టోక్యో: తనకంటే మెరుగైన ర్యాంకర్ ప్రత్యర్థిగా ఉన్నా... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సహజశైలిలో ఆడిన భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో నిషిమోటో (జపాన్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–17, 21–13తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాయిప్రణీత్‌కు గట్టిపోటీ ఎదురైనా... కీలకదశలో వరుస పాయింట్లతో విజృంభించి విజయాన్ని దక్కించుకున్నాడు.
ఈ ఏడాది ఎనిమిది టోర్నీల్లో ఆడిన సాయిప్రణీత్ స్విస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచాడు. ఇండోనేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో తొలిరౌండ్‌లో నిష్క్రమించాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, న్యూజిలాండ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరిన అతను ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. రెండేళ్ల తర్వాత నిషిమోటోతో మరోసారి ఆడిన సాయిప్రణీత్ రెండు గేముల్లోనూ తొలుత వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకొని ఆధిక్యంలోకి వచ్చాడు. రెండో గేమ్‌లో 2–7తో వెనుకంజలో ఉన్న సాయిప్రణీత్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 12–12 వద్ద ఉన్నపుడు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి 20–12తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించాడు. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన కాంటా సునెయామతో సాయిప్రణీత్ ఆడతాడు. తొలి రౌండ్‌లో సునెయామ 21–14, 21–17తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ లాంగ్ (చైనా)ను ఓడించడం విశేషం.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో సాత్విక్–అశ్విని ద్వయం 21–14, 21–19తో మార్విన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మను అత్రి జంట పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. సుమీత్–మను అత్రి జోడీ 12–21, 16–21తో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో హాన్ యుయె (చైనా)తో పీవీ సింధు; హెచ్‌ఎస్ ప్రణయ్‌తో కిడాంబి శ్రీకాంత్; ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ ఆడతారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా)లతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో మార్కస్ ఇలిస్–క్రిస్ లాంగ్‌రిడ్జ్ (ఇంగ్లండ్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పోటీపడతారు.
Comments
Please login to add a commentAdd a comment