PV singhu
-
నాగార్జున సాగర్‌లో పీవీ సింధు సందడి
సాక్షి, నల్గొండ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నాగార్జున సాగర్‌లో సందడి చేశారు. ఆదివారం ఉదయం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి సాగర్ సందర్శించారు. సింధూ ప్రాజెక్ట్ వద్ద కుటుంబీకులతో కలిసి నవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగారు. సాగర్ చేరుకున్న సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్ట్‌ను దగ్గరుండి చూపించారు. కాగా ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదలడంతో ఆ సుందర దృశ్యాలను చూడటానికి పర్యాటకులు సాగర్ చేరుకుంటున్నారు. భారీగా పోటెత్తిన వరద నీరు.. మరోవైపు కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 20 క్రస్ట్ గేట్లు 20 అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో: 6,06,754 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో: 6,06,754 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటినిల్వ: 312.0450 టీఎంసీలు.. ప్రస్తుత నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు.. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం: 590 అడుగులు.. -
ఇలా చెమటోడ్చి ఎన్ని రోజులైందో...
హైదరాబాద్: నాలుగు నెలల తర్వాత జిమ్‌లో శ్రమించడం పట్ల ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. అన్‌లాక్– 3 మార్గదర్శకాల్లో భాగంగా ఆగస్టు 5 నుంచి వ్యాయామశాలలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో... సింధు బుధవారం జిమ్‌లో చెమటోడ్చింది. పూర్తిస్థాయి జిమ్ సెషన్లో పాల్గొన్న ఆమె ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. చాలా కాలం తర్వాత ఇలా కసరత్తులు చేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. ట్రైనర్ సహాయంతో బరువులు ఎత్తడం, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేసింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలకు అంతరాయం ఏర్ప డిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సెప్టెంబర్‌లో జరగాల్సిన నాలుగు టోర్నీలను రద్దు చేసింది. -
సింధు ఔట్.. సెమీస్‌లో ప్రణీత్
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ఒక్కడి చేతుల్లోనే మిగిలుంది. తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ అలవోక విజయంతో సెమీఫైనల్ చేరగా... స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఆట క్వార్టర్స్‌లోనే ముగిసింది. టోక్యో: ఈ సీజన్లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మళ్లీ టైటిల్ వేటకు దూరమైంది. జపాన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్ కూడా ఆమెకు అందని ద్రాక్షగా ముగిసింది. ఈ టోర్నీ మహిళల ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ సింధు క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరో వైపు ఈ టోర్నీలో అసాధారణ ఆటతీరుతో ముందడుగు వేస్తున్న సాయి ప్రణీత్ టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ అన్‌సీడెడ్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. అలవోక విజయంతో... పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. అతను 21–12, 21–15తో ఇండోనేసియాకు చెందిన టామి సుగియార్తోను ఇంటిదారి పట్టించాడు. కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించాడు. తొలి గేమ్‌లో సుగియార్తోనే ఖాతా తెరిచినా... జోరు మాత్రం ప్రణీత్‌దే! ఇండోనేసియా ఆటగాడు ఒక పాయింట్ చేయగానే... సాయిప్రణీత్ వరుసగా 5 పాయింట్లు సాధించాడు. అక్కడి నుంచి మొదలైన జోరుకు ఏ దశలోనూ సుగియార్తో ఎదురు నిలువలేకపోయాడు. ప్రత్యర్థి 10 పాయింట్లు సాధించేలోపే 19 పాయింట్లతో తెలుగు షట్లర్ గెలుపు తీరం చేరాడు. రెండో గేమ్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఆరంభం నుంచే సాయిప్రణీత్ కోర్టులో చురుగ్గా కదంతొక్కడంతో పాయింట్ల చకచకా వచ్చేశాయి. రెండు సార్లు 5–4, 12–10 స్కోరు వద్ద ప్రణీత్‌కు చేరువైనప్పటికీ... సుగియార్తోను ఓడించేందుకు భారత ఆటగాడికి ఎంతోసేపు పట్టలేదు. సింధు మరోసారి... మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ ఐదో సీడ్ సింధు 18–21, 15–21తో నాలుగో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో చక్కని పోరాటపటిమ కనబరిచిన సింధు... రెండో గేమ్‌లో ఆ ఆటతీరు కొనసాగించలేకపోయింది. చివరకు 50 నిమిషాల్లో ప్రత్యర్థి ధాటికి ఇంటిదారి పట్టింది. ఈ సీజన్లో సింధు ఒకే ఒక్క టోర్నీ (ఇండోనేసియా ఓపెన్)లో ఫైనల్ చేరింది. అంతిమ పోరులో యామగుచి... సింధును ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. తాజాగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం సింధుకు వచ్చింది. కానీ తెలుగుతేజం కసితీరా ఆడలేకపోయింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ షెట్టి ద్వయం 19–21, 18–21తో రెండో సీడ్ తకెషి కముర– కెయిగొ సొనొద (జపాన్) జంట చేతిలో ఓడింది. -
సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
కౌలాలంపూర్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 22–20, 21–19తో రియో ఒలింపిక్స్ చాంపియన్, మాజీ విశ్వవిజేత కరోలినా మారిన్ (స్పెయిన్)ను ఓడించగా... శ్రీకాంత్ 21–18, 21–14తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు; ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)తో శ్రీకాంత్ ఆడతారు. ముఖా ముఖి రికార్డుల్లో సింధు 3–8తో, శ్రీకాంత్ 3–5తో వెనుకబడి ఉండటం గమనార్హం. మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనే ఎదురైంది. అయితే కీలకదశలో సింధు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండోగేమ్‌లో సింధు దూకుడుగా ఆడి ఆరంభంలోనే 11–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మారిన్ పుంజుకోవడంతో హోరాహోరీ పోరు జరిగింది. స్కోరు 20–19 వద్ద సింధు క్రాస్ కోర్టు స్మాష్ సంధించి మారిన్ ఆట కట్టించింది. నేటి సెమీఫైనల్స్ ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం. -
సైనా, సింధు శుభారంభం
జకర్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ పోటీల్లో సింధు 21–13, 21–10తో హన్న రమదిని (ఇండోనేసియా)పై, సైనా 22–24, 21–15, 21–14తో ఏడో సీడ్ చెన్ యుఫె (చైనా)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మకు మొదటి రౌండ్లోనే చుక్కెదురైంది. అతను 16–21, 21–12, 10–21తో కజుమస సాకాయ్ (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–15, 21–17తో ఎనిమిదో సీడ్ తకుటో ఇనోయె – యుకి కనెకో (జపాన్) జంటపై విజయం సాధించగా, మను అత్రి– సుమిత్ రెడ్డి జోడి 18–21, 21–16, 16–21తో లు చింగ్ యో– యంగ్ పొ హన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. పారుపల్లి కశ్యప్ 18–21, 18–21తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
కోచ్ హండోయో కొనసాగుతాడు: బాయ్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ పదవి నుంచి ముల్యో హండోయో తప్పుకోనున్నట్లు వచ్చిన వార్తలను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తోసిపుచ్చింది. ‘హండోయో సెలవులకు స్వదేశమైన ఇండోనేసియాకు వెళ్లాడు. కోచ్‌గా వైదొలగనున్నట్లు అతడి నుంచి మాకెలాంటి సమాచారం లేదు. బహుశా ఇది వదంతి కావొచ్చు’ అని బాయ్ కార్యదర్శి, అధికార ప్రతినిధి అనూప్ నారంగ్ పేర్కొన్నారు. అయితే... భారత కోచ్‌గా కొనసాగడంపై హండోయో భార్య, కుమారుడితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పారితోషికంపైనా సంతృప్తిగా లేడని సమాచారం. ఇదే సమయంలో సింగపూర్ నుంచి అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ‘బాయ్’తో