![Defending champions Mumbai team in Ranji Trophy quarter finals](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/mumbai.jpg.webp?itok=bfiQgCFs)
ముంబై తొలి ఇన్నింగ్స్ 278/8
తమిళనాడుపై విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్ సెంచరీ
హరియాణాతో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్
కోల్‌కతా: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు చక్కటి పోరాట పటిమ కనబర్చింది. ఒక దశలో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఆల్‌రౌండర్లు షమ్స్ ములానీ (178 బంతుల్లో 91; 10 ఫోర్లు), తనుశ్ కొటియాన్ (154 బంతుల్లో 85 బ్యాటింగ్) ఆదుకున్నారు.
శనివారం హరియాణాతో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 81 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (9), శివమ్ దూబే (28) భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే (0), ఆకాశ్ ఆనంద్ (10), సిద్ధేశ్ లాడ్ (4) ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ (15) ఒకరి వెంట ఒకరు పెవలియన్‌కుచేరారు.
కెప్టెన్ అజింక్య రహానే (31) మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయారు. అయితే చివర్లో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ జంట ఎనిమిదో వికెట్‌కు 165 పరుగులు జోడించి ముంబై జట్టును తిరిగి పోటీలోకి తెచ్చింది. హరియాణా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తీసుకొచ్చారు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా... షమ్స్ ములానీ అవుట్ కాగా... తనుశ్‌తోపాటు మోహిత్ అవస్థి (0 బ్యాటింగ్) క్రీజులోఉన్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, సుమిత్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు.
కరుణ్ నాయర్ మరో సెంచరీ
నాగ్‌పూర్: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (180 బంతుల్లో 100 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. తాజా సీజన్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్ అజేయ శతకంతో విజృంభించడంతో తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
అథర్వ తైడె (0), ధ్రువ్ షోరె (26), ఆదిత్య ఠాక్రే (5) విఫలమవడంతో ఒక దశలో 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విదర్భ జట్టును దానిశ్ మాలేవార్ (75; 13 ఫోర్లు)తో కలిసి కరుణ్ నాయర్ ఆదుకున్నాడు. ఇటీవల దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా నాలుగు శతకాలు బాది రికార్డు సృష్టించిన 33 ఏళ్ల కరుణ్ నాయర్... ఈ సెంచరీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 22వ శతకం తన పేరిట లిఖించుకున్నాడు.
యశ్ రాథోడ్ (13), కెపె్టన్ ఆకాశ్ వాడ్కర్ (24) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆట ముగిసే సమయానికి కరుణ్ నాయర్‌తో పాటు హర్‡్ష దూబే (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
సౌరాష్ట్ర 216 ఆలౌట్
రాజ్‌కోట్: భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా (26) విఫలమవడంతో గుజరాత్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది.
చిరాగ్ జానీ (148 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించగా, అర్పిత్ (39 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. పుజారా, హార్విక్ దేశాయ్ (22), షెల్డన్ జాక్సన్ (14), ప్రేరక్ మన్కడ్ (0), సమర్ గజ్జర్ (4) కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (14), ధర్మేంద్ర జడేజా (22) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కెపె్టన్ చింతన్ గాజా 4 వికెట్లు పడగొట్టగా... జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్... ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 195 పరుగులు వెనుకబడి ఉంది.
జమ్ము కశ్మీర్ 228/8
పుణే: కేరళతో జరుగుతున్న మరో క్వార్టర్స్‌లో జమ్ము కశ్మీర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జమ్ము కశ్మీర్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.
గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన జమ్ము కశ్మీర్ టాపార్డర్... నాకౌట్‌లో దాన్ని కొనసాగించడంలో విఫలమైంది. నసీర్ (44), సాహిల్ (35), కన్హయ్య (48) కాస్త పోరాడారు. కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment