సింధు ఔట్‌.. సెమీస్‌లో ప్రణీత్‌ | Sai Praneeth enters semis; Sindhu, Rankireddy-Shetty pair crash out | Sakshi
Sakshi News home page

సింధు ఔట్‌.. సెమీస్‌లో ప్రణీత్‌

Published Sat, Jul 27 2019 5:02 AM | Last Updated on Sat, Jul 27 2019 9:40 AM

Sai Praneeth enters semis; Sindhu, Rankireddy-Shetty pair crash out - Sakshi

జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌ పోరాటం ఒక్కడి చేతుల్లోనే మిగిలుంది. తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్‌ అలవోక విజయంతో సెమీఫైనల్‌ చేరగా... స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట సింధు ఆట
క్వార్టర్స్‌లోనే ముగిసింది.


టోక్యో: ఈ సీజన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు మళ్లీ టైటిల్‌ వేటకు దూరమైంది. జపాన్‌ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ కూడా ఆమెకు అందని ద్రాక్షగా ముగిసింది. ఈ టోర్నీ మహిళల ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సింధు క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరో వైపు ఈ టోర్నీలో అసాధారణ ఆటతీరుతో ముందడుగు వేస్తున్న సాయి ప్రణీత్‌ టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ అన్‌సీడెడ్‌ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడీకి నిరాశే ఎదురైంది.

అలవోక విజయంతో...
పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. అతను 21–12, 21–15తో ఇండోనేసియాకు చెందిన టామి సుగియార్తోను ఇంటిదారి పట్టించాడు. కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించాడు. తొలి గేమ్‌లో సుగియార్తోనే ఖాతా తెరిచినా... జోరు మాత్రం ప్రణీత్‌దే! ఇండోనేసియా ఆటగాడు ఒక పాయింట్‌ చేయగానే... సాయిప్రణీత్‌ వరుసగా 5 పాయింట్లు సాధించాడు. అక్కడి నుంచి మొదలైన జోరుకు ఏ దశలోనూ సుగియార్తో ఎదురు నిలువలేకపోయాడు. ప్రత్యర్థి 10 పాయింట్లు సాధించేలోపే 19 పాయింట్లతో తెలుగు షట్లర్‌ గెలుపు తీరం చేరాడు. రెండో గేమ్‌ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఆరంభం నుంచే సాయిప్రణీత్‌ కోర్టులో చురుగ్గా కదంతొక్కడంతో పాయింట్ల చకచకా వచ్చేశాయి. రెండు సార్లు 5–4, 12–10 స్కోరు వద్ద ప్రణీత్‌కు చేరువైనప్పటికీ... సుగియార్తోను ఓడించేందుకు భారత ఆటగాడికి ఎంతోసేపు పట్టలేదు.

సింధు మరోసారి...
మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌ ఐదో సీడ్‌ సింధు 18–21, 15–21తో నాలుగో సీడ్‌ యామగుచి (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో చక్కని పోరాటపటిమ కనబరిచిన సింధు... రెండో గేమ్‌లో ఆ ఆటతీరు కొనసాగించలేకపోయింది. చివరకు 50 నిమిషాల్లో ప్రత్యర్థి ధాటికి ఇంటిదారి పట్టింది. ఈ సీజన్‌లో సింధు ఒకే ఒక్క టోర్నీ (ఇండోనేసియా ఓపెన్‌)లో ఫైనల్‌ చేరింది. అంతిమ పోరులో యామగుచి... సింధును ఓడించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. తాజాగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం సింధుకు వచ్చింది. కానీ తెలుగుతేజం కసితీరా ఆడలేకపోయింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ షెట్టి ద్వయం 19–21, 18–21తో రెండో సీడ్‌ తకెషి కముర– కెయిగొ సొనొద (జపాన్‌) జంట చేతిలో ఓడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement