కోచ్‌ హండోయో కొనసాగుతాడు: బాయ్‌  | Koch continues to go with Hondo | Sakshi
Sakshi News home page

కోచ్‌ హండోయో కొనసాగుతాడు: బాయ్‌ 

Published Wed, Dec 27 2017 1:01 AM | Last Updated on Wed, Dec 27 2017 1:01 AM

Koch continues to go with Hondo - Sakshi

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ కోచ్‌ పదవి నుంచి ముల్యో హండోయో తప్పుకోనున్నట్లు వచ్చిన వార్తలను భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) తోసిపుచ్చింది. ‘హండోయో సెలవులకు స్వదేశమైన ఇండోనేసియాకు వెళ్లాడు. కోచ్‌గా వైదొలగనున్నట్లు అతడి నుంచి మాకెలాంటి సమాచారం లేదు. బహుశా ఇది వదంతి కావొచ్చు’ అని బాయ్‌ కార్యదర్శి, అధికార ప్రతినిధి అనూప్‌ నారంగ్‌ పేర్కొన్నారు. అయితే... భారత కోచ్‌గా కొనసాగడంపై హండోయో భార్య, కుమారుడితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పారితోషికంపైనా సంతృప్తిగా లేడని సమాచారం. ఇదే సమయంలో సింగపూర్‌ నుంచి అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ‘బాయ్‌’తో హండోయో మూడేళ్ల ఒప్పందం 2020 వరకు ఉంది. సింగిల్స్‌ కోచ్‌గా సుదీర్ఘ శిక్షణా పద్ధతులను ప్రవేశపెట్టి ఆటగాళ్ల శారీరక దృఢత్వం మెరుగుపడటంలో కీలక పాత్ర పోషించాడు. దీని ఫలితమే పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్‌లు అద్భుత ప్రదర్శనలు చేయగలిగారు. గతంలో ప్రపంచ చాంపియన్, ఒలింపిక్‌ చాంపియన్‌గా నిలిచిన ఇండోనేసియా బ్యాడ్మింటన్‌ దిగ్గజం తౌఫీక్‌ హిదాయత్‌కు కూడా హండోయో కోచ్‌గా వ్యవహరించాడు. 

అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ విజయం 
గువాహటి: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో కొత్త జట్టు అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ జట్టు శుభారంభం చేసింది. నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ 4–3తో గెలిచింది. అహ్మదాబాద్‌ తరఫున పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ 15–10, 15–7తో ప్రతుల్‌ జోషిపై, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 15–10, 15–14తో జు వీ వాంగ్‌పై... మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్‌ 15–6, 15–10తో మిచెల్లి లీపై గెలిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్, పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌ల్లో అహ్మదాబాద్‌కు ఓటమి ఎదురైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement