
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడబోతున్నాయో తేలిపోయింది. ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్-బిలో సెకెండ్ ప్లేస్‌లో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్దమైంది. భారత్, ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్‌లో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో ఆసీస్ భారత్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది.
దాదాపుగా ఏడాదిన్నర తర్వాత భారత్‌కు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 4న దుబాయ్ వేదికగా జరుగనుంది.
నేటి మ్యాచ్‌లో ఫలితంతో రెండో సెమీస్‌లో ఎవరెవరు తలపడబోతున్నారో కూడా తేలిపోయింది. భారత్ చేతిలో ఓటమితో న్యూజిలాండ్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా గ్రూప్-బి టాపర్ అయిన సౌతాఫ్రికాను రెండో సెమీస్‌లో ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మార్చి 5న జరుగుతుంది.
అనంతరం రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి టీమిండియా ఫైనల్‌కు చేరితే దుబాయ్ వేదికగా అంతిమ సమరం జరుగుతుంది. ఒకవేళ సెమీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓడితే లాహోర్ ఫైనల్ మ్యాచ్‌కు వేదికవుతుంది.
హ్యాట్రిక్ విజయాలు
భారత్ గ్రూప్-ఏలో హ్యాట్రిక్ విజయాలు సాధించి అజేయ జట్టుగా సెమీస్‌కు చేరింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. చివరిగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.
మరోవైపు ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆసీస్ ఇంగ్లండ్‌పై మాత్రమే గెలుపొందింది.
44 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా
గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment