లతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మార్కస్ ఇలిస్–క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పోటీపడతారు. -
మొమోటా మెరిసె...
టోక్యో: రెండేళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడుతూ పట్టుబడి... నిషేధం ఎదుర్కొని... గతేడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పునరాగమనం చేసిన జపాన్ యువ కెరటం కెంటో మొమోటా జోరు మీదున్నాడు. గత నెలలో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి జపాన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన 24 ఏళ్ల మొమోటా... తాజాగా స్వదేశంలోనూ సత్తా చాటుకున్నాడు. ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టైటిల్ గెలిచాడు. ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మొమోటా 21–14, 21–11తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ ఓపెన్‌లో జపాన్ క్రీడాకారుడికి టైటిల్ లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21–19, 17–21, 21–11తో మాజీ విశ్వవిజేత ఒకుహారా (జపాన్)పై గెలిచి టైటిల్ దక్కించుకుంది. -
ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు ఓటమి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తెలుగు ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె పోరాటం ముగిసింది. గురువారం యమగుచి (జపాన్)తో 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 6-21 17-21తో సింధు ఓటమి పాలయింది. పురుషుల సింగిల్స్‌లో ఏపీ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్, ప్రపంచ 56వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో కాజుటెరు కొజయ్(జపాన్)పై శ్రీకాంత్ 21-12 21-16తో విజయం సాధించాడు. అరగంటలోనే మ్యాచ్ ముగించాడు. మరో మ్యాచ్‌లో జాన్ ఒ జొర్జన్సెన్(డెన్మార్క్)పై ప్రణయ్ 21-14 13-21 21-17తో గెలుపొందాడు.