హండోయో మూడేళ్ల ఒప్పందం 2020 వరకు ఉంది. సింగిల్స్ కోచ్‌గా సుదీర్ఘ శిక్షణా పద్ధతులను ప్రవేశపెట్టి ఆటగాళ్ల శారీరక దృఢత్వం మెరుగుపడటంలో కీలక పాత్ర పోషించాడు. దీని ఫలితమే పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌లు అద్భుత ప్రదర్శనలు చేయగలిగారు. గతంలో ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన ఇండోనేసియా బ్యాడ్మింటన్ దిగ్గజం తౌఫీక్ హిదాయత్‌కు కూడా హండోయో కోచ్‌గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ విజయం గువాహటి: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్త జట్టు అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ జట్టు శుభారంభం చేసింది. నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ 4–3తో గెలిచింది. అహ్మదాబాద్ తరఫున పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ 15–10, 15–7తో ప్రతుల్ జోషిపై, హెచ్ఎస్ ప్రణయ్ 15–10, 15–14తో జు వీ వాంగ్‌పై... మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ 15–6, 15–10తో మిచెల్లి లీపై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ మ్యాచ్‌ల్లో అహ్మదాబాద్‌కు ఓటమి ఎదురైంది. -
సింధుకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు శనివారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో వెళ్తుండగా సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిలో ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘గ్రౌండ్ స్టాఫ్ అజితీశ్ నాతో చాలా దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో అలా మాట్లాడవద్దని ఎయిర్‌హోస్టెస్ అతనికి సూచించగా, ఆమెతోనూ అనుచితంగా వ్యవహరించాడు. ఇలాంటి వాళ్లు ఇండిగోలో పనిచేస్తూ ఆ సంస్థకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు’ అని ట్వీటర్ పోస్ట్‌లో సింధు వివరించారు. అయితే ఇండిగో సంస్థ తమ ఉద్యోగికి మద్దతుగా నిలుస్తూ ‘సింధు అనుమతించిన దాని కన్నా అధిక లగేజీతో విమానమెక్కారు. అది ఆమె సీటు పైన ఉన్న క్యాబిన్లో పట్టడం లేదు. దానిని విమానంలోని కార్గోకు తరలిస్తామంటే ఆమె ఒప్పుకోలేదు. ప్రయాణికులెవరైనా ఎక్కువ సామానును తీసుకొస్తే మేం ఈ విధానాన్నే పాటిస్తాం. కానీ సింధు తన లగేజీ తనతోనే ఉండాలని పట్టుబట్టారు. చివరకు ఆమెను ఎంతగానో అభ్యర్థించి లగేజీని కార్గోకు తరలించాం. ఈ వ్యవహారం సాగుతున్నంత సేపు ఆమె ఆరోపణలు చేస్తున్న మా ఉద్యోగి మౌనంగానే ఉన్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అజితీశ్ ఓ ఉద్యోగిగా తన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించారనీ, సింధు ఈ విషయాన్ని గుర్తిస్తారని తాము ఆశిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. -
మమ్మల్ని అందరూ తప్పుబట్టేవారు...
హైదరాబాద్ :రియో ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించి భారతీయ క్రీడాకారిణిగా అనితర సాధ్యమైన ఘనతను సాధించిన పీవీ సింధు..చిన్ననాటి ముచ్చట్లను ఆమె తల్లిదండ్రులు 'సాక్షి'తో పంచుకున్నారు. సింధు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడిందని, ఏ రోజు కూడా ప్రాక్టీస్‌ను వదిలిపెట్టలేదని ఆమె తల్లిదండ్రులు రమణ, విజయ తెలిపారు. మొదట్లో సింధును కష్టపెడుతున్నామని అందరూ తమను తప్పుపట్టేవారని, ప్రస్తుతం అలాంటివారంతా సింధుతో పాటు తమను కూడా అభినందిస్తున్నారని తెలిపారు. కాగా సింధు భవిష్యత్తులో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ లా ఆడుతుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. మారిన్ నుంచి సింధు చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సింధు విజయాల వెనుక అందరి దీవెనలు ఉన్నాయని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోచ్ గోపీచంద్, అతడి బృందం సింధుకు ఎంతో సాయపడిందన్నారు.